మళ్ళీ బుడుగుని గీశాను---చలంగారి ఓ పుస్తకం కోసం వెతుకుతుంటే అది దొరకలేదుకానీ ఎప్పుడో మా ఆవిడకు అడగగా కొనిచ్చిన "బుడుగు" పుస్తకం కంట పడింది. తెలుగు ఏమాత్రం చదవడం వచ్చీ పుస్తకాలు తిరగేసే అలవాటున్న వారికి బుడుగు ఠకీమని స్ఫురిస్తాడు. బుడుగు అల్లరి చేష్టలు కడుపుబ్బా నవ్విస్తాయి. అంతటి గొప్ప కుర్రాడ్ని (బుడుగు) సృష్టించిన ఘనత ముళ్ళపూడి వెంకటరమణగారిది. 1956 నవంబరు మాసంలో ముళ్ళపూడివారి ఈ గడుగ్గాయ్ పాఠకులముందుకొచ్చాడు. ముళ్ళపూడి వారి హాస్య రచనకు బాాపుగారి బాపు బొమ్మలు తోడై వెలువడిన బుడుగు పుస్తకం చదివినన్నిసార్లూ హాయిగా ఉంటుంది మనసుకి. ఒత్తిళ్ళు మరచిపోతాం. బుడుగు భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన చదివితేనే ఆనందం.తెలుగు సాహిత్యంలో బుడుగుకున్న స్థానం ప్రత్యేకమైనది. ఈ రచన ప్రశంసిస్తూ ఆరుద్రగారు తమ కూనలమ్మ పదాలులో ఇలా అన్నారు..."హాస్యమందున అఋణ అందె వేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మా!" అని. బుడుగు పుస్తకంలోని నాన్న, అమ్మ, బామ్మ, బాబాయి, సీత, ప్రైవేటు మాష్టారు, సిగాన పెసూనాంబ (బుడుగు గర్ల్‌ఫ్రెండ్) ఏ పాత్ర చదువుతున్నా నవ్వులే నవ్వులు. ఈ పుస్తకాన్ని మొట్టమొదటిసారి నేను మల్లాది రామకృష్ణశాస్త్రి గారింట చదివాను. బాపు గారి కుంచెలో ప్రాణం పోసుకున్న బుడుగు, సిగాన పెసూనాంబ బొమ్మలను నాశక్తికొద్దీ గీస్తుండేవాడిని. 1982లో మా ఆవిడను చూసినప్పుడు మళ్ళీ "బుడుగు - సిగాన పెసూనాంబ" బొమ్మలు ఓ ఇరవై అయిదు బొమ్మలు గీసి ఓ నోట్ బుక్కులో అతికించి బుడుగు భాషనే అనుసరిస్తూ సందర్భానుసారం వాటికి క్యాప్షన్స్ రాసి తనకు ఇచ్చాను. కానీ ఆ పుస్తకాన్ని ఏం చేసిందో తెలీదు. ఆచూకీ లేకుండా పోయింది. అంతెందుకు మా ఆవిడకు పెళ్ళికాకముందే బోలెడు ఉత్తరాలు రాశాను. ఆ ఉత్తరాలు రాస్తున్న రోజుల్లోనే చలంగారి గీతాంజలి స్వేచ్ఛానువాద రచనను, ప్రేమలేఖలను ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. వాటిలోని వాటల్ని ఉదహరిస్తూ రాసిన నాటి ఉత్తరాలూ లేవిప్పుడు చదువుకుందామంటే. అన్నీ హుష్ అని అనడంతోనే ఎగిరిపోయిన కాకిలా తనకు రాసినవన్నీ అయిపులేకుండాపోయాయి.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు