దాసు గారి సూచన ------------------------- మా నాన్నగారు తమ గురుత్రయం గురించి ఎన్ని విషయాలు చెప్పమన్నా అలుపుసొలుపూ లేకుండా ఎంతసేపన్నా చెప్పుకుంంటూ పోతారు. ఓమారు విశాఖపట్టణం నుంచి మణి గారనుకుంటాను మా ఇంటికొచ్చారు. అప్పుడు ఆయనతో కావ్యకంఠ గణపతి మునిగారి గురించి మాట్లాడటం నేను విన్నాను. అలాగే ఆదిభట్ల నారాయణ దాసుగారు, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి గురించి మధ్యమధ్యలో సందర్భోచితంగా ప్రస్తావించడమూ విన్నాను. దాసుగారితో ఏర్పడిన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ విషయం చెప్పారు. అది 1933 జూన్ నెల. శ్రీ విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో ఎంట్రన్స్ విద్యార్థిగా ప్రవేశించి అయిదేళ్ళు చదువు సాగించారు. అయితే ప్రవేశించిన రెండో నెలలోనే ఓరోజు సాయంకాలం దాసుగారిని వారింట కలిసారట. నాన్నగారు తన గోత్రనామాలు చెప్పి దాసుగారికి నమస్కరించారు. "ఒరేయ్, నువ్వు యామిజాల లక్ష్మీనరసింహులు కొడుకువా? నా చిన్నప్పుడు మా అత్తవారిదీ, మీ నాయన అత్తవారిదీ ఒకే ఊరు (రామభద్రపురం) అవడంవల్ల తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. మీ నాన్నగారు నిరతాన్నదాతగా పేరుపొందిన భాగ్యశాలిరా. నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అడిగారు దాసుగారు.అంతట నాన్నగారు తమ చదువుసంధ్యలు, కవిత్వం చెప్పి కవితా గురువు శతావధాని చెళ్ళపిళ్ళవారని చెప్పుకున్నారు. "అలాగా. అప్పుడే కవివయ్యావన్న మాట. మీ గురువు వేంకటశాస్త్రి గట్టి వాడురా. ఊదితే పద్యం. ఊపిరి వదల్తే పద్యం. నడిస్తే పద్యం. పద్యమే వెంకన్న...." అని దాసుగారు ఓ రెండు పద్యాలు వినిపించమన్నారు. అప్పటికే నాన్నగారు రాసిన శ్రీకృష్ణస్తవ రాజము పుస్తకం అచ్చయింంది. అందులోంచి నాన్నగారు రెండు మూడు పద్యాలు చదివారు. అవి విన్న దాసుగారు "ముద్దుగా ఉన్నాయిరా భావాలు. కానీ సంస్కృతం బాగా తగ్గించాలిరా తాతా" అని సూచించారు. నాన్నగారిని దాసుగారు "తాతా" అనే పిలిచేవారు. దాసుగారితో ఇలా మొదలైన పరిచయంతో నాన్నగారు సమయమున్నప్పుడల్లా ఆయన దగ్గరకు వెళ్ళి జ్యోతిషంలోనూ, కవిత్వంలోనూ కూర్పులూ నేర్పులూ తెలుసుకుంటూ వచ్చారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు