రాణెమ్మ కథలు : 19.అయోమయ రాణి.- -ఎలాగో మొత్తం మీద కష్టపడి చదవటం అన్న వ్యసనానికి ఆకర్షింప బడకుండా ఆరవతరగతి,కాస్త మంచి మార్కులతోనే 7 వతరగతి కూడా పూర్తి చేసాం.అంతటితో సిధ్దర్థవిద్యాలయానికీ మనకీ రుణం తీరి పోయింది.ఇక్కడ ఇలా రాయగలుగుతున్నామనంటే అక్కడ నేర్చుకున్న అక్షరం ముక్కలే మరి మొత్తం బడి టీచర్లు అందరికీ జేజేలు. మన ఇంకొక బడి మునిసిపల్ గర్ల్స్ హైస్కూల్ .అదొక మహాసముద్రం మొత్తం నరసరావుపేటలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో 7వతరగతి దాకా చదివిన ఆడ పిల్లలు అందరూ ఇక్కడ చేరతారు చాలావరకు మిగిలిన కొద్దీ మంది హార్డ్ హై స్కూల్ లో చేరేవాళ్ళు.కింద బడిలో మనకి ఎంత పలుకుబడి ,ఎంత గుర్తింపు ,ఎంత ప్రాముఖ్యత ఉండేవి .ఇక్కడికి వచ్చి ఓ సంచి వేసుకుని ఏమాత్రం గుర్తింపు లేకుండా ఓ మూల కూర్చోవడం మన వల్ల కాలేదు.కొత్త బడిలో చేరిన నాలుగు రోజులకి ముందు మన పాత బడి పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవటం మొదలు పెట్టాను రాజ్యం కోల్పోయిన రాజులు చేసేపని అదేకదా.మన రమాదేవి,సునీత,సీతామాలక్ష్మి,పద్మ,సంధ్య ఇలా కొంతమంది విధేయులని పట్టుకున్నాను.వాళ్ళుపాపం దిక్కులేని వాళ్ళలా బిక్కు బిక్కు మంటున్నారు కొత్త బడిలో.మునిసిపల్ స్కూల్ అంటే బెంచీలు ఉండవు ఒక్కొక్క క్లాస్ కు మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షనుకు కనీసం డెబ్బయి ఎనభై మంది పిల్లలు.బాగా చదివే పిల్లలు మామూలే కదా A సెక్షన్, మీడియం పిల్లలు B, మిగిలిన పిల్లలు C, ఇలా వుండే వాళ్ళు దానివల్ల మన విధేయులు అంతా చెల్లాచెదురు అయ్యారు.మన ప్రతిభా వంతమైన చదువు వల్ల మనం B సెక్షను,నాఅదృష్టం బాగుంది C సెక్షన్ కూడా తెచ్చి మాదాంట్లో కలిపారు.దాని వల్ల దాపుగా ఈ బడిలో చేరిన పాత బడి తాలూకు పిల్లలంతా మన సెక్షన్ లోకి వచ్చేసారు.కొద్దిగా కొద్దిగా కొత్తవాళ్ళుకూడా మన గ్రూప్ లోకి రాసాగారు. ఒకరోజు మాస్కూల్ HM వసుంధరా టీచర్ క్లాసులో నా దగ్గరికి వచ్చి నువ్వు స్వరాజ్య పద్మజ చెల్లెలివి కదూ,కృష్ణానందం మాస్టారి మరదలివి అని మీ అక్కయ్య ని నేను హీరోయిన్ అని పిలిచేదాన్ని.నువ్వు ఇంకా భలే ఉన్నావ్ నిన్ను కూడా అలాగే పిలుస్తా అని బుగ్గలు లాగి తల పై చిన్నగా తట్టి వెళ్ళిపోయింది.. పద్దక్కా ఇక్కడ కూడానా ..సరే ఎట్లో కొంత గుంపును చేరేసుకొని మరీ పెద్ద రాణిలా కాకపోయినా ఓ సామంత రాణి లెవలుకు గుంపు మైంటైన్ చేస్తూ.కొత్త టీచర్లకు మన మీద సదభిప్రాయం కలిగేలా క్లాసులో బుద్ధిగా ఉంటూ,కష్టపడి ఇష్టం లేకపోయినా కొంచెం కొంచెం చదువుకుంటూ,ఇంట్లో బోలెడన్ని బాధ్యతలు నిర్వహిస్తూ.కొత్త దనాన్ని కాస్త అయోమయం తగ్గించుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా సంగీతం క్లాస్ రానే వచ్చింది.అసలే మనకి కళల పట్ల ఆసక్తి తక్కువ (మనకి అబ్బవు కనుక) పైగా ఆసంగీతం టీచర్ వస్తూనే ఇటురావే స్వరాజ్యం అనిపిలిచింది.ఎవరినా అని అటూఇటూ చూస్తుంటే నిన్నేనే హిప్పీ స్వరాజ్యం అంది.విషయం ఏమిటంటే మా పద్మక్క పూర్తి స్వరాజ్య పద్మజ మా అక్కయ్య ఆమెకి పెట్ ఆవిడ మా అక్కని అలా పిలిచేదిట.ఇంకేముంది సంగతి నా గోడు నాతో నేనే వెళ్లబోసుకోవాలి రాణి బయట ఏడవకూడదు కదా…-వసుధారాణి.


కామెంట్‌లు