తిట్టు కవిత్వం--తిట్టు కవిత్వం ఆచార్య రావూరి దొరస్వామిగారు చెప్పినట్లు ఆవేశపూరితం. మద్రాసులోని వైష్ణవ కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా ఉండిన రావూరోవారు తెలుగులో తిట్టుకవిత్వము అనే శీర్షికతో రాసిన పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1966 - 67) ఉత్తమ గ్రంథ బహుమతి ఇచ్చింది. ఈ గ్రంథపఠనంతో తిట్టుకవిత పుట్టుపూర్వోత్తరాల చరిత్రను తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని శ్రీ శేషాచలం సంస్థవారే ప్రచురించారు. కవితా రచనకు ఆవేశం అవశ్యం. అందులోనూ తిట్టుకవితకు దీని ప్రాబల్యం తప్పనిసరి. మన తెలుగు కవులలో భీమన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, అడిదము సూరన తదితరుల ప్రారంభ కవిత తిట్టుకవిత్వమే. అసలు ఆనాటి కవుల అభిప్రాయం ఏమిటంటే "పది నీతులు పది బూతులు పది శృంగారాలు కల పద్యాలు చదివిన వారే సభలో అధికుడని! తొలిరోజుల్లో రావూరి వారుకూడా తిట్టు కవిత చెప్పిన వారే. ఆయనకు ఆలిండియా రేడియోలో ఇచ్చిన తొలి ప్రసంగ శీర్షిక "ఆంధ్ర దేశములో తిట్టుకవులు". అలనాటి తెలుగు కవుల తిట్టు కవిత్వ విషయం నాకంతగా పరిచయం లేదు కానీ మద్రాసు నుంచి వెలువడిన జ్యోతి మాసపత్రికను వేదికగా చేసుకుని ఒకానొకప్పుడు మహాకవి శ్రీశ్రీగారు, దాశరథిగారు పరస్పరం తిట్టుకున్న కవితలు నేనెరుగుదును. ఇంతకూ వారిమధ్య ఎందుకు గొడవ మొదలైందో అన్న విషయం నాకైతే తెలీదు. కానీ వారు ఒకరినొకరు తిట్టుకుంటూ రాసిన కవితలు నా దగ్గరున్నాయి. అవి చదివినప్పుడు ఈ ఇద్దరు కవులూ తమ తమ హోదాను మరచి దూషించుకున్నారేమిటి చెప్మా అని అనిపించింది. "ఉత్తుంగ శరధి తరంగాలు" అనే శీర్షికతో దాశరథిగారు "ఒరే ! ఒరే ! తిట్టుకవీ ! ఇదిగో ! ఈ పొట్టి కవి నిన్నిక పాతాళానికి తిన్నగ తొక్కేయగల త్రివిక్రముడే, తెలుసుకో అంటూ మొదలుపెట్టి ముసలి కవీ ! నీ బతుకు చిల్లి పడిన బొక్కెన ....నీ మహాప్రస్థానం నీ పాలిటి మహా శ్మాశనం....దాశరథిని ఎదిరించే దమ్ములు నీకేవిరా!..." అని ఇష్టమొచ్చినట్లల్లా తన కవితలతో శ్రీశ్రీగారిపై ధ్వజమెత్తారు. అయితే శ్రీ శ్రీ గారు "పొట్టి కవి ఆవేశం/ వెనక నించి పంపు / శరీరమే రొచ్చు గుంట / శారీరం కంపు/ తననాలకి రాయలేవు / మాటలకే కరువు / సినిమా చాన్సులు దొరక్క / మనసు కెంత బరువు / నారాయణ రెడ్డి లాగ / రాయాలని దురద / కలం నుంచి కారేదే చవక సెక్సు బురద/ " ఇలా రకరకాలుగా తిట్టుకొచ్చారు. 1970 డిసెంబరులో వెలువడింది.ఈ ఇద్దరు మహామహుల మధ్య సాగిన తిట్టు కవితలపర్వం ఇక మానండంటూ మా నాన్నగారు అదే "జ్యోతి" మాసపత్రికలో ఓ వ్యాసం రాశారు."నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - అనే పుంతలో ఉండి యిలా రాసుకుంటూ ఆడి పోసుకుంటూ ఉన్న బుద్ధిమంతులిద్దరున్నూ, మనమేమి చెయ్యగలం, ఇంతకీ మన తెలుగు సరస్వతి నోములు యిలా కాలిపోయాయి....తిట్టుకోడమైనా సరసంగా హుందాగా వుంటే బాగుండును ....సాటి రచయితగా వీళ్ళ దూషణ సాహిత్యాన్ని చదివి బాధపడి యిలా అంటున్నాను...ఈ యిద్దరికీ నాకంటె కీర్తిప్రతిష్ఠలు, అంగబలం, అర్థబలం ఉన్నవారే...వివేకం ఉపయోగించుకొని సరసంగా యీ యుద్ధాలు మానుకుని సంఘానికి సన్మార్గాన్ని నడిపేవారయితే నలుగురూ సంతోషంగా హసిస్తారు లేకపోతే అపహసిస్తారు" అని రాశారు.నిజమంతేగా!! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు