నివేదన ------------ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం - గీతాంజలి. బెంగాలీలో 1910 ఆగస్ట్ 14 న ప్రచురితమైంది. ఈ కావ్యం ఆయనకు 1913 లో నోబెల్ బహుమతి సంపాదించి పెట్టింది.ఇది 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లం లోనికి తర్జుమా చేశారు. ఈ ఇంగ్లీషు గీతాంజలి మొదటిసారి 1912 నవంబర్ నెలలో లండన్‌లోని ఇండియా సొసైటీ ప్రచురించింది.గీతాంజలికి తెలుగు అనువాదాలు చాలానే వచ్చాయి. గుడిపాటి వెంకట చలం, రాయప్రోలు సుబ్బారావు, కె.వి.రమణారెడ్డి, ఆదిపూడి సోమనాథరావు, బొమ్మకంటి వేంకట సింగరాచార్య, మువ్వల సుబ్బరామయ్య, కొంగర జగ్గయ్య, శంకరంబాడి సుందరాచారి, బెజవాడ గోపాలరెడ్డి, బెల్లంకొండ రామదాసు తదితరులు ఆంధ్రీకరించారు. గీతాంజలికి నేను చేసిన స్వేచ్ఛానువాదం బుజ్జాయి పిల్లల మాసపత్రికలో అచ్చయింది. కానీ అది పార్థసారథి అనే పేరు మీద వెలువడింది. అందుకు కారణం లేకపోలేదు. బుజ్జాయి పత్రికలో పదహారు పేజీలు తక్కువ కాకుండా రాస్తుండేవాడిని. ఒకటి రెండు నా పేరుతో వెలువడితే మిగిలిన వాటికి మారు పేర్లు పెట్టేవాడిని. అలా గీతాంజలి స్వేచ్ఛానువాదానికి పార్థసారథి పేరు పెట్టవలసి వచ్చింది.అయితే ఇక్కడ నేను ప్రస్తావించబోయే పుస్తకం శీర్షిక "నివేదన". దీని ప్రచురణ కర్త బి.ఎస్.ఆర్. కృష్ణ. Where the mind is without fear (ఇంగ్లీష్ గీతాంజలిలో 35 వ ఖండిక) అనే ఒకే ఒక దానికి వివిధ రచయితల తెలుగు అనువాదాలను బీఎస్ఆర్ గారు సేకరించి తమ పెద్ద కుమారుడు బండ్లమూడి నిర్మల్ కుమార్ స్మృత్యర్థం 2003 సెప్టెంబర్లో ప్రచురించారు. విశ్వకవి ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని అనువదించిన వారి శైలి ఒక దానికొకటి ఎంతో తేడా ఉంది. ఈ పుస్తకానికి పద్మభూషణ్, కళావాచస్పతి కొంగర జగ్గయ్య పరిచయ పరిమళం అర్పించారు. రవీంద్ర సాహిత్యంపై ఆసక్తి కలిగించడానికీ, అనువాద కళ పట్ల అవగాహన పెంచడానికీ ఈ సంకలనం ఎంతో తోడ్పడుతుందన్నది జగ్గయ్యగారి అభిప్రాయం. --- -యామిజాల జగదీశ్


కామెంట్‌లు