పిలుపులు ------------ పేర్లు పెట్టడమే పిలుపుల కోసం. బంధుత్వాలు ఉండే పక్షంలో వావివరసలతో పిలవడం మామూలే. మా పక్కింట్లో ఓ రెండున్నరేళ్ళ కుర్రాడు ( తనీష్) ఉన్నాడు. వాడు నన్ను తాత అంటాడు. మా ఆవిడని ఆంటీ అని‌, మా అబ్బాయినైతే మామ అంటాడు. ఇలా పిలుస్తున్నాడేమిటాని ఆలోచనలో పడటం అనవసరం. మద్రాసులో నేను ఓ హ్యాండీక్రాఫ్ట్స్ షాపులో పని చేస్తున్నప్పుడు ఆ షాపు యజమానిని అన్నయ్యా అని, యజమానురాలిని అక్కయ్యా అని పిలిచే వాడిని. నేనే కాదు షాపులో నాతో పని చేస్తున్న వాళ్ళూ అలాగే పిలిచేవాళ్ళు. "అరుణాచలం"లో చలంగారిని ఎవరైనాసరే "నాన్నా" అనే పిలిచేవారు. బాల్యంలో చలంగారింటికి వెళ్ళిన మొదట్లో అందరూ ఎందుకలా పిలుస్తారో తెలిసేది కాదు. నాకు మా నాన్నంటూ ఉంటే మళ్ళీ ఈయనను అని పిలవడమెందుకు అని మనసులో అనుకునే వాడిని. కానీ దానికి జవాబేమీ లేదు. వీటూరి (సినీ రచయిత) వారు మాకు బంధువులే. ఆయనను బాబాయ్ అని పిలిచేవాళ్ళం. వాళ్ళావిడను వదిన అనే వాళ్ళం. మా మావగారిని కృష్ణగారనే సంబోధించే వాడిని ఎవరితోనైనా చెప్పాల్సి వచ్చినప్పుడు. బుజ్జాయి మ్యాగజైన్ యజమాని అప్పారావుగారు యామిజాలగారు అని ఇంటి పేరుతోనే పిలుస్తుంటారు. కొందరు యామి అని ఇంటిపేరుని కుదించి పిలిచేవారు నన్ను. మా ఇంట పెద్దన్నయ్యను ఆందరం అన్నయ్య అని పిలుస్తాం. మిగిలిన వాళ్ళం పేర్లతోనే పిలుచుకుంటాం. మా అన్నయ్య చిన్నప్పుడు నన్ను ఎస్ ఆర్ అని పిలిచేవాడు. ఎస్ ఆర్ అంటే సైలెంట్ రౌడీ. ఎందుకలా పిలిచే వాడో తెలీదు. మా అన్నయ్యకోసం రామచంద్రరావు గారని ఓ మిత్రుడు వచ్చేవారు. ఆయనను ఒకాయన అనే పిలిచేవాళ్ళం. అలాగే అన్నయ్య కొలీగ్ ఒకరు స్కూటర్ మీద వస్తుండేవారు. అందుకే ఆయనకు స్కూటరాయన అని పిలిచేవారం.మా అబ్బాయి పేరు సాత్యకి. అయితే కొందరు ఆ పేరు పలకలేక "సత్య" అని అనే పిలుస్తుంటారు. ఇంకొందరైతే జానకిలాగా అమ్మాయి పేరు పెట్టారేంటీ మీ అబ్బాయికి అని అడిగిన వాళ్ళున్నారు. అప్పుడు భారతంలో ఉన్న సాత్యకి కథనాన్ని చెప్పేవాడిని.ఇక మద్రాసులో నాకో మిత్రబృందం ఉండేది. ఓ ఏడెనిమిది మంది ఇంటికి దగ్గర్లో ఉన్న సోమసుందరం గ్రౌండులో కలుసుకునే వాళ్ళం. వారిలో ఇప్పటికీ టచ్ లో ఉన్నవారు జె.ఎల్. నరసింహారావు, రాజర్షి‌, సుబ్బారావు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళ పేర్లయితే గుర్తే. సుబ్బారావు తమ్ముళ్ళు. అశోక్‌, మహేష్, బాబూరావు. ఇంకో ఒకరిద్దరు ఎవరో తెలీడం లేదు. నరసింహారావే అందరికన్నా పెద్ద. సుబ్బారావు ఇద్దరు తమ్ముళ్ళూ నరసింహారావుని నరసింగాడు అని పిలిచేవారు. కొసమెరుపు : ఓ పనిమనిషి మా ఆవిడితో నన్ను చూసి మరీ ఇంత పెద్దాయనను ఎందుకు పెళ్ళి చేసుకున్నారు అని అడగడం విన్నాను. ఆమె అలా అనడంలో తప్పేమీ లేదు. నా జుత్తు సుబ్బరంగా ముగ్గుబుట్టయి వెండితీగల్లా నిగనిగలాడటంతో నన్ను ఆ మనిషి ఓ వయోవృద్ధుడిగా లెక్కకట్టేసిందన్న మాట.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు