ఈ లేఖలతో తెలిసే చలం!--ఉత్తరాలు రాయడంలో చలంగారి తర్వాతే ఎవరైనా అని నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు తిరువణ్ణామలై చలంగారినే తెలుసు. ఆంధ్రదేశపు చలం గురించి పుస్తకాలవల్లే తెలుసు. ఎంతమంది వచ్చినా నవ్వుతూ ఆహ్వానించే చలంగారినే నేను చూశాను. ఆయన తిరువణ్ణామలై చేరడంలో ముఖ్యకారకులు చింతా దీక్షితులుగారేనని అందరికీ తెలిసిందే. చింతావారి మాటగానే ఆయన 1936 ప్రాంతంలో మొదటిసారిగా తిరువణ్ణామలై వెళ్ళారు. అయితే ఆంధ్రదేశాన్ని పూర్తిగా విడిచిపెట్టి అరుణాచలం చేరి అక్కడే స్థిరపడి తనువు చాలించింది ఇక్కడే.చలంగారు తనకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికీ తిరుగు ఉత్తరం రాసేవారు. రాసిన వ్యక్తి చిన్నవారా పెద్దవారా గొప్పవారా పేదవారా ఇలాటి తేడాల్లేకుండా తానందుకున్న ఉత్తరానికి తప్పని సరిగా ప్రత్యుత్తరం రాసేవారు. అయితే ఆయన అందరికీ రాసిన ఉత్తరాలు వేరు. చింతా దీక్షితులుగారికి రాసిన ఉత్తరాలు వేరు. చలంగారు తమకు రాసిన ప్రతి ఉత్తరాన్నీ దీక్షితులు భద్రపరచడం, ఇంగ్లీషులో రాసిన ఉత్తరాలన్నింటినీ చలంగారు తెప్పించుకుని తెలుగులో ఓపికగా రాయడం విశేషం. ఈ ఉత్తరాలకు 1944 జనవరి ఒకటో తేదీన ముందుమాట తీరులో కొన్ని మాటలు రాశారు. అవి ఇవే....."దీక్షితులుగారు ఈ ఉత్తరాలు దాచారు. ఆయన శ్రమ ఎవరికో ఒకరికన్న ఉపకరిస్తుందని ఆశ - ఈనాడు.ఈ వుత్తరాలన్నీ ఇంగ్లీషులో రాసినవి. చాతకాని చోట్ల తప్ప తక్కినదంతా తెలుగు చేశాను. ఇతరులని గాయపరుస్తాయన్నవీ, అధికార్లని పేరు వరసలుగా తిట్టిన తిట్లూ, రెండు మూడు బూతులు తప్ప తక్కిన విషయమంతా ఉన్నది ఉన్నట్లు తెలిగించాను. ఏమీ interest ఇంటరెస్ట్ ఇయ్యవన్న కొన్ని సంగతులు వొదిలేశాను.ఆయన నాకు రాసిన ఉత్తరాలు దాచని, నా నిర్లక్ష్యం, నా అంధత్వం, అల్పత్వం - క్షమించ తగినవి కావు.ఈ వుత్తరాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా నాటివి. ఈ నాటికి చాలళవిషయాల్లో నా అభిప్రాయాలు మార్పు చెందాయి. చెందుతున్నాయి" రావూరి వెంకటేశ్వరరావు (కాంట్రాక్టరు, పాల్వంచ) గారి ఆర్థిక సహాయంతో దీక్షితులకు రాసిన చలం ఉత్తరాలు అచ్చయ్యాయి. 1927 జూలై 4 వ తేదీతో మొదలై 1954 మే 31 వ తేదీ వరకూ రాసిన ఉత్తరాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 227 ఉత్తరాల మాలను గుడిపాటి వెంకట చలం శత జయంతి సంఘం (హైదరాబాదు) వారు1995 ఆగస్టులో ప్రచురించారు. అప్పట్లో దీని ధర 35 రూపాయలు. ఇప్పుడీ పుస్తకం అందుబాటులో లేవనే తెలిసింది. ప్రేమికుల మధ్య అసలు పేరుతో సంబోధించక ముద్దు పేర్లతో ఉత్తరం మొదలెట్టడం సర్వసహజం. అయితే చలంగారు దీక్షితులుగారిని సంబోధించిన పేర్లు విచిత్రంగా అనిపిస్తాయి. చలంగారి సంబోధనలలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాను. కంపానియన్ ఆఫ్ మై లంగ్స్ అండ్ హార్ట్‌, మై డియర్ పెన్డులం pendulum, ఆపిల్ డియర్ మై ఐ, ఆర్ ఆరేంజ్ ఆఫ్ మై ఇయర్‌ ఆర్ పంపరపనస ఆఫ్ మై నోస్, డియర్ పేపర్ మేకర్, డియర్ హెడ్ ఆఫ్ మఫ్స్, డియర్ లెటర్ హెడ్, మైడియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్, డియర్ కరెక్టర్, డియర్ డిప్రెస్డ్ డాడ్‌, డియర్ కో - రెస్పాన్సిబిల్ ఆఫీసర్ ఇలా రకరకాలుగా దీక్షితులవారిని సంబోధిస్తూ చలంగారి ఉత్తరాలు సాగాయి. అలాగే చలంగారు రాసిన ఉత్తరాలలో కొన్ని మాటలు....చాలా బాధ పడ్డాను. ఇంకా బాధ పడుతున్నాను. ఏదీ తృప్తి పరచదు. ఏదీ నాకు సంతోషాన్నివ్వదు. నెప్పి. నెప్పి నెప్పి. శరీరంలో హృదయంలో.సౌరిస్ కి వొచ్చిన కల రాశాను కదా. లీలగారి కళ్ళల్లో నన్ను చూస్తే తప్ప యీ బాధ యీ శ్రమ తగాదా వృధా అని భగవాన్ నన్ను అన్నట్టు.మళ్ళీ దగ్గరికి వెళ్ళాను. కాని తిరిగి వొచ్చింతర్వాత కూడా ఇదివరకటి స్థితిలోనే వున్నాను.ఏం చెయ్యాలో తెలీటం లేదు. ఇట్లా నన్ను ఉపేక్ష చెయ్యడంలో భగవాన్ కి ఏదో వుద్దేశ్యం వుందని నమ్మడానికి ప్రయత్నిస్తాను. నేను నిస్సహాయుణ్ణి. ఇది ఏదీ ఏదీ కూడా నాకు శాంతినివ్వలేవు. ( 1946 ఫిబ్రవరి 1 న రాసిన ఉత్తరంలోని కొన్ని మాటలవి).నిన్న రాత్రి భగవాన్ కలలో కనపడ్డారు. మీరూ నేనూ ఇంకోరు ఎవరో భగవాన్ తో వున్నాం. ఆశ్రమం ఖాళీగా ఉంది. భగవాన్ దిళ్ళు కూడా మాయమౌతున్నాయి. నేనన్నాను. భూమిమీద భగవాన్ చెయ్యవచ్చినపని ముగుస్తోంది. ఎవరికి ఏమి చెయ్యాలో ఆయన దాన్ని చేసి ముగించారు. ఆయన వెళ్ళిపోవాలి. మనం మాత్రమే మిగిలాము. 'Let us hasten' లెటజ్ హాసెన్ అన్నాను. అని నేను ఒక వార్తాపత్రికలాగు మడత పడుతున్నాను. నిజంగా ఒక కాయితమై పోయి, ఆయన చేతుల్లోకి నన్ను నేను ఇచ్చేసుకున్నాను. ( 1947 జనవరి 8న ఏలూరు నుంచి మై డియర్ లిటిల్ డూ వెల్ అని సంబోధిస్తూ రాసిన ఉత్తరంలోని మాటలవి).వావిలాల సుబ్బారావుగారన్నారీ పుస్తకం పీఠికలో... "రమణ మహర్షి చలం జీవితంలో ప్రవేశించే వరకు చలంగారిలోని సంక్షోభానికి ఊరట ఆదరం లభించింది దీక్షితులుగారి చలువ పందిట్లోనే. కల్లోల చలంగారికి ఆదరాన్నే గాని సమాధానం ఇవ్వలేని దీక్షితులుగారు భగవాన్ని చూపించి పక్కకు తప్పుకున్నారు. అదీ చలంగారి జీవితంలో దీక్షితులుగారి పాత్ర" అని రాశారు. చలంగారి జీవితంలో పెనుమార్పు తీసుకొచ్చింది తిరువణ్ణామలై పర్యటన, భగవాన్ రమణ మహర్షి దర్శనం. ఈ మార్పులను తెలుసుకోవాలంటే దీక్షితులుగారికి రాసిన ఈ పుస్తకాన్ని చదివితే చాలు. ఆయన గురించి ఎవరెవరో ఏవేవో అన్న మాటలకు ఈ ఉత్తరాలను ఓ జవాబుగా చెప్పుకోవచ్చని నా అభిప్రాయం.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం