బాల్యం మళ్ళీ కావాలోయ్........ కావాలోయ్ కావాలోయ్ నా బాల్యం మళ్ళీ కావాలోయ్ 1. నువ్వే చిట్టివి, నువ్వే చిన్నివి నువ్వే దేవుని వరానివంటూ అమ్మా నాన్నా ముద్దులు చేసే బాల్యం మళ్ళీ కావాలోయ్ 2. నే ఊ కొడుతుంటే , ఉంగా అంటూ ఉగ్గులు తెచ్చీ నోట్లో పోసీ బుగ్గలు పుణికీ పెద్దలు మురిసే బాల్యం మళ్ళీ కావాలోయ్ 3. అత్తత్తత్తా అత్తా అనవే ఆయుష్షొసగునె తల్లీ అంటూ అక్షర లక్షల దీవెనలందిన బాల్యం మళ్ళీ కావాలోయ్ 4. నే నిద్దుర పోతే సవ్వడి చేయక ష్ ష్ అంటూ సైగలు చేయుచు మహారాణిలా నను భావించిన బాల్యం మళ్ళీ కావాలోయ్ 5. బోర్లా పడితే బొబ్బట్లనుచూ పలుకుల తీయని చిలకలు యనుచూ అడుగడుగుకు నేతి అరిసెలు పంచిన బాల్యం మళ్ళీ కావాలోయ్ 6. అదుగదుగో జాబిలి,ఇదుగో బువ్వా ఆ ఆ ఆ ఆం అని అమ్మ పలుకుతూ గోరు ముద్దలతో ముద్దులు పెట్టిన బాల్యం మళ్ళీ కావాలోయ్ 7. ఎత్తుకు ఎత్తీ, వెనకకు తిప్పీ వుప్పెక్కించీ,బోసినవ్వులకు అబ్బోస్ అంటూ నాన్న మురిసెడీ బాల్యం మళ్ళీ కావాలోయ్ 8. అమ్మే నా తొలి గురువై నిలచీ ప్రకృతి విద్యాలయమౌ రీతిన అచ్చెరువులన్ని ఎరుక చేసిన బాల్యం మళ్ళీ కావాలోయ్ అచ్చెరువులన్ని ఎరుక జేసిన బాల్యం మళ్ళీ కావాలోయ్...... నాగజ్యోతీ సుసర్ల.... ( ఈ కవిత నాలుగేళ్ళ క్రితం వ్రాశాను..అయినా నా అంతరాంతరాలలో బాల్యం మళ్ళీ వస్తే బావుండుననే ఆలోచన ఎప్పటిదో..ఇప్పటికి కూడా సుమీ...)


కామెంట్‌లు