నీ చేతిలో ఉన్న కాలాన్ని సరియైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోతే, కాలం చేతిలో నీవు పావుగా మారక తప్పదు. అప్పుడప్పుడూ నీలోకి నువ్వు తొంగి చూసుకోకపోతే దుఃఖాన్ని వెంటేసుకొని ఊరేగక తప్పదు. కేవలం పుణ్యం కోసమేనంటూ తీర్థయాత్రలు చేస్తే ఆధ్యాత్మిక ఉపయోగం ఉండదు సరి కదా సమయం, డబ్బు వృథానే. దీనివల్ల దక్కేది పుణ్యక్షేత్రాల సందర్శన భాగ్యమే తప్ప, జరిగేది ఆత్మ సంప్రోక్షణ కాదు. ప్రచారంలో ఉన్న ఈ కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణున్ని కూడా తోడు రమ్మంటారు.సాక్షాత్తు భగవంతుడే అయిన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది?కృష్ణున్ని మాములు మానవుడిగా భావించిన, మాయామోహితులైన పాండవులు ఆవిధంగా రమ్మని ఆహ్వానించారు.ఆయన వారికొక దోసకాయనిచ్చి,దీనిని నా ప్రతినిధిగా భావించి,మీరు నదిలో మునిగిన చోటల్లా దీనినీ ముంచండి అన్నాడట. తీర్థయాత్రలు ముగించి వచ్చినవారికి ఏర్పాటు చేసిన విందులో, ఆ దోసకాయతో చేసిన కూరను వడ్డిoపచేస్తాడు కృష్ణుడు. అది తిన్న వారు, ఇంత చేదుగా వుందేమిటి అని కృష్ణున్ని అడుగుతారు.దానికి నవ్వి, చూసారా, ఎన్ని గంగలలో మునిగినా దాని చేదు పోలేదు అంటాడు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, నీలో మౌలికంగా మార్పు రాకుంటే ఏమి లాభం.ఆధ్యాత్మిక పరంగా ఇది కాదనలేని సత్యం. ఊర్లు పట్టుకొని తిరగడం కాదు, నీలోపలికి నీవు ప్రయాణం చేయాలి. తీర్ధ 'యాత్ర' లు కాదు చేయాల్సింది , ఆంతరంగిక 'యాత్ర' చేయాలి. ఏదైతే నీ పట్ల ఇతరులు చేయకూడదని భావిస్తావో, నువ్వూ ఆ పనులను ఇతరుల పట్ల చేయకూడదు కదా. నిన్ను నీవు తెలుసుకుంటేనే, ఇతరులను అర్ధం చేసుకునే శక్తిని కలిగివుంటావు.-- సుధా మైత్రేయి


కామెంట్‌లు