రాణెమ్మ కథలు 23. రైతురాణి.2--ఎనిమిదో తరగతిలో ఉండగా జనవరి నెలలో కోతలు కోసే కాలం వచ్చింది.మావి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పొలాలు ఒక పంట మాత్రమే పండిస్తారు. నాట్లు కొంచెము ఆలస్యంగా జరుగుతాయి సహజంగా కోతలు కూడా అలానే ఉంటాయి.దుక్కి దున్నటం, వరినారు చల్లటం ,తడి చేను దమ్ముచేయటం,మెత్తటి బురద నేలలో నాట్లు వేయటం,కలుపుతీయటం, ఎరువు చల్లటం, పొట్టమీద ఉన్న పైరు, పాలకంకి వెళ్ళటం,పూర్తిగా బంగారు రంగులో మారిపోయే చేను వివిధ దశల్లో ఒక్కో అందం సంతరించు కుంటుంది.రైతుకు కూడా ఒక్కో దశ గడిచే కొద్దీ మది సంతోషంతో కొద్దీ కొద్దిగా నిండుతూ ఉంటుంది.పొలం కోతలు జరిగే టప్పుడు పొలం గట్టున కూర్చుని ఒకచేత్తో పైరును కొంచెం పక్కకి వంచి పట్టుకుని పదునైన కొడవళ్ళతో చకచకా కోసేసుకుంటూ పోయే ఆడ,మగ కూలీలను గమనిస్తూ ఉండటం భలే అనుభవం.ఆ సమయంలో వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు సరదాగా ఆట పట్టించుకోవటం, ఒకళ్ళకి ఒకళ్ళు చిన్న చిన్న సాయాలు చేసుకోవటం చూస్తే, పనిజరిగే చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. పాటలు పాడటం వచ్చిన వాళ్ళు నిస్సంకోచంగా గొంతు విప్పి ఎంతచక్కగా పాడతారో.తెచ్చుకున్న అన్నాలు, కూరలు పంచుకుని తింటుంటారు.రెండు రోజులు కోతల కార్యక్రమం గమనించాక పాట పాడాలని పించలేదు కానీ కోతకోయాలి అనిపించింది మనకి.ఒక అమ్మయి దగ్గరి అదనపు కొడవలి తీసుకుని ఒక మునుము(మడిలో బారుగా ఆగట్టు నుంచి ఈగట్టువరకు పంటను ఎడంచేయడాన్ని అలా అంటారు) మొదలు పెట్టి కోయటం మొదలు పెట్టాను .బాగానే వాళ్ళతో సమానం గా కోయటం వచ్చింది.మనకీ పోటీలు ఇష్టం కదా మొదటి మునుము కోసిన ఉత్సాహంతో అక్కడి వాళ్ళందరితో పోటీ పడి ముందుగా నేనే గట్టుఎక్కేయ సాగాను. వాళ్లంతా ఒకటే నవ్వులు ,ఆశ్చర్యము రాణెమ్మా నువ్వు వ్యవసాయానికి దిగితే మేమేమి కావాల అని.అలా కోతలు,కుప్పలు ,నూర్పిడి ఐనాక జరిగిన సంఘటన మా వ్యవసాయంలో నేను చేసిన మొదటి సంస్కరణకి దారితీసింది.కుప్పనూర్చి వడ్లు గాలి వాలు గా తూర్పార పట్టడం ఒకప్రక్రియ తాలువడ్లు ,గడ్డి పరకలు, దుమ్ము అన్నీగాలికి వెళ్లిపోయి శుభ్రమైన సువర్ణధాన్యం రాశిగా ఏర్పడే వైనం చూడాలిసిందే కానీ వర్ణించలేము.అలా ఆ వడ్లరాసిని బస్తాలకి ఎక్కించి కాటా వేసేవాళ్ళని పిలిచాడు రైతు అదే వూరిలోని ఒక షావుకారు తాలూకు కాటా అంటే కాటా వేసిన వారే వడ్లు కొంటారన్నమాట బస్తా వడ్లు అంటే 76 కిలోలు కొన్ని బస్తాలు కొలిచి నాక మనకి అర్ధం అయ్యింది బస్తాకు రెండు కిలోలు ఎక్కువ వేస్తున్నారని.మా రైతును అడిగాను అవును చేలో కాటాయేస్తే అంతే అని చెప్పాడు.ఈలోగా పర్యవేక్షణకి షావుకారు వచ్చాడు.వచ్చిన వాడు మామూలుగా మనల్ని పలకరిస్తే బాగుండేది.ఏమి రాణెమ్మా ఈవ్యవసాయం ఇదంతా మీకెందుకు పడలేరు పొలం అమ్మేయండి అన్నాడు.అసలే బస్తాకు రెండుకేజీలు దోచుకుంటున్నాడని కోపంలో ఉన్నానేమో,బస్తా ఎంతకి కొంటున్నావ్ అని అడిగా పేటలో కన్నా 10 రూపాయలు తక్కువకి కొంటాం ఎందుకంటే రవాణా ఖర్చులు అవీ ఉంటాయి కదా పైగా మేము చేలోది కొనుక్కుపోతాం ఎలా ఉన్నా మాదగ్గర ధాన్యం నాణ్యత చూస్తారు అన్నాడు చంకలో చిన్న క్యాష్ బ్యాగ్ సర్దుకుని ,చేతి ఐదువేళ్ళకి ఉన్న బంగారు ఉంగరాలు చూసుకుంటూ. బంగారంలాంటి పంట కళ్లెదురుగా ఉంటే నాణ్యత అన్న పదం వాడేసరికి విప్లవాలు ఎందుకు జరుగుతాయో అర్ధం అయ్యింది నాకు ఆ క్షణం మరిగిన నా రక్తం సాక్షిగా. అతను వెళ్ళిపోయాక మా రైతుని అడిగాను ఇతనికి తప్పితే మనం ధాన్యం ఎవరికి అమ్మగలం అని.అతనిది ఊళ్ళో ఎరువుల కొట్టని ముందుగా ఎరువులు అప్పుగా ఇచ్చి ,ఆ రొక్కానికి వడ్డీ వేసుకుని ,పంట వచ్చినపుడు బస్తాకు రెండు కేజీల ధాన్యం ఎక్కువ కొలుచుకుని,టవున్ లో కన్నా 10 రూపాయలు తక్కువ రేటు గట్టుకుని,తన ఎరువుల డబ్బు వడ్డీతో మినహాయించుకుని వడ్లు తీసుకున్న నెలకో ,రెండునెల్లకో మన పంట డబ్బు ఇస్తాడు ఇది మారైతు చెప్పిన సారాంశం.దోపిడీ కళ్లెదురుగా కనపడి పోతుంటే ఎలా వూరు కుంటాం.అప్పటికి ఇంక ఏమి చేయలేము.ఎందుకంటే రైతు ఎరువు అప్పు తెచ్చుకున్నాడు అక్కడ అందుకని ఊరుకుని. ఇంటికి వచ్చి దీనిపై ఏమి చేయగలం అని నాన్న తో మాట్లాడి.ఒక సొల్యూషన్ కనుకున్నాం.మా అక్కయ్య,బావగారు పనిచేసే కాలేజీ సెక్రెటరీ నాగసరపు రామారావు గారు కొన్ని ఎరువుల కంపెనీలకు డీలర్ ఆయన దగ్గర మా రైతుకు ధర్మవడ్డీకి ఎరువులు ఇప్పించాం.ఆయన ద్వారానే ధాన్యం విక్రేతని మాట్లాడుకుని చేలోనే ధాన్యం తిసుకుని డబ్బు కూడా అక్కడే ఇచ్చేసేటట్లు చేసేసుకున్నా మరుసటి సంవత్సరానికి. ఇంకేముంది మీకెందుకు వ్యవసాయం అన్న వ్యాపారి దగ్గర మమ్మల్ని చూసి మరుసటి సంవత్సరం ఎవ్వరూ ఎరువులు తెచ్చుకోలేదు.ఆ తర్వాత అసలు పెట్టుబడి గురించిన సమస్యే లేకుండా మా పల్లెకి చైతన్య గ్రామీణ బ్యాంక్ వచ్చి రైతులకు పెట్టుబడికి రుణాలు ఇవ్వటం మొదలు పెట్టినాక.వడ్డీ దోపిడీ చాలా వరకు తగ్గిపోయింది.అందుకే పొలం నాకు ధైర్యం,ఔదార్యం,ఓపిక,సహనం,నిజాయితీ,తిరుగుబాటు,రాజనీతి,ఆకలి విలువ,మనుషుల శ్రమ విలువ, క్రమశిక్షణ నేర్పిన విశ్వవిద్యాలయం.-- వసుధారాణి.


కామెంట్‌లు