మానేరు ముచ్చట్లు- నేను నా వెలిగందల చరిత్రకు వెయ్యేండ్ల వెలగందుల అని పేరు పెట్టాలనుకున్నాను.ఈ రోజు అమెరికా చరిత్రను గమనిస్తే దానికి గట్టిగా అయిదువందల ఏండ్లు దాటలేదు.అలాంటిది ఒక చిన్న కుగ్రామము వెయ్యేళ్లనుంచి ఉన్నదంటే మాటలు కాదు. ఏదైనా ఒక జనావాసం కొత్తగా ఏర్పడిందంటే అది వృద్ధిలోకి రావడానికి కనీసం ఐదారు తరాలన్నా ఆ ఊరిలో విలసిల్లాలి.తరానికి ముప్పై ఏళ్లు ఉజ్జాయింపుగా లెక్కవేస్తారు చరిత్ర పరిశోధకులు సర్వ సాధారణంగా.ఆ లెక్కన వెలిగందల గ్రామం గుర్తింపుకు రావడానికి ముందు రెండువందల సంవత్సరాల అజ్ఞాత చరిత్ర ఉందని నాకనిపించింది. ఈ సందర్భంగా నాకు శ్రీ శ్రీ గారి దేశచరిత్రలు అన్న గేయం గుర్తుకు వచ్చింది ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో? తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్ధం ఈ రాణీ ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ ఇవి కావోయ్ చరిత్రసారం కేవలం రాజుల చరిత్రనే చెప్పాలని నాకు కూడా అనిపించలేదు. కాని చూడని వాటికి కొన్ని ఆధారాలను చూపి నేను చూచిన వాటిని జోడించి మా ఊరి కథ రాయాలనే నా సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. అయితే కథ ఎక్కడో మొదలు కావాలి గనుక నిన్నటి శిలాశాసన ఉదంతాన్ని నాంది ప్రస్తావనగా చెప్పటం జరిగింది. శాసనం తెలియ జేస్తున్న విషయం ఆ ఊరి గుట్ట మీద కోట కంటే ముందు ఒక నరసింహాలయం ఉండేదని.ఆలయం లోని నిలయ విద్వాంసులకు దాన శాసనమివ్వడాన్ని బట్టి ఆ దేవాలయ వైభవాన్ని అంచనా వేయ వచ్చు.ఈ శాసనం వేసిన సమయంలోనే అంటే శాలివాహన శకము 1124 లోఅదే క్రీస్తుశకమైతే 1202 లో హుజూరాబాదు ప్రాంతంలోని కటుకూరు శాసనం కూడా వేయబడింది.ఎలగందుల శాసనం చౌండసేనాని పేరుమీద ఉంటే , కటుకూరు శాసనం ఆయన భార్య మైలమదేవి పేరు మీద ఉన్నది. ఆ శాసనంలో భర్తకు చెందిన మల్యాల వంశీయుల చరిత్ర,భార్య పుట్టింది వారైన విరియాల వంశీయుల చరిత్ర సాకల్యంగా రాయబడింది.ఆశాసనం ప్రముఖ చారిత్రక పరిశోధకులు పురావస్తుశాఖ సంచాలకులైన పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారి కంటబడింది గనుక పురావస్తు శాఖవారి కరీంనగర శాసనములు అను పుస్తకంలో చేటు చేసుకోగలిగింది.మల్యాల వంశీయుల ఇతర శాసనములు కూడా ఆ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. దీని వల్ల మూడు విషయాలు స్పష్టమవుతున్నాయి. 1.మల్యాల వంశీయులు దైవ భక్తులు 2.ఈ వంశీయులు కాకతీయ గణపతి దేవచక్రవర్తి వద్ద పనిచేసిన వారు గనుక అ ప్పుడు ఈ ప్రాంతం వారి అధీనంలో ఉండేదని 3.ఈ వంశీయులకు ఇప్పటి కరీం నగర్ జిల్లా,నిన్నటి ఎలగందుల జిల్లా ఒకప్పటి సబిబి సాయిర మండలంతో సన్నిహిత సంబంధముండేదని. దానికి తార్కాణంగా ఈ జిల్లాలో వారి వంశము పేరిట గల అనేక మల్యాల గ్రామాలనవచ్చు.గట్ల మల్యాల,నాగుల మల్యాల,జొన్నల మల్యాల మొదలైనవి. దీనిన బట్టి పన్నెండవ శతాబ్దములో ఈ గ్రామము కాకతీయుల ఏలుబడిలో ఉండేదని తెలుస్తున్నది. శాసనములోని విషయము చదవటానికి వీలు కలిగించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులుశ్రీరామోజు హరగోపాల్ గారి విషం ప్రకారం ముందు గణపతిదేవ చక్రవర్తి గొప్పతన ము ఆ తరువాత చౌండ సేనాని తండ్రి కాటయ పరాక్రమ వైభవము,పిమ్మట చౌండ ప్రెగ్గడ వీరత్వ ప్రశంస దాన వివరాలు దానికి ఋజువుగా నిలుస్తున్నవి.- రామ్మోహన్ రావు . తుమ్మూరి


కామెంట్‌లు