నేను 1972 ఏప్రిల్ 17 నుండి రమారమీ 1997 ఆగస్టువరకూ బి.ఇడి అసిస్టెంట్ గానే పనిచేసాను.నేను జూనియర్ ను అయినా ప్రతీ హెడ్మాష్టరు మిగిలిన సీనియర్ టీచర్స్ కంటే నాకే స్కూల్ ఇన్- ఛార్జ్ గా ఎక్కువ అవకాశాలు ఇచ్చే వారు. విద్యా సంబంధమైన సెమినార్ లు ఎక్కడ జరిగినా నన్నే పాఠశాల తరపున రిప్రెజెంట్ చేసేవారు. పాఠశాల అభివృద్ధి అంటే పాఠశాల భౌతికావసరాలే కాదు. పాఠశాలకు అవసరమైన క్రమశిక్షణ, సిబ్బంది సమైక్యత, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నిర్వహించే సత్తా గల ప్రధానోపాధ్యాయుడు, సబ్జెక్టులో సత్తా గల ఉపాధ్యాయులు, ఉపాధ్యా యేతర సిబ్బంది, క్రమశిక్షణగల విద్యార్థులు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఆనాడే పాఠశాల అభివృద్ధి నిరాటంకంగా జరుగుతుంది. నా ఫస్ట్ అపాయింటుమెంట్ టెక్కలి గరల్స్ హైస్కూలు లో జరిగిందని చెప్పాను. సర్వీస్ ప్రారంభంలో నేను బోధ పరచివలసిన సబ్జెక్టును అభివృద్ధి చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎదుటివారికి నాకంటే సబ్జెక్ట్ బాగా తెలుసుననినేను భావిస్తే నాకంటే జూనియర్ అయినా ఫరవాలేదు. మనకు తెలియని విషయం చిన్నదైనా తెలుసు కోడానికి వాడు కాన్వెంట్ విద్యార్థా, కాన్వెంట్ ఉపాధ్యాయుడా అన్నది ప్రశ్నకాదు. ఏదైనా ఒక పదానికి, వాక్యానికి అర్థం తెలుసుకోకుండా వెళ్లి తప్పును బోధపరచి మనం కొన్ని తరాల వారికి ఆ తప్పును నేర్పడం అన్నది మహానేరం. అదో క్రిమినల్ చర్యగానే మనం భావించాలి. నేను చెప్పవలసిన పాఠానికి చాలా రోజుల ముందుగానే ప్రిపేర్ అయ్యేవాడిని. 1972-73 విద్యా సంవత్సరంలో ఎనిమిదవ.తరగతి విద్యార్థులకు జపాన్ దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలపై ఒక ఇంగ్లీషు పాఠం ఉండేది. పాఠం అంతా ఇంగ్లీషులో ఉన్నా అందులో నాలుగు, అయిదు పదాలను జపనీస్ భాషలో పలకబడి ఉండేవి. కొన్ని జపనీస్ భాషపదాలకు అర్థాలు ఇంగ్లీషు భాషలోనే ఆ టెక్స్ట్ బుక్ లో వివరణ ఇచ్చాడు. కానీ Hibachi ఆనే జపనీస్ పదానికి అర్థం ఇవ్వలేదు. క్లాసులో పిల్లలు అర్థం అడిగితే ఏం చెప్పాలో తోచలేదు. ఈ పాఠం చెప్పడానికి వారం, పదిరోజుల ముందే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కానీ Hibachi అన్న పదమే నామెదడులో మెదులుతుంది. ఇంతలో బహుభాషాకోవిదుడు రోణంకి అప్పలస్వామి మాష్టారు జ్ఞాపకం వచ్చారు. అతను రోజూ ఇంటి నుండి కాఫీ హోటల్ కు ' టీ' త్రాగడానికి అలా షికారు వచ్చేవాళ్లు. ఒకనాడు మా స్టాఫ్ తో నేను పాఠశాల విడిచిపెట్టి సాయంత్రం ఇళ్లకు తిరుగు ముఖం పట్టాం. అనుకోకుండా మాష్టారిని కలవడం జరిగింది." హిబాఛి " పదం, దాని అర్థం గురించి అడిగాను. అడిగిందే తడవుగా " బొగ్గుల కుంపటి " అని అర్థం చెప్పేసారు.సరికదా ఎందుకైనా మంచిది.ఒకసారి ఇంటికిరా ! ఇటీవలే " The Random House Dictionary of the English Language " అనే డిక్షనరీవచ్చింది. అందులో చూద్దాం " అన్నారు. చూడండి అతనికీ మనకూ ఉన్న వ్యత్యాసం. 14, 15భాషల పండితుడు. మరలా నన్ను ఇంటికి రమ్మన్నారు డిక్షనరీ చూసి confirm చేసుకుని చెప్పడానికి. మనకు నాలుగు అక్షరాలు వచ్చేసరికి అంతా వచ్చని విర్రవీగిపోతాం. మరుచటి దినం ఇంటికి వెళ్ళాను. డిక్షనరీ తీసి చూసారు.తను చెప్పింది correct. మాష్టారు Dictionary చూడడానికి ఇచ్చారు. కొన్ని వందల మంది రైటర్స్ దీనిని 10 సంవత్సరాలు కష్టపడి 1967 నాటికి తయారు చేసారు.1570 పేజీల పుస్తకం. దీని వెల 30 రూపాయలు మాత్రమే ! 103 దేశ భాషలుంటాయి. దీనిని మాష్టారు విశాఖపట్నంలో కొన్నానని చెప్పారు. నేను ఈపుస్తకం కొందామని టెక్కలి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో తిరగని పుస్తకాల షాప్ అంటూలేదు. పిచ్చివానిలా తయారయింది నా పరిస్థితి. అంటే నా గుండెల్లో అంతగా గూడు కట్టుకుపోయింది.1972 నుండి ఈపుస్తకాన్ని వెతకని చోటులేదు. కానీ ఎక్కడా లభించలేదు. తాత్కాలికంగా ఆక్సఫర్డ్ మీడియం ఇంగ్లీషు టు ఇంగ్లీషు, సరస్వతి పిక్టోరియల్ ఇంగ్లీష్ టు తెలుగు మీడియం వాడేవాడిని.1976 జూన్ లో లుకలాపు లక్ష్మణరావుగారు పంచా యతీరాజ్ మినిస్టర్ గా ఉండి చెల్లాచెదురుగా ఉపాధ్యాయు లను. బదిలీలు చేసారు. నన్ను టెక్కలి నుండి పాలకొండ జూనియర్ కాలేజీకి ట్రాన్ఫర్ చేసారు. అక్కడకు బదిలీ పై వచ్చిన వారిలో అధికశాతం కొత్తగా వచ్చిన వారమే ! అప్పటికి నాసర్వీసు మూడు దాటి నాలుగు వచ్చింది. ఉన్న స్టాఫ్ అందరిలో నేనే మోస్ట్ జూనియర్ ను. నాకు ఎనిమిది, తొమ్మిది తరగతులు ఇచ్చారు. లెక్కలు మాష్టారికి వర్క్ లోడ్ చాలక ఇంగ్లీషు పీరియడ్స్ ఇచ్చారు. అతను నన్ను ఒక ఇంగ్లీష్ డిక్షనరీ తాత్కాలికంగా ఇమ్మన్నాడు.అతనో ఇంగ్లీషు డిక్షనరీ కొనుక్కునేవరకూ అడగగా ఇచ్చాను.నేను ఇచ్చిన మూడు, నాలుగు వారాల్లోనే విశాఖపట్నంవెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కుని తెచ్చుకున్నాడు. మరుచటి దినం నా దగ్గరకొచ్చి " ప్రభాకరం‌! నేను పుస్తకాల షాపు వాడి దగ్గరకు వెళ్ళి డిక్షనరీ కావలని అడిగితే ఒక.పెద్ద తలగడ లాంటి డిక్షనరీ ఇచ్చాడు. దాని ఖరీదు 33 రూపాయలు అన్నాడు నా కొలీగ్. నేను వెంటనే అనుకున్నాను నేను ఇన్నాళ్లు వెతుకుతున్న డిక్షనరీ అదే అయిఉండొచ్చని. రేండం హౌస్ డిక్షనరీయా ! అది అయితే మంచిదే అన్నాను.ఎంత మంచిదైనా తనకొద్దన్నాడు. ఆ సాయంత్రమే కాలేజీ విడిచిపెట్టిన తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకున్నాను. ఆరోజు నా ఆనందానికి అవధులు లేవు.ఈనాడు నా ఇంట్లో వేల పుస్తకాలు ఉన్నా ఇప్పటికీ ఈ డిక్షనరీ అంటే నాప్రాణం. ఈ డిక్షనరీలో బహుభాషా కోవిదుడు రోణంకి వారిని చూసుకుంటున్నాను. పుస్తకాలు సేకరించడం, చదవడం రోణంకివారి నుండి నేర్చుకున్నదే.! ( సశేషం )- శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి 701 3660 252.


కామెంట్‌లు