పుస్తకపఠనం ----------------- పుస్తకాలు చదవాలి. ప్రతి ఒక్కరూ చదవాలి. అంతర్జాలంలో పుస్తకాలు చదివామని తృప్తి పడటం సరికాదు. ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకుని చదవడంవల్ల కలిగే ఆనందమే వేరు. ఓ కొత్త పుస్తకం పేజీలు తిరగేసేటప్పుడు వచ్చే వాసనకో ప్రత్యేకత ఉంటుంది. క్రమం తప్పక పుస్తకాలు చదివేవారికిది అనుభవపూర్వకమే. నాకు తెలిసి కొందరు పుస్తకాలు మెహర్బానీ కోసం కొంటారు. ఏదో నలుగురికీ తానూ ఓ పుస్తక ప్రియుడనని చెప్పుకోవడానికన్నట్టు పుస్తకాలు కొనే వారినీ ఎరుగుదును. వాళ్ళేమీ చదవరు. ఉత్తినే అందరి ముందూ చదివినట్లు నటిస్తారు. చివరగా చదివిన పుస్తకమేమిటో చెప్పండని అడిగితే అదేదో పుస్తకమండి బలే ఉందండి అంటారు తప్ప ఆ పుస్తకమేమిటో చెప్పరు. అసలు చదివితేగా చెప్పడానికి.నేనూ అచ్చులో నా పేరు చూసుకోవడంకోసం రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో పుస్తకాలు చదివితే ఆ ప్రభావం నా రచనలమీద ఉంటుందేమోనని చాలా కాలం పుస్తకాలు చదవకుండానే గడిపాను. ఏదో ఒకటీ అరా చదివానేమో. కానీ కొన్ని రోజుల తర్వాతగానీ నాకు తెలిసిరాలేదు. పుస్తకపఠనం ఆవశ్యకత. కోన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. వస్తువేదైనా పరవాలేదు చెప్పదలచుకున్న దానిని ఓ క్రమపద్ధతిలో నడిపించడం తెలియాలి. నాకిష్టమైన తమిళ రచయిత ఎస్ రామకృష్ణన్ రాసిన "శిరుదు వెలిచ్చం" అనే పుస్తకం చదువుతున్నప్పుడు ఈ విషయం గ్రహించాను. ఉదాహరణకు భయం అనే అంశాన్ని తీసుకున్నప్పుడు తన అనుభవంతో లేదా సన్నిహితులకో పరిచయస్తులకో కలిగిన అనుభవంతో వ్యాసం మొదలుపెట్టి భయానికి సంబంధిఃచి తీసిన ఓ సినిమానూ అలాగే ఓ నవలనో కథనో ప్రస్తావిస్తూ చివరికొచ్చేసరికి మొత్తంమీద తన అభిప్రాయాన్నిస్తూ ఆ వ్యాసాన్ని ముగిస్తారు. ఈ పద్ధతి నన్నెంతగానో ఆకట్టుకుంది. ప్రపంచన్ అనే ప్రముఖ రచయిత (తమిళం) ఓ సభలో మాట్లాడుతు జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతీ జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరించారు. 1916 ప్రాంతంలో ఓ పది రోజులపాటు పెను తుఫానుతో తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ పది రోజులూ సూర్యుడు ఉదయించలేదంటే నమ్మండి. అంటే వరదబీభత్సాన్ని అంచనా వేసుకోవచ్చు. వరద ఆగిన తర్వాత క్రమంగా వాతావరణం దార్లోకొస్తున్న సమయంలో కొందరేమో అక్కడా ఇక్కడా పప్పూ బియ్తం సేకరించి వరద బాధితులకు తమకు చేతనైనదేదో వండి పెట్టారు.అయితే సుబ్రహ్మణ్య భారతి ఏం చేశారో తెలుసా...ఆయన కొంతమంది పిల్లలను బుట్టలతో రమ్మని తనుండే ప్రాంతంలో తిరిగి తిరిగి వరదలకు చనిపోయిన కాకులను పిట్టలను ఏరి వాటినన్నింటిని ఊరవతల ఓ చోట కుమ్మరించి మనుషుల శవాలకు చేసినట్లే వాటికి అంత్యక్రియలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్య భారతి పిలిచినప్పుడు మొదట శివ అనే కుర్రాడు తిరస్కరించాడు. రేపటి నుంచి పరీక్షలున్నాయని శివా రానన్నాడు. అయితే సుబ్రహ్మణ్య భారతి పరీక్షా లేదా గిరీక్షా లేదు, ముందు నడు అంటూ ఆ శివాను తనతో తీసుకుపోయారు. తర్వాతి రోజుల్లో శివ జఢ్జీ అయ్యారు. ఆయన పెద్దయిన తర్వాత ఓ పుస్తకం రాస్తూ అందులో ఈ సంఘటనను ప్రస్తావించారు. కొందరు పక్షులమీద కవితలు రాస్తారు. అక్కడితో వారి పని సరి. కానీ సుబ్రహ్మణ్య భారతి పిచ్చుకలమీద ప్రకృతి మీదా రచనలు చేస్తూ అందుకు ప్రతిబింబంగా బతికారనేదానికి ఇదొక ఉదాహరణ అనిపిస్తుంది నాకు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు