మంచి పని(బాలల కథ) : రచన :లిఖిత్ కుమార్ గోదా:- "ఈ ఎండలు ఏంట్రా బాబు ఎన్ని ఐస్ క్రీములు తిన్నా , ఫ్రిజ్ లోంచి గడ్డకట్టిన మంచినీళ్లు తాగిన , ఏసీ రూముల్లో కూర్చున్న తగ్గట్లేదు. వాటికి తోడి చెమట"చిరాగ్గా అన్నాడు గుణశేఖర్. "ఇదంతా మనం చేసుకున్న పుణ్యమే మరి . చెట్లు నరకడం తప్ప మొక్కలు నాటడం లేదు. అంతేకాకుండా నేలని, నీరుని ,గాలిని ,ఏ ఒక్క దానిని వదలకుండా పర్యావరణాన్ని మొత్తం కలుషితం చేశాం. దానికి తగ్గట్టుగానే పరిణామాలను అనుభవిస్తున్నాం."అన్నాడు సంతోష్. "ఈ ఎండ తీవ్రత ని వయసులో ఉన్న మనమే తట్టుకోలేకపోతున్నాను . పాపం మరి ఆ వృద్ధుల పరిస్థితి ఏమిటి "విసనకర్రతో గాలిని విసురుకుంటూ చెమటను తుడుచుకుంటూ పూరిగుడిసెలో అవస్థలు పడుతున్న ముసలి వాళ్లను చూపిస్తూ మిత్రులందరితో అన్నాడు లిఖిత్. "పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది "అన్నాడు శ్రీకాంత్. "ఈ సమస్యకు ఏదైనా ఉపాయం కనిపెట్టాలి" అన్నాడు నితిన్.ఫ్రెండ్స్ మాటలు అన్నీ వింటున్న నవీన్ కొంచెం సేపు ఆలోచించి"ఫ్రెండ్స్! మనందరి ఇళ్లల్లో అనర్థం గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు ఉన్నాయి కదా"అన్నాడు. నవీన్ సామాజిక మాధ్యమాలని బాగా అనుసరిస్తాడు."ఆ అవును ఉండే ఉంటాయి. అయినా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ గోల ఎందుకు "అని అడిగాడు అఖిల్."చెప్తా. మొన్నీమధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూసా. అలాగే పత్రికల్లో చదివాను. కొన్ని దేశాలలో ప్లాస్టిక్ బాటిల్ లు కార్డు బోర్డు లేదా అట్టపెట్టెఉపయోగించి మిని కూలర్ ని తయారు చేసుకుంటున్నారు. మనము ఒక సారి ప్రయత్నిద్దాం ఈ పని. మనం అందరం కలిసి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు అలాగే మనం దాచుకున్న డబ్బుతో షాపుల్లో కార్డు బోర్డుల కొనుక్కొచ్చి మనం కూడా ప్లాస్టిక్ అనే వ్యర్థంతో అర్ధాన్ని సృష్టిద్దాం. మన ఊరి యొక్క పేద జనాల నవ్వులను చూద్దాం"బదులిచ్చాడు నవీన్. "ఆ సరే రా ఇప్పుడు ఆ పని పూర్తి చేద్దాం" అన్నాడు నితిన్.మిత్రులు అందరూ కలిసి తమ తమ ఇళ్లల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు అలాగే తాము పోగు చేసుకున్న డబ్బు తో కార్డు బోర్డులు కొచ్చారు.ముందుగా నవీన్ కార్డు బోర్డు కి వరుస క్రమంలో దూరం దూరంగా బొక్కలు చేసి తరువాత వాటి లను సగం వరకు కోసి మూతలు తీసి ఆ బాటిళ్లను కార్డుబోర్డు కి అమర్చాడు. మిత్రులందరూ కూడా నవీన్ చేసినట్టే చేశారు."బాబాయ్! మొత్తానికి అయితే ఈ ప్లాస్టిక్ బాటిలు అట్టముక్కల తో ఈ వస్తువులు చేశాం. కానీ ఇది ఎలా పనిచేస్తుంది"అడిగాడు సాయి ప్రదీప్. "చెప్తాను ఒకసారి మీ నోరు తెరిచి మీ అరచేయి కొంచెం దూరం నుంచి ' హా' అని ఊదండి."అని చెప్పాడు నవీన్. మిత్రులందరూ నవీన్ చెప్పినట్టే చేశారు."మీ అరచేతికి వేడిగాలి ఏమైనా తగిలిందా"అడిగాడు నవీన్ మిత్రులని."ఆ తగిలింది "బదులిచ్చాడు లిఖిత్. "ఇప్పుడు మీరు మీ మూతిని సున్నా (0 )ఆకారంలో ఉంచి అరచేయిని అప్పట్లోనే ఇందాక పెట్టిన దూరంలోనే ఉంచి ఊదండి."ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు చేసిన చర్య లో తమ అరచేతికి చల్లటిగాలి తగిలినట్టు అనిపించింది. అది నవీన్ తో చెప్పారు. "అయితే ఏంటి నవీన్ ?"అని అడిగాడు మహేష్. "పరిణామం పెరిగే కొద్దీ వేడిగాలి తగ్గుతుంది. చల్లగాలి పెరుగుతుంది. ఈ బాటిళ్ల మిని కూలర్ ని మన ఇంటి కిటికీలకు అమర్చుకున్నామనుకో బయట నుంచి వచ్చే వేడి గాలి ఈ బాటిల్ లో నుంచి ప్రయాణించి చల్ల గాలిని ఇస్తుంది. ఇలాంటి ఉపాయం వలన గాలి లో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు నుండి 15 డిగ్రీలు తగ్గుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది ఉపయోగపడుతుంది."అని చక్కగా వివరించాడు నవీన్. ఫ్రెండ్స్ అందరికీ ఆ ఐడియా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లి గ్రామ ప్రజలకు ఈ విషయం తెలపగా అందరినీ అభినందించి తర్వాత ఊరి జనం తో అందరితో అలాంటివి చేయించి వృద్ధుల ఇంట్లోనే కాక కూలర్లు లేని వారికి కూడా అందజేశారు. అందరూ మిత్రులందరినీ అభినందించారు. కథారచన: లిఖిత్ కుమార్ గోదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. బనిగండ్లపాడు గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.-507202.


కామెంట్‌లు