నిజమైన విజయం.బేతాళకథ .బెల్లంకొండ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజపై వేసుకుని మౌనంగా నడవసాగాడు. శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు 'మహీపాలి నీవు సకల కళా వల్లభుడవు. విపంచిక,చిత్రిక ,చిత్రఘోషావళి,తులాష్ట ,కూర్మికి,కుబ్జకి, పరవాదిన,కిన్నరి,తుంబురి,వీణ,తిసతి,రావణహస్తము,రావబుకిన్నెర,రవాబుచకళ,వల్లకి,ఆళావిని,అనాదవిధ,కచ్చపవీణ,నారదవీణ,ఎక్కింజి,సుందరి,సారంగిణి,బ్రహ్మవీణ,స్వరవీణ,భారతి,అలాబువల్లకి,ఆకాశవీణ,అంతర్వీణ,రుద్రవీణ,మురశృంగి,పాయిని,రాగమాలిని,కాలకి వంటి తంత్రి వాద్య కారుడిగా నీవు పేరు పొందటం అభినందనీయం. మన ప్రయాణంలో బడలిక తెలియకుండా నీకు కథ చెపుతాను విను...చిత్రావళి రాజ్యాన్ని శూరసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.ఆయన రాజ్యంలో పుష్కలంగా నీరు లభించడంతో వ్యవసాయం,పశువుల పెంపకం బాగా అభివృధ్ధి చెందింది.ఇంకా విద్య, వైద్యా రంగాలలో ఎంతో అభివృధ్ధి సాధించింది.రాజ్యప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించ సాగారు.ప్రజలు సంతోషంగా పన్నులు చెల్లించడంతో రాజుగారు తన రాజ్యనికి రక్షణ దళాన్ని బలంగా రూపొందించాడు. పొరుగు రాజ్యమైన మగధ రాజు సేతుపతి భోగలాలసుడు.ప్రజల కష్టాలు గమనించకుండా నిత్యం మధుపాన లోలుడుగా నృత్య గాన విలాసాలతో కాలం గడుపుతూ ఉండేవాడు.పలుమార్లు చిత్రావళి రాజ్యంపై దండెత్తి ఓటమి పాలైనాడు. ఒక సంవత్సరం సమయానికి వర్షాలు పడక మగధ రాజ్యంలో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది.ప్రజలు ఆహారంతో పాటు తాగు నీటికి ఇబ్బంది పడసాగారు. ఈవిషయం చిత్రవళి రాజు శూరసేనుడి దృష్టికి వెళ్ళింది.వెంటనే తన పరివారంతో అత్యవసర సమావేశం ఎర్పాటు చేసి మగధ రాజ్యానికి తమ ధాన్యాగారాలనుండి అత్యవసరంగా కావలసిన ధాన్యం, వ్యవసాయానికి నీటి కాలువలు తొవ్వించి నీరు వెంటనే అందజేసాడు. మగధ రాజ్య ప్రజలు శూరసేనుడి దయాగుణానికి బ్రహ్మరధం పట్టారు. విక్రమార్క మహారాజా తన శత్రువు అయిన సేతుపతి మగధ దేశరాజుగా ఉండి పలుమార్లు తనపై దండెత్తినప్పటికి శూరసేనుడు అతని రాజ్య ప్రజలకు ధాన్యం, నీరు ఎందుకు సహాయంచేసాడు.తెలిసి నాప్రశ్నకు సమాధానం చెప్పక పోయివో తలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు. 'బేతాళ 'అన్నేన సదృశం దానం నభూతో న భవిష్యతి తస్మాదాన్నం విశేషణ దాతువిచ్చన్తి మానవా" ' అన్నదానంతో సమానమైన దానం మరేది ఉండదని పెద్దలు చెపుతారు.ఇంకా భీతేభ్యశ్చా అభయం దేయం - వ్యాధితేభ్యస్థ దౌషధం దేయా విద్యార్ధినే విద్యా - దేయమన్నం క్షుధాతురే" మరణభయంతో విలవిల లాడే వారికి అభయ ప్రదానం చేయడం,వ్యాధి గ్రస్తునకు సరి అయిన చికిత్స చేయించడం,విద్యను ఆర్జించేవారికి విద్యా దానం చేయడం,ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేయడం మెదలగు నాలుగు దానాలను చతుర్విధ ఉత్తమ దానాలని వేదాలలో చెప్పబడింది. శూరసేనుడు గొప్ప మానవతావాది.ఎంతో ముందుచూపు కలిగినవాడు తన రాజ్యనికి ఇరుగు పొరుగున ఉండేవారు ఎప్పుడూ బాగుండాలని కోరుకునేవాడు.ఎందుకంటే ఆదేశ ప్రజలు తమ దేశానికి వలస వస్తే పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి.పైగా మగధ దేశ ప్రజలను ఆదుకుని ఆదేశ ప్రజలకు తాను ఎంతో ఉన్నతుడిగా గుర్తింపు,మన్ననలు పొందాడు.భవిష్యత్తులో ఎన్నడు మగధ రాజు తనపై యుధ్ధం చేయడానికి సాహసం చేస్తే ఆదేశ ప్రజలే రాజుపై తిరగబడతారు.అన్నంపెట్టి ఆదుకుని, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన శూరసేనుడి రాజ్యంపై యుద్ధం చేయడానికి మగధ ప్రజలు ఎన్నటికి అంగీకరించరు.ముందు చూపు కలిగిన శూరసేనుడు వారి అవసరాలకు ఆదుకుని,తన దయాగుణంతో మగధ ప్రజల అభిమానం తోపాటు వారి విశ్వాసానికి పాత్రుడు అయ్యడు'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మయమై తిరిగి చెట్టు వద్దకు చేరాడు బేతాళుడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు