అలనాటి జంతు ప్రదర్శన శాల -------------------------------------- మద్రాసులో బీచ్ నుంచి తాంబరం వరకూ ఉండే లోకల్ ఎలక్ట్రిక్ రైలు స్టేషన్లలో పార్క్ స్టేషన్ కి ఉన్న ప్రత్యేకత వారు. ఈ పార్క్ స్టేషన్లో దిగి ఇవతలకు వస్తే మద్రాసుకు ల్యాండ్ మార్కులుగా చెప్పుకోవలసేవి - సెంట్రల్ స్టేషన్, రిప్పన్ బిల్డింగ్, మూర్ మార్కెట్, కార్పొరేషన్ జూ, ప్రభుత్వ ఆసుపత్రి.అయితే అలనాటి పీపుల్బ్ పార్క్ ( కార్పొరేషన్ జూ) కాలగర్భంలో కలిసిపోయి "ఒకానొకప్పుడు..." అని మొదలుపెట్టి కొన్ని విషయాలు గుర్తుచేసుకునేదిగా మిగిలిపోయింది. మన దేశంలోని అతి పురాతన జూలలో ఇదొకటి. రిప్పన్ బిల్డింగ్స్ వెనకాతలే ఈ జూ ఉండేది. ఈనాడు ఈ జూని మరొక చోటుకి తరలించినప్పటికీ నాటి జూ ప్రదేశం మరచిపోలేనిదే. ఎడ్వర్డ్ గ్రీన్ బాల్ఫోర్ అనే మద్రాసు ప్రభుత్వ మ్యూజియం డైరెక్టర్ ఆలోచనతో ఈ పూర్వ జూకి పునాదిపడింది. ఆర్కాట్ నవాబు నుంచి ఈ జాగా పొంది జూ ఏర్పాటుకు ఎడ్వర్డ్ గ్రీన్ శ్రీకారం చుట్టారు. ఏడాది తర్వాత మ్యూజియం ఆవరణలో అతి తక్కువ మృగాలతో ఓ జంతు ప్రదర్శన శాల ఉండేది. ఏడాదికల్లా జంతువుల సంఖ్య మూడు వందలకు పెరిగింది. దాంతో జూని ప్రత్యేకించి తీర్చదిద్దడం కోసం 1963లో ఈ జూని రిప్పన్ బిల్డింగ్స్ వెనుకకు మార్చారు. దీని పేరు పీపుల్స్ పార్క్. అది 1942. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ. మద్రాస్ నగరంపై బాంబు దాడి జరిగే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో జూలో జంతువులను ఏం చెయ్యాలనే ప్రశ్న తలెత్తింది. బాంబు దాడిలో క్రూరమృగాలు తప్పించుకుని నగరంలోకొచ్చెస్తే ప్రజల ప్రాణాలకు ముప్పని భావించిన పాలకులు ఓ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని భీకర జంతువులను కాల్చి చంపేశారు. హానికరం కాని సాధుజంతువులను ఈరోడ్ అనే ప్రాంతానికి తరలించేశారు. రెండేళ్ళ తర్వాత తిరిగి 1944.లో వాటిని మళ్ళీ వెనకు తెచ్చేశారు.ఈ పాత జూ చరిత్రలోనే మరొక దారుణమైన విషయం నమోదైంది. క్రూరమృగాల ఆకలి తీర్చడంకోసం వీధికుక్కలను చంపి వాటి మాంసం పెట్టేవారు. ఇది కార్పొరేషన్ వారు తీసుకున్న నిర్ణయం. అయితే 1970 దశకంలో ఈ పద్ధతిని పాలకులు విడనాడాల్సి వచ్చింది. కుక్కలను చంపడం సరికాదని కొందరు జంతు ప్రేమికులు ఒక్కటై ఉద్యమించడంతో ఆ విధానాన్ని మానుకున్నారు.1940, 50, 60 దశకాలలో ఈ జుని సినిమా సెట్టింగ్స్ గానూ వినియోగించుకునేవారు.1975 లో అమెరికన్ చిత్ర దర్శకుడు ఎల్లిస్ ఆర్. డంగన్ అనే ఆయన మద్రాస్ కార్పొరేషన్ వారికోసం ఈ జూపై ఓ చిత్రమాలికను రూపొందించి ఇచ్చారు.మరో ఏడాదికల్లా కొన్ని కారణాలతో దీనిని ఇప్పుడున్న వండలూర్ అనే ప్రాంతానికి మార్చవలసి వచ్చింది. అటవీ శాఖ వండలూర్ రిజర్వ్ ఫారెస్టులో 1265 ఎకరాలను ఉదారంగా ఇవ్వడంతో 1979 లో వండలూర్ జూ నిర్మాణపనులు చేపట్టి 1985 లో పూర్తి చేశారు. ఆ ఏడాది జూలై 24 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎం.జ. రామచంద్రన్ ఈ కొత్త జూని ప్రారంభించి తనకు ఆదర్శప్రాయుడు అయిన సి.ఎన. అణ్ణాదురై స్మృత్యర్థం అరింజ్ఞర్ అణ్ణా పూంగా (అణ్ణాపార్క్) అనే నామకరణం చేశారు. అయితే నా అదృష్టం బాగుండి పాతకాలపు జూనీ చూశాను. ఈనాటి వండలూర్ జూనీ చూశాను. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు