మహా బలశాలి బర్బరీకుడు భారతమూ పాండవులూ ద్రౌపదీ కృష్ణుడూ మొదలైన వారి కథలన్నీ మన దేశంలో అందరికీ సుపరిచితమైనవే అయినా ద్రౌపది వల్ల పాండవులకు కలిగిన సంతానం (ఉప పాండవులంటారు వీళ్ళని) గురించి కాని పాండవుల మిగిలిన భార్యల గురించి కాని వారి సంతానాల గురించి రాని పెద్దగా ఎవ్వరికీ తెలియదు.విజయ విలాసం వంటి కావ్యాలు చదువుకున్న వారికి అర్జునుని భార్యల గురించి తెలిసే ఉంటుంది.వారందరి గురించి వ్రాయడం మొదలెడితే నా వ్యాసం చేట భారతమౌతుంది కనుక మన కవసరమైన విషయాలకే పరిమితమౌతాను.పాండవుల్లో మిగిలిన వారి సంతానం గురించి మనవాళ్ళకు బాగా తెలియక పోయినా 60 సంవత్సరాల క్రిందట నిర్మించబడి నేటికీ అక్కడో ఇక్కడో టీవీలలోనో విజయవంతంగా ప్రదర్శింపబడతున్న మాయాబజార్ సినిమా ధర్మమా ఆని ఘటోత్కచుని గురించి ఆంధ్రులందరికీ పూర్తిగా తెలుసు. ఘటోత్కచుడు భీముని కుమారుడని చాలా మందికే తెలుసు. కాని భీముడు హిడింబను ఎప్పుడు ఎలా పెళ్ళిచేసుకున్నాడో తెలియక పోవచ్చు. పాండవులు లక్క ఇంటినుంచి తప్పించుకుని వచ్చి అరణ్యంలో ఉంటున్నప్పుడు మిగిలిన అన్నదమ్ములు తల్లి నిద్రిస్తుండగా భీముడు మేల్కొని ఉండి వారికి కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంటాడు. ఆ అడవి ప్రాంతంలో హిడింబాసురుడనే రాక్షసుడుంటాడు. అతనికి నర వాసన తగల గానే తన చెల్లెలైన హిడింబను పిలిచి ఆ నరులను తీసుకొచ్చి తనకు ఆహారంగా ఇమ్మంటాడు. అన్నకోరిక ప్రకారం ఆ నరులను తేవడానికి బయలు దేరిన హిడింబకు నిద్రిస్తున్న పాండవులు వారికి కాపలా కాస్తున్న భీముడు కనిపిస్తారు. భీముడిని చూడగానే హిడింబ అతనిని మోహించి ఎలాగైనా అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమె బ్రతిమాలడం భీముడు ససేమిరా అనడం ఇలా కాలయాపన జరుగుతూ ఉంటే హిడింబాసురుడే అక్కడికి వస్తాడు. ఆ హిడింబాసురునితో భీముడు యుధ్దం చేసి అతడిని ఓడిస్తాడు. ఈ యుధ్దం గోలకి పాండవులు వారి తల్లి మేల్కొంటారు. హిండింబ కోరికను విని ఆమె భీముని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తారు. కాని భీముడు ఆమెతో పగటి పూట గడిపినా రాత్రయే సరికి వచ్చి తమతోనే ఉండాలని కుంతి షరతు పెడుతుంది. అదే కాక భీమునికి ఒక సంతానాన్ని కన్న తర్వాత ఆమె అతడిని విడచి పెట్టి వెళ్ళి అడవిలోనే ఉండాలని ధర్మరాజు అంటాడు.. ఈ షరతులకు ఆమె ఒప్పుకోవడంతో భీమునికీ హిడింబకూ వారందరి సమక్షం లోనే వివాహమౌతుంది. ఆ విధంగా కుంతీ దేవి అంగీకారంతో ఆమె సమక్షంలో పాండవపుత్రుడైన భీముడు హిడింబను వివాహం చేసుకోగా ఆమె పాండవుల ఇంటికి మొదట వచ్చిన కోడలౌతుంది. భీమునికీ హిడింబకూ ఘటోత్కచుడు పుట్టాక మొదటి ఒప్పందం ప్రకారం అతడిని తీసుకుని హిడింబ అడవులకి పోతుంది. అడవులలో ఉన్న ఘటోత్కచునికి అభిమన్యుడు అనుకోకుండా తారసపడడం శశిరేఖతో అతడి వివాహాన్ని తన చేతుల మీదుగా జరిపించడం మన మాయాబజార్ చిత్ర కథ.( ఇది నిజంగా జరుగక పోయినా కథని అద్బుతంగా మలచి మాయాబజార్ మనలనందరినీ అలరించేటట్లు తీసారు ఆ చిత్ర నిర్మాత దర్శకుడు రచయిత. అలాగ ఈ సినిమా వలన మనకు హిడింబ గురించి ఘటోత్కచుని గురించి తెలిసినా ఘటోత్కచుని భార్య గురించి కాని అతడి సంతానం గురించి కాని ఏమీ తెలియదు.వారి గురించే ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఘటోత్కచుని భార్య పేరు మౌర్వి.( ఈమెకు అహిలావతి అనే మరో పేరు కూడా ఉంది.ఈమె నాగకన్య అని కూడా అంటారు. నాగులు ఆంధ్రులు. వీరు మహా బారత యుధ్దంలో కౌరవుల తరఫున పోరాడారంటారు.) వీరికి పుట్టిన వాని పేరే బర్బరీకుడు. మహా బలశాలి. ఇతడికి తన తల్లి విలు విద్యాది అనేక విద్యలలో శిక్షణ ఇచ్చిందట.ఇతడు తపస్సుచేసి మహా శక్తిమంతమైన మూడు బాణాలను వరంగా పొందాడు.ఇంత శక్తిమంతుడై ఉండడం వల్ల ఇతడికి మహా యుధ్దంలో పాల్గొనాలని తన శక్తితో మహా సైన్యాలను మట్టుబెట్టి కీర్తి గడించాలని కోరికగా ఉండేది. అటువంటి సమయంలో ఇతడికి కౌరవ పాండవుల మధ్య మహా సంగ్రామం జరుగబోతోందని తెలిసింది. యుధ్ధంలో పాల్గొనడానికి తన తల్లి అనుమతిని కోరతాడు.ఆమె అందుకు అంగీకరిస్తూ ఎప్పుడైనా అతడు బలహీనమైన పక్షాన్నే పోరాడాల్సి ఉంటుందని అలాగే చేస్తానని అతడినుంచి వాగ్దానాన్ని తీసుకుని కురుక్షేత్రానికి పంపుతుంది.ఇక్కడ మనం బర్బరీకుని పూర్వ జన్మ వృత్తాంతం కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతడు పూర్వ జన్మలో ఒక యక్షుడు. బ్రహ్మాది దేవతలందరూ విష్ణు మూర్తి దగ్గరకు పోయి లోకాల్లో అరాచకాన్ని అరికట్టి దుష్టులను సంహరించడానికి అతడు పూనుకోవలసిందిగా కోరుతారు. అప్పుడు ఒక యక్షుడు ఈ పాటి దానికి ఆయనెందుకు? తానొక్కడినే ఆ పని చేయగలని బీరాలు పోతాడు. అప్పటికి ఊరుకున్నాఆ యక్షుని చావు ఎప్పటికో ఒకప్పటికి తన చేతిలోనే ఉందని విష్ణుమూర్తి అంటాడు. ఆ యక్షుడే ఈ జన్మలో బర్బరీకునిగా పుట్టాడు. కౌరవ పాండవ యుధ్దం ప్రారంభం కాకముందు శ్రీ కృష్ణుడు అందరినీ పిలచి తాము ఒక్కొక్కరుగా పోరాడితే యుధ్దాన్ని ఎన్నాళ్ల లో ముగించగలరని ప్రశ్నిస్తాడు. దానికి భీష్ముడు 20 రోజులని జవాబివ్వగా అర్జునుడు 28 రోజులంటాడు..ఇలా ఎవరికి వారి వారు తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుంటూ చెప్పగా బర్బరీకుడు దానికంత సమయం ఎందుకు ఒక్క నిమిషంలో యుద్దాన్ని ముగించేయ గలను అంటాడు. ఎట్లయినా ఈ బర్బరీకుని మదం అణగించి అంతమొందించకపోతే మహా భారత యుధ్దం తాననుకున్నట్లుగా జరగదని గ్రహించిన శ్రీ కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో బర్బరీకుని వద్దకు వచ్చి అతని ప్రతిభా విశేషాలు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ అతని బాణాల శక్తిని తనకు చూపించ మంటా డు. బర్బరీకుడు దగ్గర లో ఉన్న ఒక రావి చెట్టు ఆకులన్నిటిమీదా ఒకే సారి ఒకే బాణంతో రంధ్రాలు చేసి తన ప్రతిభ చూపిస్తాడు.అప్పటికీ ఆ బాణం ఆగిపోయి బర్భరీకుని అమ్ముల పోదిలోనికి తిరిగి పోకుండా శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.అప్పుడు బర్బరీకుడు మహానుభావా నీకాలి క్రింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది.దానిని ఛేదించనిదీ నా బాణం వెనుకకు మరలదు.దయచేసి మీ పాదాన్ని పక్కకు జరుపమని కోరగా శ్రీ కృష్ణుడు అలా చేయగా ఆ బాణం ఆకుని ఛేదించి బర్బరీకుని పొది లోనికి చేరుతుంది. అప్పుడు శ్రీ కృష్ణుడు బర్బరీకునితో నీ తల్లి నిన్ను బలహీనమైన పక్షం తరఫున యుధ్దం చేయమందికదా? నీవు ఎవరి తరపున పోరాడుతావని అడుగుతాడు.ఆ విషయం తెలిసిన వ్యక్తి సామాన్యుడై ఉండడని తోచి బర్బరీకుడు స్వామీ నీ నిజరూపం చూపించమని ప్రాధేయపడతాడు.అప్పుడు శ్రీ కృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపించగా బర్బరీకుడు స్వామీ నీవు ఏం కోరినా అలాగే చేయడానిక సిధ్ధంగా ఉన్నానంటాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు నీవు ఏ పక్షాన చేరినా అది బలవంతమైనదే అయిపోతుంది కదా? అందువలన నీవు తల్లి మాట ప్రకారం బలహీన మైన పక్షాన పోరే అవకాశం లేదంటాడు.తనకు ఇచ్చిన మాట ప్రకారం బర్బరీకుని శిరస్సు తనకు కావాలంటాడు. దానికి బర్బరీకుడు అంగీకరించి ఒక్క కోరిక కోరతాడు. తనకు యుద్దంలో పాల్గొనే అవకాశం లేకపోయినా యుధ్ధం పూర్తిగా చూసే అవకాశం కల్పించమని కోరుతాడు. శ్రీకృష్ణుడు అప్పుడు బర్బరీకునికి శిరఛ్చేదం గావించి అతడి తలను ఒక పర్వతం మీద నిలబెట్టి మహా భారత యుధ్దాన్ని పూర్తిగా తిలకించ గలిగే ఏర్పాటు చేస్తాడు. మహా భారత యుధ్దానంతరం వీరు లందరూ తమలో ఎవరు ఎక్కువ మందిని చంపారని వాదించుకుంటూ శ్రీ కృష్ణుని వద్దకు రాగా తాను కూడా యుధ్ద రంగం మధ్యలో ఉండిపోవడం వల్ల పూర్తిగా చూడలేకపోయానని అంతా పూర్తిగా చూసిన బర్బరీకుని శిరస్సునడగమని చెబుతాడు.అప్పుడు అందరూ బర్బరీకుని శరస్సు వద్దకు వచ్చి అడుగగా తాను యుధ్దాన్నంతటినీ పూర్తిగా తిలకించానని కాని వారిలో ఎవరూ ఎవరినీ చంపినట్లు తనకు కనిపించలేదనీ అందరినీ శ్రీ కృష్ణుని చక్రాయుధమే చంపినట్లు తనకు కనిపించిందనీ చెబుతాడు. ఆ విధంగా గీత లో శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పినట్లు చంపేదీ చంపించేదీ అంతా ఆయనేనని అందరికీ అర్థమౌతుంది. *** శ్రీ కృష్ణుని చేతిలో చంపబడిన బర్బరీకుని శిరస్సు పూజార్హమే కదా? ఈ బర్బరీకుని శిరస్సు రాజస్తాన్ లో ఖాటూ అనే ప్రదేశంలో పెద్ద ఆలయం కట్టించబడి అక్కడ విశేషమైన పూజలందుకుంటోంది. అక్కడ బర్బరీకుని ఆ ప్రదేశం పేరుతో ఖాటూ శ్యాం బాబాగా పిల్చుకుంటూ పాటలు పాడుకుంటూ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ బర్బరీకునికి మన దక్షిణ దేశంలో అంత ప్రచారం కాని ఆలయాలు కాని లేవు (ఒక మిత్రుడు తెలిపిన దాని ప్రకారం హైదరాబాదులో కాచిగూడా స్టేషన్ కి దగ్గర లో ఒక ఆలయం ఉందట. నేను చూడలేదు) కాని ఉత్తరాదిలో రాజస్థాన్ లోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ఆలయాలున్నట్లు తెలుస్తోంది.ఢీల్లీలో క్రిషి విజ్ఞాన్ కేంద్రకి దగ్గర లో ఒక ఆలయం ఉందట.నేపాల్ లో ఇతడిని కిరాట రాజు యాలంబర్ అంటూ కొలుస్తారట.ఖట్మండూ వేలీలో ఆకాశ్ భైరవ్ పేరుతోనూ హిమాచల్ ప్రదేశ్ లో కమన్ నాగ్ దేవుని పేరుతోనూ కొలుస్తారట.(ఇతడి పేరులోని నాగ్ అనేది అతని తల్లి నాగవంశానికి చెందనదిగా సూచిస్తోందనుకావాలేమో?) ఈ బర్బరీకుని కథ వ్యాస ప్రోక్తమైన మహా బారతంలో లేదట. కాని ఇంత విశాల ప్రాంతంలో విశేషమైన ప్రచారం పొంది పూజలందుకుంటున్న బర్బరీకుని గురించి తెలుసుకోవడం ఆనందదాయకమే కదా? P.S: ఇది విషయం సేకరణ చేసి వ్రాసినదే కాని నా స్వంతం కాదు.అందువలన దీని authenticity గురించి చర్చించవద్దు. మిత్రులెవ్వరికైనా ఇంకా బర్బరీకుని గురించి ఇతరమైన విషయాలు తెలిసి పంచుకుంటే అందరూ సంతోషిస్తారు. ******


కామెంట్‌లు