నేను ఏప్రిల్ 1996లో బలిజిపేట ' B' సెంటర్ కు పదవ తరగతి పరీక్షలు ఛీఫ్ సూపరెంటెండెంట్ గా ఉండి ప్రశాంతంగా ముగించేసాను. తరువాత పదవ తరగతి స్పాట్ వేల్యూషన్ వర్క్ ముగిసింది. అదే సంవత్సరం జూన్ నెలాఖరున మా స్కూలు హెడ్మాష్టరు రిటైర్ అయిపోతారు. ఆ కారణంగా ఆ స్కూల్ సైన్స్ అసిస్టెంట్ ను ఎఫ్.ఏ.సి హెడ్మాష్టరుగా నియమింప చేద్దామని హెడ్మాష్టరు, వారి కోటరీ అంతా నాకు తెలియ కుండానే ఏప్రిల్ నెల నుండీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో మండల ప్రెసిడెంట్ తమ్ముడు కూడా చేరి ఆ సైన్స్ అసిస్టెంట్ ను ఫుల్ అడిషనల్ ఛార్జ్ హెడ్మాష్టరు గా తెచ్చుకుంటే భవిష్యత్తులో వారు ఎలా చెబుతే అలా వింటాడని వారి భావం. ఆ కారణంగా (కోటరీలోని వారంతా మండల ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లి వారి గోడు విన్నవించుకున్నారు. నిజానికి అతను నేను 20 సంవత్సరాలు అభిమానంగా ఉండేవాళ్ళం. బలిజిపేటలో ఇరవై సంవత్సరాలు నేను ట్రాన్ఫర్ కాకుండా ఉన్నానంటే మండల ప్రెసిడెంట్ ఆదరాభిమానాలు మెండుగా ఉండడం వల్లనే ! వాళ్ళ తమ్ముడు మాట కాదనలేక కోటరీకి సహాయం చేద్దామనే నిర్ణయానికి వచ్చారు మండల ప్రెసిడెంట్ గారు. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జిల్లా పరిషత్ అధికారుల వలన వినడం జరిగేది. కోటరీ సభ్యులకు మండల ప్రెసిడెంట్ తప్పిస్తే రాజకీయంగా మరో ఆధారం లేదని నాకు తెలుసు.ఈ విషయాన్ని గమనించిన నేను బొబ్బిలి ఎం.ఎల్.ఏ గారికి, ఏ. పి.టీచర్స్ ఫెడరేషన్, విజయనగరం శాఖకు నా విషయాన్ని వివరంగా చెప్పి District Collector's Selection Committee Seniority List ( రోస్టర్ పద్ధతిలో మెరిట్ ద్వారా తయారు చేసిన లిస్ట్ ) ప్రకారం నన్ను ఎఫ్. ఏ.సి హెడ్మాష్టరుగా నియమించమని కోరాను. ప్రతీ క్షణం ఆటంకాలు. ఎవరి ప్రయత్నం వారిది అనుకున్నాను గానీ ఆ సైన్స్ అసిస్టెంట్ ది సీనియారిటీ లిస్టులో నాకంటే 21 నెంబర్లు వెనుకబడి ఉన్నాడు. అయినా నన్ను తప్పించేటందుకు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగాయి. చివరకు రెండు నెలల తరువాత విజయం నన్నే వరించింది. నేను 1996 జూలై 1 న ఎఫ్ ఏ సి హెడ్మాష్టరు పదవిని చేపట్టాను. అంతా కలిసి 30 మంది స్టాఫ్ ఉండే వారు. అందులో రిటైర్డ్ హెడ్మాష్టరు మరో ఆరుగురు, ఏడుగు రు గ్రూపుగా ఉండేవారు. మరికొందరు అటూకాక ఇటూకాక మధ్యస్థంలో ఉండేవారు. నా పక్షాన మరికొందరు ఇలా 30 మంది స్టాఫ్ తయారయ్యారు. అప్పటి నుండి అనునిత్యం ప్రతీ పనిలోనూ చాప కింద నీరులా నా పనులకు కొందరు ఆటంకం కల్పించేవారు. వాటిని అధిగమించఅయి ఉండేది. మా స్కూల్ సింగిల్ సెషన్ లో ఉదయం 7.30 నుండి 12.30 వరకూ జరిగేది. మద్యాహ్నం జూనియర్ కాలేజీ క్లాసులయ్యేవి. ఆకారణంగా కోటరీ సభ్యులంతా ముందు రోజు సాయంత్రం సమావేశమై రేపు ఉదయం హెడ్మాష్టరుకు (నాకు) పరిపాలన పరంగా ఎటువంటి ఆటంకం కలిగించా లన్నదే వారి ఉద్దేశం. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి పరిపాలన సాగించడమే నా పని. పై అధికారుల మద్దతు నాకు ఉన్నా ఎన్నడూ పాఠశాల సమస్యలను వారికి చెప్పేవాడనుకాదు. స్టాఫ్ సమస్యలను అధికారులతో చెప్పడం వలన స్కూల్ లో తగాదాలను ఇంతకు అంతచేసి పాఠశాలలో ఉద్రిక్తతలనుపెంచడం నాకు ఇష్టముండేదికాదు.ఈతగాదాలు మూలంగా విద్యార్థుల తరగతులు దెబ్బతిం టాయి. పాఠశాలలో ప్రశాంతత దెబ్బతింటుంది. పబ్లిక్ లో చీప్ అయిపోతాం. అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం మన పిలకను వారి చేతికి ఇవ్వడమే అవుతుంది. మనం ఇవ్వవలసిన తీర్పును వారి చేతిలో పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. అలా పై అధికారులకు స్టాఫ్ మీద కంప్లైంట్ఇచ్చి మన అసమర్థత చాటుకోకూడదు. ఎదుటివారు మనల్ని అసమర్ధ పాలకునిగా గుర్తించకూడదు. తప్పు చేసినవాడు తప్పనిసరిగా లొంగక తప్పదు. నేను ప్రధానోపాధ్యాయునిగా మొదటి స్టాఫ్ మీటింగ్ఆ రోజునే పెట్టాను. పాఠశాల పనివేళలు తప్పనిసరిగా పాటించాలి. ప్రార్థనాసమయం 7.20నిముషాలకు ముందుగానే రావాలి. అలా రాలేని పక్షంలో లేట్ మార్క్ వెయ్య బడుతుంది. అలా మూడు లేట్ మార్క్ లకు ఒక కాజువల్ లీవ్ మార్క్ చెయ్యబడుతుంది. ( తరువాత కాలంలో ఉపాధ్యాయులకుఈ సదుపాయం తొలగించేసారు. ప్రార్థనా సమయానికి ఒకనిముషం లేటు అయినా సి.ఎల్ మార్క్ చేస్తారు). 7.30 కి టీచింగ్ బెల్ కొట్టబడుతుంది. ఆ టైం లోగా వచ్చిన వారికి స్కూలులోనకు ప్రవేశం ఉంటుంది. ఆ టైంకు ఒక్క నిమిషం దాటినా పాఠశాల గేట్ కు తాళం వేయబడుతుంది. రోడ్డుప్రక్కనే స్కూల్ ఉంది కాబట్టి టీచర్స్ బయట నిలబడితే రోడ్డు మీద వచ్చే పోయేవారు పరిశీలి స్తారు. అది ఉపాధ్యాయవృత్తికే సిగ్గుచేటన్నాను. పాఠశాలలోక్లాసుల సిలబస్ ఏ నెల సిలబస్ ఆ నెలే పూర్తి చేయాలి. చాలామంది టీచర్స్ తమకు ఏ పీ‌రియడ్ అయినా ఖాళీగా ఉంటే ఆ ఖాళీ పీరియడ్లలో హోటల్ కు గుంపులు గుంపులుగా స్టాఫ్ వెళ్ళడం వలన పబ్లిక్ దృష్టిలో చాలా చులకన అయిపోతున్నాం.పాఠాలు అంతా కష్టపడి చెబుతున్నా పబ్లిక్ దృష్టిలో చెప్పనట్టే ఉంది.ఇంతవరకు అందరూ క్లాసులు ఎగ్గొట్టే సాంప్రదాయం మన స్కూలులో లేదు. అయినా టీచర్స్ ఎప్పుడూ రోడ్లు మీద తిరుగుతు న్నారనే అప్రతిష్ట ఉంది. అంచేత మనలో మార్పురావాలి అన్నాను. అందరూ ఆశ్చర్యంగా చూసారు టీలు టిఫిన్ లు మానేయమంటారా అన్నట్టు ! వారి ముఖ కవలికల్ని అర్థం చేసుకుని మీరెవరూ టీ,టిఫిన్ లు లేకుండా పస్తులుండ నక్కరలేదు. మీకు ఒక అటెండర్ ను అలాట్ చేస్తాను. మీకు కావలసినవి మీరు అతని ద్వారా తెప్పించు కోండి ఫ్లాస్క్ కూడా కొనిపెడతాను . అలాగే శుక్రవారం మనకు సంత జరుగుతుంది. ఆ సంతకు లీజర్ ఉన్నవాళ్లు వెళ్ళడం, లేనివారు సంతకు వెళ్ళలేదని బాధపడటం జరుగుతుంది. సంత అనేటటువంటిది మధ్యాహ్నం కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12.30నుండి మరుచటి దినం వరకూ ఖాళీయేకదా ! బ్యాంకు ఇతర పనులను కూడా ఆ టైంలోనేపూర్తి చేసుకోండని స్టాఫ్ మీటింగ్ ముగించేసాను.(సశేషం )- శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు