సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి :!... గోపి, నేను వాళ్ళ స్నేహితుడ్ని కలసి తిరిగి వస్తూ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ కోసం మా స్వంత ఊరు కొమరాడ వెళ్లి తిరిగి మరుచటి దినం ( సోమవారం ) ఉదయం నాటికి రాలేనని అనుకున్నాం. గానీ సోమవా‌రం ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్ అందుకొని బేగ్ అండ్బ్యాగేజ్ కోసం ఏం చేయాలి ? ముందుగా అనుకున్న ప్రకారమైతే ఈరోజే (శనివారమే) ఉద్యోగపు నియామకపు ఆర్డరిస్తే ఈరోజే కొమరాడ ఇంటికి వెళ్ళి బట్టలుసర్దుకొని ఉద్యోగం ఎక్కడకు వేస్తే అక్కడకు సోమవారం వెళ్ళాలని అనుకున్నాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. రేపు 17వ తేదీ సోమవారం ఆర్డర్ ఇస్తే ఉద్యోగంలో చేరిపోవడమే మంచిదనుకున్నాను. ఎంచేతనంటే ఉద్యోగంలో సీనియారిటీ కలిసొస్తుంది. పైగా ఇంటికి వెళ్ళి వస్తే కనీసం ఒక ఏభై రూపాయలన్నా ఖర్చవుతుంది.దానిపై ఎంతో కొంత వేస్తే జత బట్టలు, లుంగీ, తువ్వాలు సాధారణ మైనవి కొనుక్కోవచ్చు. నాదగ్గర రమారమీ 300 రూపాయలుంటుంది.రేపు ఇక్కడ నుండి బయలు దేరితే మధ్యాహ్నం కు చేరుకుని ఉద్యోగంలోచేరిపోవచ్చు. 23వరకూ స్కూల్ పనిదినాలు ఉంటాయి. 24 నుండి వేసవి శలవులు ఇచ్చేస్తారు.అంటే మరో 6 రోజులు ఉండి 24 ఉదయం బయలుదేరి కొమరాడ వచ్చేయొచ్చు " అని గోపితో అన్నాను. నేను చెప్పింది బాగుందన్నాడు గోపి. ఇద్దరం బజారుకువెళ్లి నాకు కావలసిన సామగ్రీ కొని హాస్టల్ కు వెళ్లాం.మరుచటి దినం ఏప్రిల్ 17. ఉదయం ఎనిమిదికే జిల్లాపరిషత్ ఆఫీసును.ఇద్దరం చేరుకున్నాం. అక్కడ ఉన్న పూరిపాక హోటల్లో టిఫిన్ చేసి రోడ్డు మీదకొచ్చాం. ఇంతలో నా బి ఇడి క్లాస్-మీట్ రాంబాబు కనిపించేడు. ఓహ్ ! ప్రభాకరం ఏంటి ఇంత తెల్లవారేసరికి వచ్చా వంటూ తను ఈ దగ్గరలో గల హైస్కూలులో పని చేస్తున్నా నన్నాడు రాంబాబు. వారిద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేసాను.తరువాత నాకు టెక్కలి హైస్కూలులో అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఆర్డర్ ఇస్తారనుకుంటున్నాను అన్నాను. టెక్కలి హైస్కూల్ లోనా ? జూనియర్ కాలేజీలోనా ? అని అడిగాడు రాంబాబు. హైస్కూల్ అంటే అక్కడ గరల్స్ హైస్కూలుంది.బోయస్ హైస్కూల్ లేదు.ఆగరల్స్ హైస్కూల్ హెడ్మిస్ట్రెస్ నిన్ను చేర్చుకోదు. మగ పురుగంటే తనకుగిట్టదు అని పిడుగులాంటి వార్తను నెత్తిన పడేసాడు. గోపి, నేను నిశ్చేష్టులమయ్యాం. ఏమనాలో, ఏం చేయాలో తోచలేదు.ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ గుమస్త్తా సత్యనారాయణను కలవండి ఏమైనా సలహా ఇస్తారన్నడు రాంబాబు.సత్యనారాయణ ఇల్లు ఆదగ్గరలోనే ఉందని అడ్రస్ చెప్పి వెళ్లి పోయాడు రాంబాబు. సత్యనారాయణ ఇంటికి వెళ్ళేముందు చెప్పాను గోపి వాళ్ళ నాన్నగారు( శివున్నా యుడుగారు ) సత్యనారాయణకు ఇమ్మన్న 20రూపాయల గురించి. అతను ఆ 20రూపాయలు తీసుకుంటే ఫరావాలేదు.లేకపోతే రివర్స్ అవుతుంది కథ అన్నాడు గోపి.అదీ నిజమేఅనుకున్నాను. ఎడ్యుకేషన్ గుమస్తానుకలిసాం.విషయాన్నంతా.చెప్పాం. అంతా విన్నాడు. ఆఫీసుకు పదండి అన్నాడు. ఆర్డర్ టైప్ చేసి నా చేతికిచ్ఛేసరికి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలైంది. సత్యనారాయణ గారితో చెప్పి బయలు దేరాం. శుభం . ఏ ఫరవాలేదు వెళ్ళండి అన్నాడతను. గోపి, నేను హోటల్ కు వెళ్లి భోజనం చేసాం. నన్ను టెక్కలి బస్సెక్కించి " ఖర్చులుంటాయి. డబ్బులు చాలవేమే ఎందుకైనా మంచిది ఈ వంద రూపాయలుంచు అన్నాడు. ఉన్న డబ్బులు సరిపడతాయిలే అన్నాను. ఫరవాలేదు ఉంచు అన్నాడు. నీ జీతం వచ్చిన తరువాత తీసుకుంటాలే అన్నాడు.కొద్దిగా మొహమాటం అడ్డొచ్చింది.అయినా అవసరం అటువంటిది. అలాగేలే ! అంటూ ఆ వంద రూపాయలు జేబులో ఉంచాను.నేను శ్రీకాకుళం వచ్చినప్పటి నుండి నీడలా నిలచి అన్ని విధాల సహాయం చేసి,ప్రతి క్షణం తోడుగా నిలచినగోపికి ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ? ఎలా చెప్పుకోవాలి ? అన్న ఆలోచనలో పడ్డాను. ఇంతలో బస్సు కదిలింది. " బై...." చెబుతూ గాలిలో చేతులు ఊపాడు గోపి. ( సశేషం )--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు