మానేరు ముచ్చట్లు- వెయ్యేండ్ల చరిత్ర గలిగిన వెలిగందల గ్రామం గురించి ఐదారు శతాబ్దాలకు పైగా సబ్బిసాయిర మండలానికి పరిపాలనా కేంద్రంగా విరాజిల్లిన ఎల్గందల్ సర్కారు గురించి దాదాపు నెలరోజులుగా ముచ్చట్లు చెప్పుకొంటూ వస్తూ ఉన్నాం.ప్రతిరోజూ నాకెంతో ఉత్సాహాన్ని ఊపిరిగా అందిస్తూ వస్తున్న వదనపుస్తక పాఠకులకు వందనం.సాక్ష్యాధారాలే చరిత్రకు ఆలవాలం. పరిశోధకులు పలు రకాల సాక్ష్యాలను సేకరించి గతచరిత్రకు ప్రాణం పోయటం సర్వసాధారణం.అవి తాళపత్రాలు కావచ్చు,తామ్రపత్ర శాసనాలు కావచ్చు. శిలాక్షరం అన్న నానుడికి బీజమైన శిలాశాసనం కావచ్చు.పగిలిన పెంకులు, ఇటుకలు,విరిగిన విగ్రహ శకలాలు, కైఫీయత్తులు,తాకీదులు,సిక్కాలు(నాణెములు),ఆభరణాలు,చిత్రపటాలు,కత్తులు,కటార్లు,మిగిలిపోయిన కట్టడాలు, కోటలు,ఆలయాలు,ఆనోటా ఈ నోటా పాడుకునే పాటలు పదాలు ,కథలూ కమామీషూ ఇలా ఎన్నో ఎన్నో ఏ చిన్న ఆధారం దొరికినా చరిత్రను పునర్నిర్మించి న పరిశోధకులు ఎందరో ఎందరో.నా చిన్నతనంలో పురావస్తుశాఖ వారు త్రవ్వకాలు చేస్తారనీ,మరుగున పడ్డ చరిత్రను వెలికి తీస్తారని విన్నపుడు గగుర్పాటుగా ఉండేది.మా ఊరికి కూడా ఎవరైనా వస్తే వారి వెంబడే ఉండాలని ఖాయిష్ ఉండేది.సకాలంలో సరియైన పరిశోధనలు జరిగి ఉంటే ఇంకా విలువైన సమాచారం లభించి ఉండేది. ముఖ్యంగా ఎలగందుల విషయంలో అది తీర్చలేని లోటు.ప్రశాంతంగా పరిఢవిల్లుతున్న ఊరిపై అశనిపాతంలా మానేరు జలాశయనిర్మాణం వేటు పడింది.ముంపుకు గురయ్యే గ్రామాలలో ఇదొకటి కావటం అనివార్యమై పోయింది కళకళలాడే గ్రామం వెలవెల పోయింది. విలవిలలాడింది.పందొమ్మిది వందల ఎనభైకల్లా ఊరంతా ఖాళీ అయ్యింది. నేను తిరిగిన వాడలు లేవు.నేను చూచిన ఇండ్లు లేవు.కూలికుప్పలు పడ్డ ఇండ్లలో తుప్పలు తుమ్మలు మొలిచాయి ఆ సమయంలో కొందరు ఊరి బయట ఇండ్లు నిర్మించుకుని కన్న ఊరి మీద మమకారం చావక అక్కడే ఉన్నారు.అలా ఊరు మునిగి పోయినా ఊరవతల ముంపు ప్రమాదం లేని చోట ఇల్లు కట్టు కున్నవారిలో బాపు ఒకరు.1977లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా(ప్రథమ శ్రేణి తెలుగు పండితుడు) ఉద్యోగవిరమణ కాగానే ఎలగందుల బస్టాండ్ దగ్గర పెద్ద గైని (గవని)కివతల పాత కరీంనగరం తొవ్వకు ఇల్లు కట్టడం ప్రారంభించి 1979 కల్లా పూర్తి చేశారు.చాలీ చాలని జీతం, గడిచీ గడవని జీవితం. గంపెడు సంసా రభారం.ఇల్లు గడవక కరీంనగరం ఆర్షియా మాడల్ స్కూల్లో పునరుద్యోగం. రోజూ కరీంనగర్ ఎల్గందల్ అప్ అండ్ డౌన్.నా ఉద్యోగం ఆదిలాబాదు జిల్లా కాగజ్ నగర్ సర్సిల్కు మిల్లులో కెమిస్టు 1974 నుండి ఉద్యోగం.హాఫ్ ఎ మిలి యన్ జాబ్ టీచరుద్యోగం చేయడం ఇష్టం లేక అక్కడ చేరాను.జీతం మాత్రం వాళ్లకు మల్లేనే నెలకు నూటాయాభై రూపాయలు.పెళ్లి కానంతకాలం సగం జీతం పంపాను.1978 లో నా పెళ్లి జరిగింది.ఎంత మిగిలితే అంత పంపాననుకుంటా .ఆయన తిప్పలు ఆయనకు తప్పలేదు.కానీ ఎన్నడూ ఆయన ముఖంలో ఉదాసీనత చూడలేదు.ఉల్లాసమే తప్ప.అలాంటి సమయంలో నేను ఒకసారి సెలవు పెట్టి ఎలగందుల వెళ్లాను.ఏమీ తోచక ఊరు చూద్దామని పాతసైకిలుంటే తీసుకుని ఊరంతా తిరిగి వచ్చాను.హృదయం తరుక్కు పోయింది.ఏవో పదాలు అస్పష్టంగా వెలువడే ప్రయత్నం చేస్తున్నా యి.అందిన కలంతో దొరికిన కాగితం పై రాసిపెట్టుకున్నా.అప్పటికి నాకు కవిత్వపు జోలి లేదు.కానీ కన్నీళ్లు అక్షరాలైనాయి ఆవేళ.నిజం.బాగా ఏడ్చాను మనసులోనే చదవండి నా అశ్రువులు ఘోషించిన అక్షరాలు రాచరికపు వైభవమున వెలుగొందిన వెలిగందుల పేదరికపు ఛాయలతో బిక్కు బిక్కుమంటున్నది నాడు తిరిగిన దారులన్నీ ముళ్లపొదలతొ మూసుకున్నవి నాటి తీయని యాదులన్నీ చేదుమాత్రలు మింగుతున్నవి కూలిపోయిన మట్టిగోడలు రాలిపోయిన గూనపెంకులు శిథిలగ్రామపు జాడలన్నీ చితికిపోయిన గాలి మేడలు ఆలయమ్మున దేవుడేడీ అయ్యయో కనిపించడాయె జంతువులు తమఇచ్చవచ్చిన యటుల గుడిలో తిరుగ సాగె మామిడాకుల తోరణమ్ముల ముంగిళులు మటుమాయ మాయెను తీర్చిదిద్దిన రంగవల్లుల వాకిళులు కనిపించవాయెను మానవునికే కాదు మరణము ఊళ్లకైనను తథ్యమాయెను పిచ్చిమొక్కల నడుమ ఊరిని గాంచి ఉల్లము తల్లడిల్లెను గుర్తుకు వస్తుందో లేదో అనుకున్నాను. అది గుండె గాయపు గేయం కదా నలభై ఏళ్లయినా ఇంకా పచ్చిగానే ఉంది. పిలువగానే పెదాలమీదికి ఉరికి వచ్చింది. సాధారణంగా సంతోషాలే పంచుకోవాలంటారు.కానీ ఈ రోజు మీతో నా బాధ పంచుకోక తప్పలేదు.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు