మానేరు ముచ్చట్లు--కరణాల పెద్ద చావిడి మీద పంచాయతీలు జరిగేవి అని చెప్పావు కదా!వాటిలో మిగతావి ఎలా ఉన్నా కాలువ పంచాయితీలు మాత్రం ప్రతి ఏడూ జరిగేవి.పంచాయితీ అనేది ఇక్కడ నాకు తెలిసి ఒక సర్వకర్షక సమావేశమే.దోషులూ,తీర్పులూ వంటివి కావు.ఊరి పెద్దలు కరణం,మాలీ పటేలు (గ్రామ రెవిన్యూ గణకుడు),పోలీసు పటేలు(గ్రామ భద్రతా ఉద్యోగి),కారోబార్లు (గుమాస్తాలు),పట్టాదారులు,కౌలుదారులు మరియు పంచాయితీ సమితి బోర్డు సభ్యులు. అసలు కాలువేమిటి?పంచాయతేమిటి? అని సందేహం రావచ్చు.పొలాలకు నీరందించే పంట కాలువ నే కాలువ అనే వాళ్లం. ఆ కాలువ నీళ్లతో పొలాల్లో వరి పండించే వారు రైతులు.ఆ పొలాలను తరి పొలాలనే వారు.మాగాణి అన్న మాట.దాదాపు ఊరికి మానేరుకు మధ్య దక్షిణం,తూర్పు దిశలలో రెండు కాలు వల నడుమ ఉన్న వన్నీ తరి పొలాలే. మానేరును ఆనుకొని పారే కాలువను ఊరగాల్వ అనీ.ఊరి వైపున ఉన్న కాలువను పెద్ద కాలువ అనీ పిలువడం మామూలుగా జరిగి పోయేది.ఈ సందర్భంలోనే మీకో విషయం చెబితే సరిపోతుంది.సాధారణంగా ఊరికి దగ్గర ఉన్న కాలువ అని పిలువాలి కదా!అలా కాకుండా మానేరుకు దగ్గర ఉన్న కాలువ ఎలా ఊరగాల్వయింది?ఎందుకయిందని పరిశీలిస్తే కొన్ని విషయాలు తెలిసాయి.ఊరగాల్వ నీరు ఊరికి తూర్పు దిశలో ఉన్న లోతట్టు పొలాలకు నీరందిస్తుంది.ఆ ప్రాంతమంతా ఒకప్పటి బహుధాన్య పురం ప్రాంతం.అప్పట్లో ఆ ఊరికి అక్కడి పొలాలకు నీరందించే కాలువ గనుక నాటి కాలం నుండే అది ఊరగాల్వగా వ్యవహరించబడుతూ వచ్చింది.ఆ తరువాత పైనున్న దక్షిణపు భూముల తరువాత ఏర్పడిన కాలువ పెద్ద కాలువ.దానికింద ఎక్కువ ఆయకట్టు ఉండేది.పెద్ద కాలువ వెడల్పు ఎక్కువ ఉండి నీరు ఎక్కువగా ప్రవహించేది.ఇవే ఊరి వారందరి స్నాన పానాదులకు ఆశ్రయా లు.ఏ కొద్ది మందో తప్ప దాదాపు ఊరి జనం పొద్దున లేస్తూనే కాలువకు వెళ్లి బట్టలుతుక్కుని స్నానం చేసి బిందెలు మంచినీళ్లు తీసుకుని రావటం పరిపాటి.ఈ పొలాలకు నీరు పైనుంచి రావాలి. వల్లపుభూములకు నీరు పారించాలంటే నీరు ఎత్తు ప్రదేశం నుండి రావాలి.అప్పట్లో పంపులు లేవు గనుక సహజ సిద్ధమైన “నీరు పల్లమెరుగు” (Gravitation method) పద్ధతిలో నీళ్లందించటమే.కనుక మన ఊరి పొలాలకు నీరు కోసం మానేరు ఎగువ భాగం నుండి కాలువ తీసు కుంటూ రావాలి. ‘ఎవరో వస్తారు ఏదో చేస్తారు’అనే ఆలోచన లేని రోజులుమన పని మనం చేసుకోవాలి. మన కాలువ మనమే తవ్వుకోవాలి.మన సౌకర్యం మనమే ఏర్పరచుకోవాలనే పిచ్చికాలం. నాయకుల ప్రమేయం లేని ప్రజలుతమ రెక్కల మీద తాము ఆధారపడి సుఖంగా జీవించిన వెర్రి కాలం. ఏడాది కొక్క సారి రైతులంతా పూడుకు పోయిన కాలువల పూడిక తీయడానికి తీర్మానించుకునేదే కాలువ పంచాయితీ.దానికి పంచాయితీ ఎందుకు అంటారా? ఎవరికెన్నెకరాల పొలం ఉంటే,ఒక ఎకరానికి పూడిక తీయడానికిఎంత మంది అవసరమో తేల్చి చెప్పడానికి ఈ కాలువ పంచాయితీ. జమాబందీ వాళ్లు చెప్పిన ప్రకారం పట్టాదారులు,కౌలుదారులు అంత వాగతీసే కూలీలను నియమించడం వారికి తగిన బత్తెము చెల్లించడం జరిగేది.’జల్సా ‘అనే పదం అప్పుడే విన్నాను.కాలువ పూడిక తీయటం అంతా ముగిసిన తరువాతచివరి రోజు కూలీలంతా జల్సా చేసుకునే వారని.ఆ రోజు గౌండ్ల వాళ్ల గల్లాపెట్టెలు నిండు గర్భిణులయ్యేవి.గ్రామ స్వరాజ్యం కావాలని అన్న వాళ్లు అలా చక్కగా నడిచే ఊళ్లనునాగరిక యంత్రలోకంలోకి నడిపించి ఇప్పుడు జీవితాలు యాంత్రిక మయ్యాయనుకుంటే ఏం లాభం? ఇంకొక్క విషయం కూడా ఇక్కడే చెబితే సబబుగా ఉంటుంది.అది యాస్వాడ గురించి. ఎలాగూ మనందరి మనోనేత్రాలలో ఊరికి పూర్తిగా దక్షిణంలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే వాగూ, దానికి ఊరువైపున్న ఉత్తరపు ఒడ్డు నానుకుని పారే ఊరగాల్వా,ఆ తరు వాతన్నీ పొలాలు పొలాల కిటు ఊరి వైపున్న పెద్ద కాలువా కనిపిస్తున్నాయి కదా! యాస్వాడ ఇప్పుడు బహుధాన్యపురంగా చెప్పబడే ప్రాంతానికి మానే రుకవతలి ఒడ్డున ఉన్న ఊరు.బాపు చెప్పిన విషయమేమిటంటే ఊరగాల్వ, యాస్వాడ,ఎల్లమ్మ గుడి,ఆవు పేట ఇవి నాలుగు బహుధాన్యపురానికి మిగిలిన ఆనవాళ్లు అని.యాస్వాడ ఒకప్పుడు బహుధాన్య పురంలో యాసగా(వంకరగా)ఉన్న వాడ అనీ,ఊరు అటు కొంత ఇటు కొంత ఉండేది. యాస్వాడకు పోవాలంటే ఊరి తూర్పు గైని దాటి నాగుల కుంట దాటి ఎడమవైపు తిరిగితే వచ్చే మాదిగల ఇండ్లు దాటి మానేరు దాటగానే ఉండేది.రోజూ చాలామంది విద్యార్థులు నడిచి వచ్చేవారు.అక్కడినుంచి రోజూ నడిచి వచ్చి చదువుకున డాక్టర్లన వారున్నారు.పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారున్నారు.అలాంటి వారిలో ప్రముఖు డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. గతంలో ప్రసిద్ధ సామాజికవేత్తగా,విశిష్ట జర్నలిస్ట్ గా ఖ్యాతి గడించిన వారు.ఆయన ఎలగందుల పెద్దబడి విద్యార్థి కావటం ఎంతైనా గర్వకారణం. ఇలాంటి మణిపూసలు ఈ ఊర్లో ఎన్ని ఉన్నాయో రేపు తెలుసుకుందాం.- రామ్మోహనరావు తుమ్మూరి


కామెంట్‌లు