రాణెమ్మ కథలు : -17.భక్తి రాణి.: ఇంట్లో పెద్దవాళ్ళు రోజూ ఆచరించే విధానాలు మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి వచ్చేస్తాయి.తెల్లారు జామున నిద్దర్లో ఉన్నపుడు అమ్మమ్మ పాడుకునే ఆధ్యాత్మరామాయణ కీర్తనలు,పోతన భాగవత పద్యాలు,రకరకాల సకల దేవతా స్తోత్రాలు వినపడుతుండేవి.ఆవిడ ఎంత మృదువుగా భక్తిగా నిర్వేదంగా కేవలం అద్ధ్యాత్మికంగా పాడుకునేది అంటే ,నిద్రలో ఉంటే సాధారణంగా చికాకు కలుగుతుంది అలా వింటే కానీ ఆవిడ పాడుతుంటే హాయిగా మత్తుగా ఒక అలౌకిక స్థితిలా ఉండేది నాకు. ఆవుపేడ కచ్ఛికతో పళ్ళు తోముకునేది మనమూ ఆవిడతోనే పళ్ళు తోముకోవటానికి ప్రిఫర్ చేసేవాళ్ళం .ఎందుకంటే అమ్మ అమ్మమ్మకి వేడి నీళ్లు కాచి ఇచ్చేది మొహం కడుక్కునేందుకు.తాటాకు బద్దతోనో,చీల్చిన కొబ్బరి పుల్లతోనో నాలిక గీచుకోవటం.”యూస్ అండ్ త్రో “ఇప్పుడు ఇంత ఫాన్సీ పేరు పెట్టేవాళ్ళుకదా అని పించి నవ్వు వస్తుంది.కుంపటిలో డికాక్షన్ ,పాలు రెడీ చేసి అమ్మ పెడితే .అందరమూ దానిచుట్టూ చేరే వాళ్ళం అమ్మమ్మ ఎవరి పాళ్లు వాళ్ళకి కలిపి(చిన్న పిల్లని కనుక నాకు పాలు ఎక్కువ ఒక రెండు చుక్కలు డికాక్షన్) కాఫీ గ్లాసులు చేతికి ఇస్తే స్వర్గం ఎక్కడో లేదు కుంపటి చుట్టూనే అనిపించేది.గడ్డపెరుగుతో ,ఏచింత కాయపచ్చడో, కందిపచ్చడో వేసుకుని చద్దన్నమ్ తినేసి బడికి వెళితే, మధ్యాన్నం 12.30 కి అన్నం టైం .మా బళ్ళో అలానే అనేవాళ్ళం.ఇంకా వింత ఈ 12.30 లోపు ఆకలి అయితే పిల్లలు గంటకోసం ఎదురు చూస్తూ ముఖ్యం గా మా మాదిరెడ్డి పద్మకి ఆకలి ఎక్కువ” అబ్బా రానీ అన్నం ఆకలి అవుతుందబ్బా “అని. అన్నం ఆకలి, ఇడ్లీ ఆకలి ,ఉప్మాఆకలి ఉండవుకదా. ఆకలి కి మా పిల్లలు వాడే పదం అన్నమాకలి అవ్వటం.ఆవురావురున ఇంటికి వస్తే .వంట ఇంట్లో అమ్మమ్మ మడి కట్టుకుని వంటచేసేసి ,దేవుడి మందిరం ముందు ఆగిన్నెలన్నీ పెట్టి కరెక్టుగా నైవేద్యం అయిపోయి హారతి ఇస్తుండేది.బడిలో అన్నం గంట కన్నా నా ఆకలికి అమ్మమ్మ హారతి గంట తెగ శ్రావ్యంగా వినిపించేది నాకు.ఇంక అంతే చుట్టూ పిల్లల్ని అందరినీ కూర్చో పెట్టుకుని ఆవిడ తింటూ మాక్కూడా పెట్టేది. ఐతే ఆవిడ ఎక్కడ తినటం అమ్మమ్మకూర వెయ్యి , పప్పువెయ్యి ,నెయ్యి వెయ్యి ఇలా మాకు వడ్డించటం తోనే సరిపోయేది. అన్నాలు తిని బడికి వెళ్లిన మేము సాయంత్రం తిరిగి 4.30 కి వచ్చేసరికి.ఇంటి చుట్టుపక్కల కొంచెం పెద్ద వయసు వాళ్లు కొంతమంది కూర్చుని ఉండగా భారతమో, భాగవతమో పుస్తక పీఠం మీద పెట్టుకుని అమ్మమ్మ చదివి వినిపిస్తూ అర్ధం చెపుతూ ఉండటం రోజు వారీ దృశ్యం మాకు. రాత్రిళ్ళు అన్నాలు తిని తలా ఒక నులక మంచం వేసుకుని వాటిపై శుభ్రమైన తెల్లటి రెక్కదుప్పట్లు పరుచుకున్న తరవాత ఆరోజు కబుర్లు కొంచెం సేపు మాట్లాడుకున్నాక.మనకి పొద్దున్ననించీ ఆడిన ఆటలు ,చేసిన బజారుకెళ్లే పనుల తాలూకు నెప్పులు గుర్తొచ్చేవి. చిన్నగా నా బుల్లి నులక మంచం అమ్మమ్మ మంచం పక్కకి జరిగేది దానంతట అదే.మా ఉమ్మక్క,పద్మక్క అమ్మమ్మని ఇబ్బంది పెట్టకు అని గొణుగుతున్నా సరే.నేను చిన్నగా నా మంచం మీదనుంచి ఆవిడ మంచం పైకి మారిపోయేదాన్ని.ఇంకేముంది స్వర్గం నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉండేది. ఊరుకోండే పాపం పిల్ల నడిచి నడిచి వస్తే నాకేమీ ఇబ్బంది లేదులే అంటూ .సుతిమెత్తగా నా కాళ్ళు నొక్కుతూ సుమతీ శతకమో ,దాశరదీ శతకమో చదువుతుంటే రాణి గారు.హంస తూలికా నులక మంచం పై ఆనంద నిద్ర పోయే వాళ్ళు. కార్తీక మాసం వస్తే నాకెంత ఆనందంగా ఉండేదో చెప్పలేను.అమ్మమ్మతో పాటు తెల్లవారు ఝామున లేచి కూర్చునే దాన్ని.ఆవిడ రాత్రే సర్ది పెట్టుకున్న పూజా కిట్టు పట్టుకుని,ఆవిడతో మఱి ఇంకొంతమంది ఆడవాళ్లతో కలిసి మాఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువకి కార్తీక స్నానానికి వెళ్ళేదాన్ని. వాళ్ళు స్నానాలు చేసి ,దీపాలు అక్కడే వడ్డున వెలిగించుకుని ,పూజ చేసుకుని,శివస్తోత్రాలు అన్నీ పాడుకునే వరకూ మనం ఎంతో కడుంగడు భక్తి తో కాల్వలో చేతులు కింద ఆనించి కాళ్ళు నీళ్లలో ఆడిస్తూ నేల ఈతలు కొడుతూ ఉండటమే.ఇంకపోదాం రా రాణెమ్మ అని ఎవరయినా వాళ్లలో పిలిస్తే” బ్రహ్మమురారి పాడండి” వచ్చేస్తున్నా అనటమే. మరి శివునికి నీళ్ళంటే ఇష్టం కదా.- వసుధారాణి.


కామెంట్‌లు