నందినికో గొప్ప కాన్క ---------------------------- ఓ రెండు రోజుల క్రితం పుస్తకాలను అటూ ఇటూ సర్దుతుంటే ఓ జిరాక్స్ ప్రతి కళ్ళబడింది. అది ఇవతలకు తీసి చదివాను మరొక్కసారి. ప్రముఖ కవి శిఖామణి తన ముద్దులపట్టి "నందిని " పుట్టింరోజు కోసం ఆవిష్కరించిన కవితాసంపుటి. 1996 జనవరి 8న నందిని కోసం పుట్టిన చిట్టి కావ్యంతో, గొప్ప కావ్యంతో శిఖామణి మనసెంత ఆనందపడి ఉంటుందో ముచ్చటపడి ఉంటుందో ఊహించగలను. ఎందుకంటే నేను నా మరదలి కూతురు సమయ కోసం ఓ చిన్ని పుస్తకం రాశాను. అది ఎలాగైనా అచ్చులో చూసుకోవాలని ఆశపడ్డాను. ఈ విషయం "మొలక" వేదాంతసూరిగారితో చెప్పాను. ఆయన వెంటనే మూర్తిగారనే మిత్రుడిని పరిచయం చేశారు. మూర్తిగారు డీటీపీ చేయడమే కాకుండా "సమయస్ఫూర్తి" పుస్తకాన్ని వెరైటీగా రూపొందించి ఇచ్చారు. ఈ శీర్షిక పెట్టింది వేదాంతసూరిగారే. 2010 ఆగస్టులో మా అబ్బాయి ఉపనయనం రోజున సమయతోనే దీనిని ఆవిష్కరింప చేసి వచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. ఎంత ఆనందం వేసిందో ఆనాడు. ఇప్పటికీ నాటి ఆనందానుభూతి నాలోనే చెక్కుచెదరక ఉంది. అప్పుడు సమయకి రెండేళ్ళు. ఆ పాప నాకెప్పటికీ పాపే. అదలా ఉండనిచ్చి, "నందిని" విషయానికొస్తాను. ఎండ్లూరి సుధాకర్ సంపాదకత్వంలో శిఖామణి సంకలన కర్తగా పాఠకలోకానికి వచ్చిన నందిని నేపథ్యం ఆ చిట్టిపాప నాన్న శిఖామణి మాటల్లోనే చూడండి..... "ఇది మా అమ్మాయి నందిని మొదటి పుట్టిన రోజు సందర్భంగా కేవలం నందినిని చూసిన కవులు మాత్రమే పలవరించిన కవితలు. నాకు ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారకులు ఇద్దరు. ఒకరు మద్దూరి నగేష్ బాబు. ఇంకొకరు గరికపాటి నరసింహారావుగారు. నేను నందిని గురించి రెండు మూడు కవితలు రాయడం చూసి నగేష్ బాబు ఇంకో నాలుగైదు రాయండి. నందిని పద్యాలు పేరుతో పుస్తకం వేద్దాం అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు గరికపాటి నరసింహారావుగారు మా ఇంటికి వస్తే ఇదుగోండి మా ఆరిందా అని నందినిని ఆయన చేతులకిచ్చాను. ఆయన నందినిని ఎత్తుకుంటూనే 'ఆరిందావల' అనే పద్యాన్ని ఎత్తుకొని ఆశువుగా రెండు పద్యాలు చెప్పారు. అప్పుడు నందినిని చూసిన కవులతో పుట్టిన రోజుకి ఐదారు కవితలతో ఒక చిన్న ఫోల్డరుగా తీసుకువద్దామనుకున్నాను. అయితే అది చిలికి చిలికి గాలివానైనట్టు ఇంత గ్రంథం అయి కూర్చుంది..." ఇది అరవై పేజీల కవితాసంపుటి. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, పతంజలి శాస్త్రి, పెమ్మరాజు గోపాలకృష్ణ, ఇస్మాయిల్, అత్తలూరి నరసింహారావు, గరికపాటి నరసింహారావు తదితర కవుల భావాలతో దీవెనలతో ఈ పుస్తకం వెలువడింది. నందినికిది ఓ గొప్ప కాన్క అప్పటికీ ఇప్పటికీ ఇప్పటికీ.పాపాయి ముందు నా పద్యం వెలవెలబోతోందని "చెట్టుకవి" ఇస్మాయిల్ తో పలికించిన నందిని ఎంత అదృష్టవంతురాలో కదండీ!! .... - యామిజాల జగదీశ్


కామెంట్‌లు