రాజ్య రక్షణ.బేతాళకథ --.బెల్లంకొండ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు పైనున్న బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగా నడవసాగాడు. 'మహీపాలా నీవు బిలహరి,భాండి,హితదో,భల్లాతి,దేశి,లలిత,వరాళి,గౌళ,ఘూర్జర,జౌళి, కళ్యాణి,ఆహిరి,సావేరి,దేవక్రియ,మేఘరంజి,కురంజి,మళహరి,కాంభోజి,నాహుళి,ముఖారి,రామక్రియ,గండక్రియ,ఘంటారావ,శంకరాభరణము వంటి అనేక రాగాలు పాడగలిగిన సంగీత విద్వాంసుడవని నాకు తెలుసు. నాకు ఉన్న ఒక సందేహాన్ని నీకు ప్రయాణ బడలిక తెలియకుండా కథా రూపంలో చెపుతాను విను... చంద్రగిరి రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. వయోభారం తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి,తన ఇరువురి కుమారులైన జయుడు,విజయు లకు పట్టాభిషేకం చేసి'చిరంజీవులారా మీకు కొన్ని విషయాలు చెపుతాను వినండి,ధర్మం నాలుగు పాదాలు అంటే,మోదటి పాదం సత్యమని,రెండవ పాదం శుచి శుభ్రతలు,మూడవ పాదం దయ, నాలుగో పాదం దానమని మనుస్మృతి చెపుతుంది.ప్రయత్నం,చురుకుదనం,ఇంద్రియ నిగ్రహం, యుధ్ధనిర్వాహణా కౌశలం,ఆత్మనిగ్రహం,పరాక్రమం,ఏ పరిస్ధితులలోనూ భయపడకుండా ఉండటం,కోపాన్ని,కోరికలను,అహంకారాన్ని,అసూయను దరి చేరనివ్వకండి. నిష్పాక్షికత,క్షమ,దయ,ప్రజల పట్ల దయా గుణం, దుష్టులు,చోరులు,శత్రువుల పట్ల ఖటినంగా ఉండాలి . జూదానికి, మధ్యానికి,యుధ్ధనికి బానిస కాకూడదు.విద్యావంతులైన మీకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా గతం లో ఉమ్మడిగా ఉన్న మన రాజ్యం ఎంతో బలంగా ఉన్నందున ఇరుగు పొరుగు రాజులు మనపై దండెత్తి రావడానికి సంకోచించే వారు. నేడు మన రాజ్యం రెండుగా విభజించబడి బలహీనంగా ఉండటం వలన వారితో యుధ్ధభయం ఎప్పుడూ ఉంటుంది ఈవిషయం మీ ఇరువురూ ఎన్నడూ మరచి పోవద్దు.అన్ని రంగాలలో అభివృధ్ధి సాధించండి. ప్రజలకు కష్టం కలేగే పనులు,పన్నులు విధించకండి'అని హితబోధ చేసి సతీ సమేతంగా ప్రశాంత జీవనం గడపటానికి వనజీవనం ప్రారంభించాడు. జయుడుతనరాజ్య ప్రజలను వ్యవసాయం,విద్యా,వ్యాపర వంటి అన్నిరంగగాలలో ప్రోత్సహించి అభివృధ్ధి సాధించాడు. విజయుడు తన దృష్టి వ్యవసాయ రంగంపై నిలిపి, రాజ్యంలోని బంజరు భూములను కొత్తగా వ్యవసాయ భూములుగా మార్చి, తనసైన్యం కత్తులను కొడవళ్ళు,వ్యవసాయపని ముట్లుగా చేసి విరివిగా ధాన్యం పండించేలా తన రాజ్యప్రజలను ప్రోత్సహించాడు. ప్రజలంతా శ్రమించి గొప్పగా వ్యవసాయం చేసారు.ప్రకృతి వారికి అనుకూలంగా ఉండటంతో గాదెలు,పాతర్లు నిండాయి.ఎక్కడ చూసినాధాన్యరాసులే! ప్రజలంతా చేతినిండా ధనం రావడంతో సంతోషగా ఉన్నారు. ఇదంతా విజయుని రాజ్యానికి సరిహద్దు రాజ్యమైన చంపావతి రాజు విక్రమ సేనుడు గమనించి వేగుల ద్వారా జయుడు తన రాజ్యానికి దూరంగా ఉన్నసమయంలో, విజయుని అశ్వ-గజ-రధ-సైనిక బలగాల వివరాలు సేకరించి విజయుని పై యుధ్ధం చేసి రాజ్యాన్ని పొందాడు. 'విక్రమార్క మహారాజా విజయుడు న్యాయంగానే జీవించాడు.పరుల రాజ్యంపై ఏనాడు పోరుకు పోలేదు.అయినప్పటికి విజయునికి ఈదుస్ధితి రావడానికి కారణం ఏమిటి? తెలిసి సమాధానం చెప్పక పోయావో నీతలపగిలి మరణిస్తావు'.అన్నాడు బేతాళుడు. దేశం అభివృధ్ధి చెందాలి అంటే వ్యవసాయం,వ్యాపారం,విద్యా,వంటి అన్నిరంగాలలో సమతుల్యత పాటించాలి.కాని విజయుడు చేసిన తప్పు రాజ్య రక్షణ గురించి ఆలోచించకపోవడం.రాజ్యం వీరభొజ్యం.బలవంతుడిదే రాజ్యం.ఇది వేల సంవత్సరాలుగా భూమిపై జరుగుతున్నదే! ఇక్కడ నిజాయితీ,మంచితనం కాదుముఖ్యం శత్రురాజులను ఎదుర్కొనే శక్తిహీనుడుగా విజయుడు ఉన్నాడు.కత్తులను కొడవళ్ళుగా మార్చడం అతను చేసిన పెద్దతప్పు.వ్యవసాయం వేరు,దేశరక్షణ వేరు.కత్తిపని కత్తిదే,కొడవలి పని కొడవలిదే అని అతను తెలుసు కోలేక పోవడం వలన విజయుడు రాజ్యం కోల్పోయాడు' అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌన భంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికొరకు వెనుతిరిగాడు.


కామెంట్‌లు