కాదేది క్రికెట్టుకి అనర్హం!! ------------------------------- చిన్నప్పుడు గోలీలు బొంగరాలు, కర్రాబిళ్ళా‌‌, దొంగాపోలీస్, బాస్కెట్ బాల్‌ మొదలుకుని క్రికెట్ వరకూ రకరకాల ఆటలు ఆడినప్పటికీ క్రికెట్టుకున్న ప్రాధాన్యం వేరు.క్రికెట్ ఆడటానికి అవసరమైన బంతీ బ్యాటుకీ డబ్బులు ఉండేవి కావు. అందుకోసం రకరకాల బంతులను వాడేవాళ్ళం. వాటిలో ఎండిపోయిన నిమ్మకాయ, నారింజకాయ, పాడైపోయి పనికిరాదని పారేసిన సైకిల్ ట్యూబ్ తీసుకొచ్చి వాటిని రింగులుగా కట్ చేసి నోట్ బుక్కులో పేపర్లు చింపి వాటిని ఉండగా చేసి దానికి కత్తిరించుకున్న సైకిల్ ట్యూబ్ రింగులు చుట్టి బంతిగాచేసి ఆడేవాళ్ళం. ఎవరి దగ్గరైనా డబ్బులుంటే చిన్న చిన్న రబ్బర్ బంతులను కొనుక్కొచ్చి ఆడేవాళ్ళం. ఓ జట్టుగా ఏర్పడిన తర్వాత మా స్కూలు సమీపంలో ఉన్న టీ నగర్ స్పోర్ట్బ్ క్లబ్బుకెళ్ళి అక్కడ టెన్నిస్ ఆడి మూలన పడేసే ట కవర్ బాల్బ్ ని రూపాయికి కొనుక్కొచ్చి ఆడేవాళ్ళం. బ్యాట్ లేకపోయినప్పుడు హ్యాండ్ క్రికెట్ ఆడేవాళ్ళం. లేదా కొబ్బరి మట్టనే బ్యాట్ గా మలిచి బ్యాట్ చేసేవాళ్ళం. ఇక స్టంప్స్ విషయానికొస్తే తలుపు మీదో గోడమీదో మామిడి చెట్టుకో చాక్ పీస్తోనో ఇటుకతోనో మూడు నిలువు గీతలు గీసి వాటినే స్టంప్స్ అనుకుని ఆడేవాళ్ళం. లేదా పెద్ద పెద్ద రాళ్ళను ఒక దాని మీద ఒకటి పేర్చి వాటికి బంతి తగిలితే ఔటిచ్చేవాళ్ళం.కొన్నిసార్లు మామిడిచెట్టుకింద కావాలనే క్రికెట్ ఆడుతున్నట్లు ఆడి మామిడికాయల్ని బంతులతో కొట్టి అవి కిందపడితే ఏరుకు తినేవాళ్ళం. ఒక్కొక్కసారి ఈ బంతి పెద్దవాళ్ళకెవరికైనా తగిలినా లేక ఇంట్లోకి కొట్టినా తిడతారేమోనన్న భయంతో బ్యాట్ కింద పడేసి పారిపోయి దాక్కునేవాళ్ళం.ఇరవై నాలుగ్గంటలూ క్రికెట్ స్మరణే. కానీ ఓ క్రమపద్ధతిలో ఆడకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అక్కడే ఉండిపియాం.ఏదో కాలక్షేపం కోసం ఆడినట్టయిపోయిందే తప్ప ఎదగలేదు. ఇంట్లో రేడియో లేకపోవడంతో పక్కింటికెళ్ళి క్రికెట్ మ్యాచ్ ల కామెంట్రీ వినేవాళ్ళం. ది మెయిల్ అనే ఇంగ్లీష్ ఈవినింగ్ పేపర్లో మొదటి పేజీలో తాజా వార్త అంటూ క్రికెట్ మ్యాచ్ ల స్కోర్లు ఇస్తే ఆరాటంతో చదివేవాళ్ళం. స్కూలు టీమ్ సెలక్షన్స్ కీ వెళ్ళాను. అలాగే కాలేజ్ టీమ్ సెలక్షన్స్ కీ వెళ్ళాను కానీ సెలక్ట్ కాలేదు.అయితే మీడియాలో చేరిన తర్వాత స్పోర్ట్స్ సబ్ ఎడిటర్ గా ఎన్ని మ్యాచ్ ల గురించి రాశానో లెక్కలేదు. అంతేకాదు మీడియా క్రికెట్ టోర్నమెంట్ లో ఉదయం పత్రిక తరఫున ఆడాను. ఒకే ఒక్కసారి ఓ సర్టిఫికెట్, ఓ స్టీల్ ప్లేట్ కానుకగా అందుకున్నాను. ఇంతకు తప్పించి క్రికెట్లో సాధించిందేమీ లేదు.-- యామిజాల జగదీశ్


కామెంట్‌లు