పూట కూటింటి తిండిపై పద్యాలు -------------------------------------------- 1946 ప్రాంతం. రాజమండ్రిలో ఉపాధ్యాయ పండిత పరిషత్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు పూట కూటింటి తిండి గురించి ఓ డజన్ పద్యాలు చెప్పారు. అక్కడి వంట బాగులేదని వాపోయారు. పగలు చేసిన కూరనే రాత్రి పూట పచ్చడి చేసి పెట్టేవారట. అన్నమేమో బిరుసెక్కి మేకులల్లే ఉండేదట. ఇక్కడ పెట్టే తిండిని గుర్రాలు కూడా ముట్టుకునేవి కావట. ఏ పూర్వ జన్మ కృత పాప ఫలమేమో కానీ ఈ రాజమండ్రి తిండి రాళ్ళ బండిలా ఉందట. ఉప్పు చాలని కంది పప్పు నోటను బెట్ట / నాల్క నైజ గుణంబు నవసిపోవు / వాడి యెండినదొండ పండ్ల కూరను జూడ .…" అంటూ అడుగుదామంటే ఆరోగ్య శాఖాధికారి ఊళ్ళో లేకపోవడం మరొక బాధ అన్నారు. నెలకు పదిహేను రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పగా ఇరవై చొప్పున తీసుకునే వారట.సారము లేని పప్పు నూనెతో వండే వారట. ఇలా ఇక్కడ ఉన్నంత కాలమూ తిండికి నానా అవస్థలు పడినట్లు చెప్పుకున్నారు. ఇలా సాగిన నాన్నగారి పద్యాలు చదువుతుంటే ఇప్పుడు కూడా అక్కడక్కడా కొన్ని హాస్టళ్ళలో పెట్టే అన్నం సరిగ్గా లేదంటూ వార్తలు రావడం పత్రికలలో చూస్తూ ఉంటాం. ఇక్కడో విషయం గుర్తుకొచ్చింది. నేను మద్రాసులో రామకృష్ణా మిషన్ హైస్కూలులో చదువుకున్నాను. ఈ స్కూలుకి అనుబంధంగా ఓ హాస్టల్ ఉండేది. అక్కడ సాంబారన్నం తిని వచ్చిన విద్యార్థులు క్లాసుకొచ్చి నిద్ర మత్తులో జోగుతుండేవారు. నాకూ అక్కడ సాంబారన్నం తినాలని ఆశ ఉండేది. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది. కానీ రామకృష్ణా మిషన్ వారి మఠం (మైలాపూర్) లో 1995 ప్రాంతంలో ఓ నాలుగు నెలలు పార్ట్ టైమ్ జాబ్ చేశాను. ఏడు వందల యాభై రూప యల వేతనం ఇచ్చేవారు. స్వామి సుకృతానంద సంపాదకత్వంలో వెలువడిన శ్రీ రామకృష్ణ ప్రభలో మ్యాగజైన్ వర్క్ చూసే వాడిని. అలాగే స్వామీజీ డిక్టేట్ చేసే ఉత్తరాలు రాసిపెట్టే వాడిని. రామకృష్ణ ప్రభలో తమిళ రచయిత తెన్కచ్చి స్వామినాథన్ వారి నీతికథలను అనువదించి ఇస్తే తెలుగులో వేసుకునేవారు. వందకుపైగా కథలు అచ్చయ్యాయి. కానీ ఒక్కటీ దాచుకోలేకపోయాను. మఠంలో ఉదయం 11.45 కి "ప్రసాదం" పేరిట అన్నం పెట్టేవారు. స్వామీజీ అనుగ్రహంతో భోంచేసేవాడిని. చాలా చాలా బాగుండేది భోజనం. ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ వరకూ రామకృష్ణా మిషన్ వారి విద్యాలయాలలోనే చదవడం, అక్కడ కొన్ని నెలలు పని చేయడం వంటి వన్నీ ఆకుపచ్చని జ్ఞాపకాలే. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు