భగవద్గీత--- భగవద్గీతకు సంబంధించి చలంగారు రాసిన వ్యాఖ్యానం గురించి మొట్టమొదటగా నేను తెలుసుకున్నది మా పెద్దన్నయ్య శ్యామలరావు వల్లే. అంతేకాదు, అన్నయ్య దగ్గర వజీర్ రహ్మాన్ గారి సంతకంతో ఉండిన ఈ పుస్తకాన్ని చదివిస్తానని తీసుకున్నాను కూడా. ఈ పుస్తకం నా చేతికి ఎలా వచ్చిందో అలాగే చేజారిపోయింది. జెమినీ టీవీ (మద్రాసు) లో పని చేస్తున్న రోజుల్లో నా సహ ఉద్యోగి ఒకరికి చదువుతానంటే ఇచ్చాను. అంతేసంగతులు. ఆ పుస్తకానికి నూకలు చెల్లాయి. అది మళ్ళీ నా చేతికిరాలేదు. ఇక రెండోసారి నేను అదే భగవద్గీతను చలంగారి వ్యాఖ్యతో ఉన్న పుస్తకాన్ని కొన్నాను. ఈమారు నా అంతట నేనే ఒకరికి చదవమని ఇచ్చాను. తీరా సదరు వ్యక్తి పుస్తకం తీసుకున్న కొన్ని రోజులకే మా కుటుంబాన్ని నట్టేట ముంచారు. చలంగారు భగవద్గీతకు రాసిన ముందుమాటలో ఇలా చెప్పుకున్నారు...."సంస్కృతంకానీ వేదాంతం కానీ ఏమీ తెలీని నాకు భగవద్గీతలోని గూఢార్థాన్ని బోధించి రాయించారు ఈశ్వరుడు. భగవద్గీత తెలుగు చెయ్యమని గోల చేసిన కందికొండ సూర్యనారాయణ శాస్త్రిగారి నించి, నేను రాశానో, తాము రాశారో సందేహం కలిగేటంతగా నా ప్రక్కన నిలబడి పని చేసిన నర్తకీ కృష్ణా వరకు, దిగజారిపోయే నా ఉత్సాహాన్ని ఎంత మంది ఈ మూడేళ్ళు తిరిగి తిరిగి ఎగసన తోశారో...తెనాలి రామకృష్ణ తనకి రాజుగారిచ్చే బహుమానంలో ద్వారం దగ్గిర భటులకి పంచమన్నట్టు, నాకు తెలుగువారిచ్చే బహుమానాన్ని వీరందరూ పంచుకోవాలి (అరుణాచలం, 13-3-1965)."అనంతరం ఓ మూడు రకాల వ్యాఖ్యానాలతో వెలువడిన మూడు భగవద్గీత పుస్తకాలు కొన్నాను. వాటిలో ఒకటి - గీత, ఖురాన్, బైబిల్ వ్యాఖ్యలతో కూడినది ఇరవై రూపాయలకు అబిడ్స్ ఫుట్ పాత్ మీద కొన్నాను. మరొకటి రామకృష్ణామిషన్ వారు విడుదల చేసిన పుస్తకం. ఇంకొకటి గీతాప్రెస్ వారి పుస్తకం. ఇవి నా దగ్గర పదిలంగానే ఉన్నాయి. అయితే నా అంతట నేను పోగొట్టుకున్న రాతప్రతి ఒకటుంది. అది మా నాన్నగారు భగవద్గీతపై సరళ వచనంలో రాసిన రాతప్రతి. బేఖంపేటలో ఉన్న శక్తి గ్రూప్ మనోహర్ గారు వేస్తానంటే మా నాన్నగారు రాసారు. ఈ రాతప్రతి రెండో అన్నయ్య ఆనంద్ దగ్గరుంటే అడిగి తీసుకున్నాను. మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలను మా సమీపబంధువులు రాంజీ (వైజాగ్), ప్రభు గారు (సాలూరు) సాలూరు 2015 లో నిర్వహించినప్పుడు మమ్మల్ని ఆహ్వానించారు. నేనూ, ఆనందూ సాలూరు వెళ్ళడానికి సిద్ధమై ఆఖరి నిముషంలో అనివార్య కారణాలతో విరమించుకున్నాం. అయితే ఆ సమయంలో గరికపాటివారికి కొరియర్లో మా నాన్నగారి భగవద్గీత వచన రాతప్రతితోపాటు మరొక పుస్తకమేదో పంపాను. అంతే ఆ పుస్తకం మళ్ళీ కళ్ళ చూడలేదు. ఆయన మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని రాంజీగారు చెప్పడంతో కొరియర్ పంపాను. అదేమైందో ఇప్పటివరకూ తెలీలేదు. చలంగారి వ్యాఖ్యానంతో వెలువడిన గీత పుస్తకాలను కోల్పోయినప్పుడు ఎంత బాధ పడ్డానో అంతకు రెట్టింపు బాధ పడ్డాను మా నాన్నగారి రాతప్రతి పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే అది డీటీపీ చేసి కనీసం ఓ ప్రింటౌట్ అయినా చేసిపెట్టుకునుంటే బాగుండేది. వార్త పత్రికలో నేను పని చేస్తున్న రోజుల్లో ఓ వారమో లేక పది రోజులో నేను గీతపై రాసిన తాత్పర్యం వెలువడి ఆగిపోయింది. అలాగే మకరసంధ్య అనే మాసపత్రికలో రెండు మూడు నెలలు తాత్పర్యం రాయించి ప్రచురించాడు మిత్రుడు చరణ్ దాస్. కానీ ఆ తర్వాత అది కొనసాగలేదు. ఇదిలా ఉండగా నేను బుజ్జాయి పిల్లల మాసపత్రిక కార్యాలయంలో ఓ 26 నెలలు బస చేసిన రోజుల్లో అప్పారావుగారు ఓ చిన్న పుస్తకం ఇచ్చారు. అది ఘంటసాల వేంకటేశ్వరరావుగారు తాత్పర్యంతోసహా ఆలపించిన భగవద్గీత తాలూకు పుస్తకం. ఈ పుస్తకానికి పరిష్కర్త మాష్టర్ టి. శరత్ చంద్రగారు (ఘంటసాల స్వర పరిశోధకులు) 2004 మే 28న ముద్రించారు. దీని ధర రూ. 21/-. ఘంటసాలగారు శ్లోకం, తాత్పర్యంతో సహా మధురమైన రాగాలాపనతో 101 శ్లోకాలు సిద్ధం చేయగా వాటిని హెచ్ ఎం వీ వారు నాలుగు భాగాలుగా విడదీసి రెండు క్యాసెట్ల ద్వారా ఆవిష్కరించారు. ఇందులో తాత్పర్యం మా తెలుగు మాష్టారు కోట సత్యరంగయ్య శాస్త్రిగారు రాశారు. చివరగా ఒక్క మాట. భగవద్గీతను ఇప్పటివరకూ ఒక్కసారీ పూర్తిగా చదవలేదు. ప్రతీసారి మొదలుపెట్టడం, మధ్యలోనే ఆపేయడం.ఎప్పటికి పూర్తిచేస్తానో చదవడం?!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు