మానేరు ముచ్చట్లు---నాకు బాగా చిన్న వయసున్నప్పుడు ఇంట్లో వడ్లు దంచటం చూసిన గుర్తు.పొలంలో వడ్లు పండేవి.వాటిని 1500 లీటర్ల ఓవర్ హెడ్ వాటర్ టాంక్ సైజులో ఉన్న కంక (వెదురు) గుమ్ముల్లో నింపి పెట్టడం సర్వ సాధారణం అప్పట్లో.గుమ్ములు పెట్టడానికి ప్రత్యేక స్థలాలుం డేవి ప్రతి ఇంట్లో.ఇంకా కొందరి ఇళ్లల్లో కొట్టెలు చూశాను.కొట్టె అంటే మనిషెత్తు రంజన్.చాలా దృఢంగా ఉండేవి.మా ఇంట్లో లేకుండేవి కాని వుడుతల వాళ్లింట్లో కొట్టెలు చూశాను.గుమ్ముల్లాగే రొట్టెలు కూడా ధాన్యాల నిలువకు ఉపయోగించేవారు.అటు వరికోతలు మొదలయ్యాయంటే గుమ్ములను వాకిట్లోకి తెచ్చి బాగా దులిపి గట్టి పెంటతో పూతపూసేవారు.వెదురు బద్దల మధ్య నుండి వడ్లు కారి పోకుండా.వడ్లు దంచేవాళ్లు ఇద్దరు ముగ్గురు వచ్చి గుమ్మిలోనుండి తూమెడు వడ్లు (ఎనిమిది కుంచాలు) బయటకు తీసి కంక జల్లెడతో జల్లెడ పట్టి,చేటలతో చెరిగి చెత్తా చెదారం లేకుండా,రాళ్లూ మట్టి గడ్డలూ లేకుండా శుభ్రంచేసి కుందెననో,కుదురో పెట్టి నిలువెత్తు పొన్ను రోకళ్లతో ఇద్దరు హుష్ హుష్ అంటూ ఎగపోస్తూ దంచేవారు.మరో ఇద్దరో ఒకరో దంచిన వాటిని చెరిగి నూకలు జల్లెడ పట్టి కాగితపు గుజ్జుమెంతులు నానబెట్టి రుబ్బి తయారు చేసిన ముద్దతో పూసిన గంపల్లో ఎత్తే వారు.ప్రతి ఇంటిలో జల్లెళ్లు చేటలు,అంచెలు, గుల్లలు,గంపలు,దుమ్ములు మొదలైన కంక సామానుండేది. ఇంకా వ్యవసాయకుటుంబాల వారికి పొనకలుండేవి.ఊరందరికీ అవసరమైన ఈ వస్తువులు తయారు చేయడానికి మేదర వాళ్లుండేవాళ్లు.అలా వారికి జీవనోపాధి లభించేది.హాషం సారు గురించి చెప్పుతానని గివన్ని ముచ్చట్లు ఎందుకు అంటరని తెలుసు.హాషం సారు గుర్తుకు రాంగనే గిర్నీ గుర్తుకు వచ్చింది.గిర్నీ గుర్తుకు రాంగనే గిర్నీ లేకముందు వడ్లు ఇంట్లనేదంచుడు గుర్తుకు వచ్చింది.అది కూడా చూసిన వాణ్ని గనుక ఆ రెండు ముచ్చట్లు జెప్పి అసలు విషయానికి వద్దామని. మా ఇంటి నుంచి పెద్ద బజారుకు పొయ్యే తొవ్వల హాషం సారు ఇల్లు పక్కనేగిర్నీ ఉన్నది.కాళిదాసనే విశ్వబ్రాహ్మణా యన ,ఆయన తమ్ముడు నరసింహ మూర్తి దాన్ని నడిపించే వాళ్లు.జనం వాడుకల కాళిదాసు గిర్నీ అని వాడుక. గిర్నీ బాగా ఎత్తుమీద ఉన్న ఇల్లు.ఐదారు మెట్లెక్కి పోవాలి.బదారు వైపు మనిషెత్తుకంటే పైన వీధి అరుగుండేది. అది వెనుకటి కాలంలో ఏ దఫ్తర్ ఖానానో అయ్యుంటది.ఆ ఇల్లు కూడా హాషం సారు వాళ్లదే. ఇల్లు కిరాయకు తీసుకుని కాళిదాసు సోదరులు గిర్నీ నడిపే వాళ్లు.అందులో వడ్ల గిర్నీ ఒక పక్కకు,పిండి గిర్నీ ఒక పక్కకు ఉండేవి.గిర్నీలు వచ్చిన తరువాత ఇండ్లల్ల వడ్లు దంచుడు బందయింది.దంచే టోళ్లు వచ్చి వడ్లు శుభ్రంచేసి గంపల్లో వడ్లు గిర్నీకి తీసుకు పోయి పట్టించుకోని వచ్చే వాళ్లం.వాళ్లతో పాటు ఎవరో ఒకర ఇంటి వాళ్లం వెళ్లే వాళ్లం.ఎక్కువ సార్లు ఆ డ్యూటీ నాకే పడేది.ఎప్పుడైనా నేను పోనంటే మా తాత అనేవాడు ‘మంటికైనా ఇంటివాడు పోవాలి అని’ హాషం సారు ఊళ్లో ఉన్నప్పుడు గిర్నీలు రాలేదు ఊళ్లోకి.ఆయన టీచరుగా సిరిసిల్ల దగ్గర ఏదో ఊరికి వెళ్లటంతో ఆ ఎత్తుగద్దెల ఇల్లు కిరాయకు ఇచ్చారు. దాని ప్రక్కనే ఉన్న ఇంకో ఇల్లు కూడా ఎవరికో ఇచ్చారనుకుంటా.దానికి ప్రక్కనే నిన్న జెప్పిన శాంతమ్మ హోటల్.కాళిదాసు గిర్నీ ఎదురుగా బ్రహ్మయ్య సారు ఇల్లు.బ్రహ్మయ్య సారు బాపు శిష్యుడు. లక్ష్మిరాజం సారుకు ప్రియమిత్రుడు. అప్పటి వాళ్లు చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు.దాదాపు అప్పటి సార్లందరూ మంచి ఉపాధ్యాయులుగాపేరు తెచ్చుకున్నారు.నాకు హాషం సారు గురించి ఎక్కువగా తెలియదు.బాపు కంటే పదేళ్లు పెద్దహాషం సారు.అయితే మా కంటే సీని యరు విద్యార్థులకు హాషం సారు బాగా తెలుసు.మత్తం మల్లయ్య సారుగురించి రాసినప్పుడే నాగరాజు రామస్వామి గారు హాషం సారు ప్రస్తావన తెచ్చారు. వాళ్ల తరానికి హాషం సారు బలమైన ముద్ర వేసిన వ్యక్తి.అనేకమంది విద్యార్థులను చదువు వైపుకు మళ్లించి ప్రేమతో చదు వు నేర్పిన వ్యక్తి. అయితే నేను హాషం సారు పేరు విన్నాను ఒకటి రెండు సార్లు బాపుతో ఉన్నప్పుడు హాషం సారును చూశాను.సెలవుల సమయం లో వచ్చే వారనుకుంటా.సరే ఏమీ తెలియకుండ ఎలా రాయాలి అనుకుని ఎంక్వయిరీ మొదలు పెడితే హాషం సారు రెండవ అబ్బాయి లెక్చరరు కావడంతో తమ్ము ళ్లిద్దరికీ పరిచయం.తమ్ముడు నంబరిస్తే మజారుద్దీన్ సాబ్ కు ఫోన్ చేశాను. అతడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడి నాకు ఆనందం కలిగించాడు. ఆయన ప్రస్తుతం ప్రిన్సిపాలుగా రిటైరయిన తరువాత హైదరాబాదులోప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడట.విషయంచెప్పాను.వాలీసాబ్ ఫోటో కావాలి అలాగే వివరాలు కావాలి అని.నేను ఎలగందుల గురించి రాస్తున్నందుకు అతను కూడా చాలా సంతోషించి పంపిస్తానని చెప్పి మొన్న పంపించారుహాషం సారు వాళ్ల తండ్రి పేరు మహ్మదలీ సాహెబ్.అప్పుడంతా ఉర్దూ మీడియమే గనుక అందరూ ఉర్దూ మీడియంలో ఆరో ఏడో తరగతుల వరకు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేవి.మా బాపు,నిమ్మల రాజయ్య సారు,దొగ్గలి నర్సింగం సారు వీళ్లంతా కరీంనగర్ నడచి వెళ్లి ఉర్దూ మీడియంలో ఎనిమిదివరకు చదివి పంతుళ్లయ్యారు.మిడిల్ ట్రెయిన్డ్ టీచర్లనే వాళ్లు. హాషం సారు బాపు కంటే చాలా పెద్ద. మత్తం మల్లయ్యసారు కంటే గూడా రెండు మూడేండ్లు పెద్ద.కాని ఆయనలో విద్యాదానగుణంచాలా ఉండటంతో పల్లెటూళ్లలో చదువంటే విముఖత బాగా ఉన్నసమయంలో హాషం సారు బాగా శ్రమపడి ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ విద్యాభివృద్ధికి కృషి చేశారు. అందుకేఅశీతి చేరుకున్న నాగరాజు రామస్వామి లాంటి వారి హృదయాల్లో ఇంకా నిలచి యున్నారు. హాషం సారు 1972 లో రిటైరయ్యే దాకా కరీంనగర్ జిల్లాలో పది పన్నెండు ఊళ్లల్లో పని చేశారట.ఎక్కడికి వెళ్లినా స్థానిక పరిస్థితులను గమనించి ,ఊరి పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కావలసిన వసతులు సమకూర్చునే గాక ప్రభుత్వమునుండి కూడా అనేక నిధులు సద్వినియోగ పరచేవారు.అవినీతికి ఎక్కడా తావిచ్చే మనిషి కాదు గనుక అధికారులలో కూడా మంచి పేరుండేది.బడికి రాని పిల్లల కోసం ఇల్లిల్ల తిరిగి విద్యార్థులను కూడగట్టేవారు.తోటి ఉపాధ్యాయులతో ఎంతో స్నేహభావంతో ఉండి వారందరకీఆదర్శప్రాయంగా ఉండేవారట.ఆయన ముగ్గురు కుమారులు కూడా తండ్రి అడుగు జాడల్లో నడవటం ఆయన వారికి నేర్పిన సంస్కారం.ఆయన శతజయంతి దాటి నాలుగేళ్లయినా ఆయనను తలచుకోగలుగు తున్నామంటే ఆయన గొప్పతనం గురించి చెప్పనవసరమ లేదు.- రామ్మోహన్ రావు తుమ్మూరి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి