మానేరు ముచ్చట్లు--ఒకసారి ఊరి రూపు రేఖల గురించి తెలుసుకుందాం.కరీంనగర్ జిల్లాకు తల పాపిట మానేరైతే,మా ఊరిని రెండు వాడలుగా విడదీసే నడిమి పాపిట లాంటి తొవ్వ పెద్ద కమాన్ నుండి ఖిల్లా దాకా ఉన్న ఒకప్పటి రాజమార్గము.పడమటి వైపు భాగాన్ని మీది వాడ లేదా పైవాడ అనీ, తూర్పువైపు భాగాన్ని కింది వాడ అని వ్యవహరించేవారు.ఈ రాజమార్గానికి అటూ ఇటూ కొన్ని తొవ్వలు ఈ వాడకూ ఆ వాడకూ పోవడానికి ఆకు ఈనెల్లా ఉండేవి.ఖిల్లా దరి దాపుల్లో ఎడమ వైపు దారి సీదా తూర్పు గైని దాకా ఉండేది.ఊళ్లో ప్రధాన మార్గాల్లో ఇది ఒకటి. మీది వాడకు బుధవారపు పేట అనే పేరుండేదని చాలా తక్కువ మందికి తెలుసు.ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కానీ ఎలగందుల లో అంగడి బజారు బుధవారం నాడు జరిగేది.ఈ రోజు కొన్ని మీదివాడ ముచ్చట్లు కలబోసుకుందాం. మీదివాడను శాలోళ్ల వాడ అని స్థానికంగా వ్యవహరించడం జరిగేదిఅనేక మంది పద్మశాలీ కుటుంబాలు మగ్గాలపై బట్టలు నేసి స్థానికుల అవసరాలు తీర్చేవారు. అప్పట్లో వస్త్రోత్పత్తికి ఎలగందుల పేరెన్నిక గన్నది. మిట్టపల్లి,మంచికట్ల,వేముల,దూడం,గాలి,దూస మొదలైన ఇంటి పేర్లతో ఇక్కడ పద్మశాలీలు బట్టలునేసేవారు.వీరి కుటుంబాలనుండి అనేకమంది విద్యావంతులు పై చదువులు చదివి పెద్ద ఉద్యోగాలలో స్థిరపడినవారున్నా రు.ఇంజనీర్లు,డాక్టర్లు,ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగాలలో ఇప్పుడు దేశం నలుమూలలా వారి వారసులు ఉన్నట్టుఈ పోస్టింగులు చదివి స్పందించే వారిని బట్టి తెలుస్తున్నది. వీరిలో మిట్టపల్లి మల్లేశం,మంచికట్ల రామస్వామి ఇంజనీయర్లుగా పేరు తెచ్చుకున్నారు.వీరి వివరాలు పూర్తిగ సేకరించి తరువాత తెలియ జేయాల నుకుంటున్నాను. 1950-60 మధ్య కాలంలోనే ఇక్కడి నుంచి పైచదువు లకు వెళ్లి గోల్డ్ మెడల్ సాధించిన మిట్టపల్లి మల్లేశం గారి లాంటి వారున్నారని తెలిసి ఆనందం కలిగింది.అలాగే మీది వాడకు అనేక వైష్ణవ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ కుటుంబాలనుండి కూడా పలు వురు విద్యావంతులు ఉన్నారు. నాకు తెలిసి బాపు శిష్యుడినని చెప్పి మురి సి పోయి నన్ను ఎలగందుల చరిత్ర రాయడానికిబాగా పురికొల్పిన ప్రొఫెసర్ కే.విష్ణుమూర్తి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోలా (Law) కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేశారు వారు ఇటీవలే దివంగ తులు కావడం నా దురదృష్టం. మరొకరు ఎలగందులలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులుగా సేవలందిం చిన నాగరాజు తిరుమలయ్య గారి పెద్ద కుమారుడు నాగరాజు రామ స్వామి గారు ఎలక్ట్రికల్ ఇంజనీయరు గా కొంత కాలం ఇండియాలో పనిచేసి ఆ పై దేశ విదేశాల్లో పని చేశారు వారిగురించి ప్రత్యేకంగా రాస్తాను.మీది వాడ అనగానే గుర్తుకు వచ్చే మరో మనిషి నిమ్మల రాజయ్య సారు.బాపుకు ఆత్మీయ మిత్రుడు.వారిది అపూర్వ మైత్రి.చిన్నప్పటి నుంచి చివరి దాకా కొనసాగిన స్నేహం వారిది మా కుటుంబంలో ఒకరన్నంత విధంగా ఇంట్లో ఏ కార్యం జరిగినా బాపుకు తోడ్పడేవారు.ఆయన ఆప్యాయంగా పిలిచిన పిలుపు నేనెన్నటికీ మరిచి పోలేను.మమ్మల్ని చూడగానే ఆయన కళ్లల్లో మెరుపు మెరిసేది.వదనం వికసిత కమలమయ్యేది.ఏవి అప్పటి ప్రేమలు.ఇక అంగడి బజారు విశేషాలు సరిగ్గా ఖిల్లా ముందే ఈ అంగడి బజారు. నా చిన్నతనంలోఅది ఓపెన్ స్ట్రీట్ మాల్ లాంటిది. పప్పులు, ఉప్పులు,బియ్యం,మక్కలు,జొన్నలు, కందులు,పెసళ్లు,శనిగెలు, ఉల్లిగడ్డలు, వెల్లిగడ్డలు,చింతపండు,మొదలైన వన్నీ రైతులు పండించినవి రైతులే అమ్ముకునే బజారు. మారు బేరం కాదు. బోళ్లు, బొచ్చెలు,సౌందర్య సాధనాలు మాత్రం కరీం నగరం నుండి వచ్చేవి.కుమ్మరి కుండలు, మేదరి వాళ్ల చేటలు గంపలు , పద్మశాలీల నేత వస్త్రాలు,కసాయి వాళ్ల మాంసం దుకాణాలు,వగైరా అన్నీ స్థానిక వ్యాపారులవే.కురుమ గొల్లలు గొంగళ్లు నేసి అమ్మేవారు. ఆవుపేట పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. వాళ్లు నెయ్యి తెచ్చి అమ్మేవారు. తెనుగు వాళ్లు.కాలానుగుణంగా అన్నిరకాల స్థానిక ఫలాలు ముఖ్యంగా మామిడి పండ్లు,సీతాఫలాలు,రేగుపండ్లు,జామ పండ్లు వాటితో పాటు తేనె కూడా అమ్మే వారు.బెస్తవాళ్లు చేపలు అమ్మేవారు.దీనికి తోడు పశువుల అంగడి.ఎడ్లు,ఆవులు,బర్రెలు,గొర్రెలు, మేకలు,దున్నపోతులు ఇవన్నీ పశువుల అంగట్లో అమ్మేవారు. కొందరు కాళ్లను పెంచేవాళ్లు కోళ్లను అమ్మటం.ఇక కూరగాయల సంగతి అడుగ వలసిన పని లేదు. నవనవ లాడే తాజా కూరగాయలు ఎరువంటే తెలియని రుచికరమైన అన్ని రకాల కూరగాయలు అమ్మేవారు కాపుద నపు పడతులు.కందగడ్డ బండ్లలో తెచ్చి అమ్మేవారు.ఆలుగడ్డ ల్లాంటివే బయటినుండి వచ్చేవి. వారం సంపాదించిన దాంట్లో వారికి కావలసినవి వారానికి సరిపడా కొనుక్కునే వారు.వారి దగ్గరివి అమ్ముకునే వారు.ఆ అంగట్లోనే మా బడి ఉండేది.దాన్ని అంగట్ల బడి అనే వాళ్లు.అది మాధ్యమిక పాఠశాల అప్పుడూ ఇప్పుడు కూడా.ఊరి ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన దాదాపు అన్నీ ఊళ్లోనే ఉత్పత్తి అయ్యేవి.ఊరివాళ్ల కు జీవనభృతి లభించేది. కయ్యాలైనా నెయ్యాలైనా కల్మష రహితంగా ఉండేవి.గౌరవ మర్యాదలు,ప్రేమలు ,పామురాలు, అతిచమైనవి గా ఉండేది.నీతీ నిజాయితీకి విలువ ఉండేది.మారుబేరాలంటే అద్దాలు, దువ్వెనలు,మొలతాళ్లు,నల్లపూసలు, పగడాలు,సబ్బులు,సవరాలు,జడకొప్పులు,వంటివి పూసవేర్లవాళ్లు తెచ్చిఅమ్మే వారు.బుక్క వాళ్లు పూజా సామగ్రి కుంకుమ, పసుపు బుక్కా,, గులాలు,ఊదు,మైసాక్షి,గుగ్గిలం, ఇంకా అప్పటికి ప్లాస్టిక్ భూతం ఆవహించలేదు.ఇత్తడిబోళ్లు, రాతెండి (అల్యూమి నియం ) పాత్రలు కరీంనగర్ నుండి వచ్చేవి.కిరాణాదుకాణాల్లోఉప్పు,శర్కర,చాయపత్త,లవంగాలు,యాలకులు,ఛాలియా(పచ్చి వక్కలు),జర్దా, ఊదు బత్తులు పల్లినూనె పసులకు పల్లి పిండి,పుట్నాలు,పేలాలు, గోధుమలు వంటి స్థానికంగా దొరకనివే ఎక్కువగా లభించేవి.బుధవారం నాడు కిరాణా దుకాణాలన్నీ కిటకిట లాడేవి.ఒకటి రెండు కోమట్ల తినుబండారాల దుకాణాలుండేవి.వాటిలో కార ప్పూస, జంతికలు, చేగోడీలు, పుట్నాల ముద్దలు,ప్యాలాల ఉండలు,నువ్వుం డలు, పల్లీల ఉండలు ఇవే ఆనాటి తీపి పదార్థాలు.అప్పట్లో గోళీ సోడాకు ఎక్కడ లేని గిరాకీ.ఎండాకాలం వచ్చిందంటే ఐస్క్రూట్లకు ఎక్కడ లేని డిమాండ్. చాయ హోటళ్లు ముస్లింలవి ఉండేవి. వాళ్ల దగ్గరే బన్నులు బిస్కిట్లు దొరికేవి ఊళ్లో బుక్క శంకరయ్య గాజుల దుకా ణంలో భాషింగాలు, కాకి బంగారు పూసలు, రకరకాల అలంకరణ సామ గ్రి దొరికినా అంగడి నాడు కరీంనగర్ నుండి గాజుల మలారాలు దిగేవి. బుధవారం వచ్చిందంటే ఊరంతా కళకళలాడేది ఆ రోజుల్లో. నేనిదంతావర్ణించి చెప్పేదెందుకంటే అప్పట్లోస్వయం ప్రతిపత్తికి తార్కాణం గా దళారీ వ్యవస్థలేని,కల్తీమాటెరుగని మంచి మార్కెటు వ్యవస్థ ఉండేది.ఎవరి కష్టానికి తగిన ఫలితం కొద్దో గొప్పో వారికే లభించేది.- రామ్మోహన్ రావు తుమ్మూరి .


కామెంట్‌లు