కాపీ రైట్ రాయించని వడ్డాది!--ఈ శీర్షిక చూస్తే నా స్కూల్ రోజుల్లో జరిగిన సంఘటనేమో అనుకుంటారేమో...కాదు. ముమ్మాటికీ కాదు. అదొక ఊహకందని శిక్ష. నా ఉద్యోగ జీవితంలో నాతో కాపీ రైట్ రాయించడానికి ఓ మ్యాగజైన్ యజమాని విధించిన శిక్ష. ఓ నలభై రెండేళ్ళ క్రితం నాటి మాట. కోడంబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలో పద్మనాభ పిళ్ళయ్ అనే వీధుండేది. ఆ వీధిలో బాలా నందం అనే పిల్లల మాసపత్రిక ఉండేది. అక్కడ పని చేసింది స్వల్పకాలమే. సర్క్యులేషన్ చూసేవాడిని. ఆ పత్రికకు సంపాకులు వడ్డాది బుచ్చికూర్మనాథంగారు. ప్రతీ నెల మాసపత్రిక తయారయ్యే ముందు ఏజెంట్లకు పోస్ట్ కార్డు రాయాలి. సంచిక తయారైంది, మీ ఆర్డర్ తెలియజేయమని కోరుతూ ఓ రెండు వందల యాభైకిపైగానే ఉత్తరాలు రాయడం, ఏజెంట్ల నుంచీ ఆర్డర్ అందుకున్న ప్రకారం కాపీలు పంపడం నా విధి. అయితే ఓ నెల ఓ పది పదిహేను పోస్టుకార్డులు కుదురుగా.రాసిన తర్వాత చేతిరాత దెబ్బతిని అక్షరాలు చిత్తమొచ్చి నట్లుండేవి. అవి చూసి యజమాని రంగారావుగారికి చిర్రెత్తుకొచ్చి పోస్టుకార్డులని విసిరేసి కస్సుబుస్సులాడారు. ఇంతలో లంచ్ టైమ్ అవడంతో భోం చేసి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. అన్నం తినేసి మళ్ళీ ఆఫీసుకి రావడంతోనే నేను కూర్చునే టేబుల్ మీద తెలుగు కాపీ రైటింగ్ నోట్ బుక్కు ఉంది. నన్ను చూడటంతోనే రంగారావుగారమ్మాయి వచ్చి "నాన్నగారు మిమ్మల్ని కాపీ రైటింగ్ రాయమన్నారండి. మీ హ్యాండ్ రైటింగ్ నచ్చలేదన్నారు" అని చెప్పింది. మరో దారి లేక కాపీ రైటింగ్ ఒక పేజీ పూర్తి చేసేసరికి ఎడిటర్ బుచ్చికూర్మనాథం గారొచ్చారు. ఆయనది నా పక్కనే సీటు.నేను కాపీ రైటింగ్ రాయడం చూసి "ఏంటండీ? ఇది స్కూలా కాపీ రైటింగ్ రాయడానికి. రాయకండి. ఆపండి. మరేవైనా పనులుంటే చేసుకోండి. రంగారావుగారికి నేను చెప్తొనులెండి" అన్నట్లే బయటకెళ్ళి వచ్చిన రంగారావుగారితో మాట్లాడి కాపీ రైటింగ్ శిక్ష తప్పించారు. ఇంతకూ ఈ బుచ్చికూర్మనాథం మరెవరో కాదు, ఒకప్పుడు సినీ రచయిత. ఆయన రాసిన పాటలలో ఇలవేల్పు సినిమాలోని "చల్లని రాజా ఓ చందమామా..." బాగా ప్రసిద్ధి చెందింది అప్పట్లో. ఈ చిత్రం 1956 ప్రాంతంలో వచ్చింది. ఆయనే 1966 లో విడుదలైన పొదుకా పట్టాభిషేకానికీ మాటలూ పాటలూ రాశారు. తెలుగు సినీ చరిత్రలో పాదుకా పట్టాభిషేకం సినిమా మొదటిసారిగా 1932లో నిర్మించారు. ఈ చిత్రంలో సురభి కమలాబాయి, అద్దంకి శ్రీరామమూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. మరో పదమూడేళ్ళకు అనగా 1945లో శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై కడారు నాగభూషణం, 'పాదుకా పట్టాభి షేకం' చిత్రం రూపొందించారు. పుష్పవల్లి, సియస్‌ఆర్, కన్నాంబ, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి తదితరులు ఈ చిత్రంలో నటించారు.ఆ తరువాత వసంత కుమార్‌రెడ్డి దర్శకత్వంలో 1966లో పాదుకా పట్టాభిషేకం మళ్ళీ తీసారు. వడ్డాదిగా పేరుపొందిన రచయిత బుచ్చి కూర్మనాథంఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వాల్మీకి మహర్షి చిత్రాన్ని ప్రముఖంగా చూపుతూ వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ చిత్రం తీశారు. ఈ చిత్రంలో సందర్భోచిత పద్యాలను ఘంటసాల, రాఘవులు, పి.బి. శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించారు. కొంత కాలానికే ఇద్దరం బాలానందంలో ఉద్యోగాలు మానేసాం. కొన్ని రోజుల తర్వాత నేను మద్రాసు ఆళ్వారుపేటలో శిల్పి దుకాణంలో అసిస్టెంటుగా చేరాను రెండు వందల యాభై రూపాయల జీతానికి. ఇక్కడ మధ్యాన్నం లంచ్ టైములో భోజనాలు కానిచ్చుకుని తలుపులన్నీ మూసేసి ఓ రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకునేవాళ్ళం. ఆ సమయంలో షాపులో గ్రామ్ ఫోన్ రికార్డులు పెట్టుకుని పాటలు వినేవాళ్ళం. ఆ పాటలలో "చల్లని రాజా ఓ చందమామా..." ఒకటి. అది రాసింది వడ్డాది బుచ్చికూర్మనాథంగారే. అయితే ఇటీవల అంతర్జాలంలో చూడగా శ్రీశ్రీగారు ఆ పాట రాసినట్టు ఉంది. కానీ కొన్ని చోట్ల వడ్డాదిగారు రాసినట్లే ఉంది. నేను శిల్పీ దుకాణంలో ఉన్నప్పుడు ఆ పాట బుచ్చికూర్మనాథంగారిదే అని గ్రామఫోన్ రికార్డుమీద చూసినట్లు గుర్తు.ఆ తర్వాత చాలాకాలానికి బుచ్చికూర్మనాథం గారిని హైదరాబాదులో ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ గారింట్లో కలిశాను. ఆయనకు మా నాన్నగారుకూడా ఎరుకే. ఆయన చాలా చాలా నిదానస్తులు. నెమ్మదిగా మాట్లాడేవారు. నుదుట తిలకం పెట్టుకునేవారు. ఖద్దరు లాల్చీ వేసుకునేవారు. మాటల మధ్యలో జోకులు వేసేవారు. విజయనగరానికి చెందిన వడ్డాదిగారు 1950 దశకంలో సినీ పరిశ్రమకొచ్చారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలలో ఆయన పేరు కె. వడ్డాది అని వేశారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు