'చెప్పుకోదగ్గ స్కూల్' నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎదులపురం(హుజూరాబాద్) నుండి దమ్మెకుంటె(జమ్మికుంట) కు బస్సులో వస్తున్నాను. ఆ రెండు టౌన్ల మధ్య పద్నాలుగు కిలోమీటర్ల ఉంటుంది! మధ్యలో చెల్పూర్ విలేజ్ ఉంటుంది! అక్కడ సుమారు ముప్పై మంది స్కూల్ పిల్లలు బస్సు ఎక్కారు- ఆడ కండక్టర్ చాలా విసుక్కుంది ఆ పిల్లలు బస్సు ఎక్కుతోంటే- వాళ్ళందరికీ బస్సు పాస్ లు ఉన్నాయి మరి! బిక్షగాళ్లతో వ్యవహారించినట్టు మాట్లాడింది! ఆ పిల్లలందరూ స్కూల్లో మాదిరే క్రమశిక్షణతో బస్సులో నిలబడ్డారు! వారందరిదీ నెక్స్ట్ స్టేజ్ శాలపల్లే అయుండాలి అనుకున్నాను! కానీ, అక్కడ దిగలేదు! తరువాత జమ్మికుంట స్టేజే! అది టౌన్ కద? టౌన్ నుండి చెల్పూర్ విలేజ్ కి వచ్చి చదవడం ఏమిటి? నాకు ఆసక్తి కలిగి ఒక పిల్లవాడిని అడిగాను ' మీది జమ్మికుంట టౌనా? ' అని! 'ఔను' అన్నాడు! 'జమ్మికుంట నుండి చెల్పూర్ రావడం ఏమిటి? అక్కడ చాలా ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి కద?' అంటే 'ఇది బెస్ట్ స్కూల్' అన్నాడు! అంటే? ఒక టౌన్లో ఉన్న ప్రైవేటు స్కూల్స్ కంటే- ఒక గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ బెటర్ అన్నమాట!? నాకు ఆశ్చర్యం కలిగించింది! 'ఎప్పటినుండి చెల్పూర్ స్కూల్ కు వస్తున్నావు?' అంటే 'ఫిఫ్త్ దాకా జమ్మికుంట ప్రైవేటు స్కూల్లో చదివాను- ఇప్పుడు సిక్త్ క్లాసుకి చెల్పూర్ స్కూల్ కు వచ్చాను ' అన్నాడు! 'బాగుందా స్కూల్? ' అంటే! 'బాగుంది' అన్నాడు! ఆ పిల్లవాడి పేరు అఖిల్- తండ్రి జమ్మికుంట బస్టాండు దగ్గర హోటల్ నడుపుతాడట! నేను మరికొందరిని సంప్రదించాను,చెల్పూర్ స్కూల్ గురించి- వారు చెప్పిందాని ప్రకారం - ఇంతకుముందు చెల్పూర్ హెడ్ మాస్టారు , అతని సహ ఉపాధ్యాయ బృందం స్కూల్ విషయం గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారట! ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పంతుళ్లందరూ ఒక టీమ్ స్పిరిట్ తో పని చేసి- పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా పెంచారట! క్రమంగా స్కూల్ పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది! నాలుగైదు సంవత్సరాల నుండి చెల్పూర్ స్కూల్ కు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయట! అయితే, పాత టీమ్ ఇప్పుడు లేదని- పాత పద్దతిలోనే నడుస్తున్నట్టుందని అన్నారు! కేవలం ఆ పిల్లవాడి అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకున్నా- చెల్పూర్ స్కూల్ విషయం అర్థం అవుతుంది! అందుకు బాధ్యులైన వారికి అభినందనలు! అలాగే- తన కొడుకును జమ్మికుంట టౌన్ ప్రైవేటు స్కూల్ నుండి చెల్పూర్ విలేజ్ గవర్నమెంట్ స్కూల్ కు మార్చి - డే స్కూల్ స్టూడెంట్ గా - ఇంట్లో ఉండి చదివిస్తున్న అఖిల్ తండ్రికి కూడా అభినందనలు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా- గత ఆరు సంవత్సరాల్లో చాలా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసారు!తొంబై స్కూల్ల వరకు కొత్తగా పెట్టినట్టుంది!విద్యార్థులు వేలల్లో చదువుతున్నారు- హస్టల్లలో ఉంటున్నారు! ఖర్చు చాలానే పెడుతున్నారు! కానీ- పిల్లలు తల్లిదండ్రుల నుండి దూరం అవుతున్నారు! 'దూరం' అవడం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? పిల్లలు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసేదాకా,ఇంటి నుండి చదవడం ఉత్తమ విధానం! మనుషులు మధ్య ఎంత దూరం పెరిగితే, మానవ సంబంధాల మధ్య కూడా అంత దూరం పెరుగుతుంది! 'అభివృద్ధి' సాధిస్తున్నారు సరే- దాని తాలూకా విలువలు ఎటువంటివి? అవి వ్యక్తిగత జీవితంలో - సామాజిక జీవితంలో ఎలా ఎప్పుడు అనుభవం లోకి వస్తాయో ఎవరైనా ఎరుగుదురా? ప్రభుత్వం వారు తక్కిన స్కూల్స్ అన్నిటిని , చెల్పూర్ స్కూల్ మాదిరి చెయ్యలేరా? తుమ్మేటి రఘోత్తమరెడ్డి జమ్మికుంట నుండి


కామెంట్‌లు