నక్షత్ర మాల ----------------- 1937 జనవరి - మా నాన్నగారి జీవితంలో మరచిపోలేని నెల అది. విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో మా నాన్నగారు చదువుకుంటున్న రోజులవి. సెలవులలో కళాశాల విద్యార్థులు పదిహేను రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావటానికి తక్కువరేటు రైలు టిక్కెట్ మీద ప్రయాణం చేసే వీలు కల్పించారు. ఈ పద్ధతిన విజయనగరం నుంచి మద్రాసుకి టిక్కెట్ తీసుకుని బయలుదేరారు. ఆయన తోపాటు ఆయన చిన్నక్క మరిది ధారాముక్కల చిన్న యజ్ఞేశ్వర శర్మ కూడా వెళ్ళారు. అయితే మా నాన్నగారి చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు చేసినమొక్కబడి తీర్చుకోవాలని గూడూరు వద్ద దిగి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళారు. ఆ రోజుల్లో తిరుమల కొండమీదికి నడిచి గానీ డోలీ సహాయంతో కానీ వెళ్ళాలి. అయితే నాన్నగారూ, శర్మగారూ నడిచే వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికే మా నాన్నగారికి చుక్కలు కనిపించాయి. గాలి గోపురం వద్ద కూర్చుని వేంకటేశ్వర స్వామిని హేళన చేస్తూ ఓ పద్యం చెప్పారు. అది ఆశువుగా చెప్పిన పద్యం. అది విని ఆ పద్యం ఎవరిది అని శర్మగారడిగారు. అయితే నాన్నగారు "ఎవరి పద్యమో చెప్పవలసిన అవసరం నాకేముంది. చెళ్ళపిళ్ళ వారి శిష్యుడిని. నీకా విషయం తెలీదా?" అన్నారు. దాంతో శర్మగారు "నువ్వేదైనా చెప్పు. కానీ వేంకటేశ్వరుడి మీద అలాటి హేళన పద్యాలు చెప్పకూడదు. చెంపవాయగొడతాడు ఆ వెంకన్న" అని చెప్పారు.అప్పటికీ ఆగకుండా అదేదో చూస్తానుగా అంటూ మరొక పద్యం కూడా చెప్పారు నాన్నగారు. "నీకేదో పట్టింది" అని శర్మగారు ముందుకు కదిలారు. వెనకాతలే మా నాన్నగారూ ఈడ్పు కాళ్ళతో ఏడ్పు మొగంతో వెళ్ళారు. స్వామి దర్శనం కానిచ్చుకుని తిరుగు ముఖం పట్టారు. నాన్నగారు పడుతున్న అవస్థను శర్మగారు గమనించారు. అప్పుడు వారు బస చేసిన ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి యజమాని "రండి రండి. కులాసాగా వెళ్ళొచ్చేరా" అని అడిగారు. "వెళ్ళొచ్చా" మన్నారు నాన్నగారు. అయితే ఆయన మాట ఇంటి యజమానికి తెలీలేదు. దాంతో ఆయన మళ్ళీ అడిగారు. నాన్నగారు జవాబిచ్చారు. అప్పుడా ఇంటి యజమాని "ఆయన నోరు ఆడిస్తున్నాడుగానీ ఆ మాటేదో పైకి రావడం లేదేమిటయ్యా" అని శర్మగారిని అడిగారు. కాస్సేపయ్యేసరికి నాన్నగారి బుగ్గలూ పెదవులూ పొంగిపోయాయి. ఏదో బాధ. ఇంటి యజమాని, శర్మగారూ కలిసి నాన్నగారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్ళారు. వైద్యుడు పరీక్షించాడు.ఏమీ లేదే, లోపలంతా బాగానే ఉందే అన్నాడు వైద్యుడు. ముగ్గురూ ఇంటికి వచ్చేశారు. అప్పుడు శర్మగారు "వీడు స్వామివారిని హేళన చేస్తూ పద్యాలు చెప్పాడు. స్వామివారు కొట్టారు దెబ్బ అని. "అలాగా?" అంటూ ఇంటి యజమాని కాగితాలు కలమూ ఇచ్చి స్వామివారిని ప్రార్థిస్తూ పద్యాలు రాయండన్నారు. వెంటనే నక్షత్రమాల పేరుతో నాన్నగారు ఇరవై ఏడు పద్యాలు రాశారు. ఇరవై ఆరో పద్యం రాసేసరికి నాన్నగారి నోటివాపూ బాధా మటుమాయమయ్యాయి. అప్పుడు ఆయన మాట ఎదుటివారికి వినిపించింది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు