బాల్యజ్ఞాపకాలు@కోనసీమ: --సత్యవోలు పార్థసారధి : --1963 నుంచి 66 ప్రాంతాల్లో మేము కోనసీమలో ని ముమ్మిడివరం, కపీలేశ్వరపురం, రాజోలు లో ఉండే వాళ్ళం. నాన్నగారు అక్కడ BDO తర్వాత తహశీల్దార్ గా పనిచేసేవారు.అప్పట్లో ఆ కోనసీమ నిండా జట్కా బళ్లు ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా అవే. గూడు లోపల చక్కగా గడ్డి వేసి దాని మీద ఒక దుప్పటి పరిచి ఉండేది. నలుగురు ఎక్కితే కొంచెం పైకి రండి, కొంచెం వెనక్కి జరగండి అంటూ మనుషుల ఆకారాలని బట్టి బండి బాలన్సు చేసేవాడు జట్కా అబ్బాయి. గూడు కింద ఒక చిక్కం ఉండేది. అందులో గుర్రం కోసం పచ్చగడ్డి ఉండేది. మన బాగ్ లు పెట్టెలు అందులోనే పెట్టేవాళ్ళం.అందరూ ఎక్కాక, బాలన్స్ అయ్యాక కింద నుంచి లాఘవంగా ఒక్క ఉదుటన గూడు ముందటికి జంప్ చేసి ఇంచుమించుగా గుర్రం మీదే కూచున్నట్లు గా ఉండే రెండు పొడుగు కర్రల మీద కూచుని కళ్లెం పట్టుకునేవాడు ఆ అబ్బాయి.గుర్రం కళ్ళకి గంతలు, కాళ్ళకి మువ్వలు కట్టేవాడు. నెత్తికి రంగుల ఈకలు పింఛమ్ లాగ పెట్టేవాడు. తోలేవాడి పక్కన కూచుని ప్రయాణం చేయాలని సరదాగా ఉండేది గానీ ఆ హయ విసర్జితాల వాసన భరించడం కష్టమని అప్పుడప్పుడు అనిపించేది.బండి రోడ్ మీద నడుస్తుంటే ఎవరూ అడ్డం రాకుండా చెర్ణకోలా కర్ర , నడిచే చక్రానికి తగిలిస్తే వచ్చే శబ్దమే దాని హారన్. పాపం లాగలేక ఎప్పుడైనా నెమ్మదిస్తే చేతిలో ఉన్న కర్రకు చిన్నగా పని చెప్పగానే, మళ్లీ వేగం అందుకునేది. భయపెట్టడం కోసం చెర్ణకోలా చివర తోలు ముక్క ఉన్న తాడుతో బండి రేకు గూడు మీదకి " చెళ్లు" మనే శబ్దం వచ్చేటట్లు కొట్టేవాడు. ఆ శబ్దానికే పాపం గుర్రం జడుసుకుని నెక్స్ట్ నన్నే కొడతాడేమో అని భయపడుతుందో ఏమో, గేలాప్ తీసేది. నోటితో చిత్ర విచిత్ర శబ్దాలు కూడా చేసేవాడు నడుపుతూ. ఆ కోడ్ భాష వాళ్ళిద్దరికే తెలిసిఉండేది. తోక మెలిపెడుతూ కూడా ఉండేవాడు అప్పుడప్పుడు. రాను పోను బేరంతో రాజోలు పక్కన శివకోడు అనే ఊళ్లో ఉన్న గుడికి వెళ్ళేవాళ్ళం ఆ జట్కా బండి మీద. గుడి దగ్గిర మమ్మల్ని దించి, గుర్రాన్ని బండి నించి విప్పి చిక్కం లోఉన్న ఇంత గడ్డి తీసి దాని ముందర వేస్తే మళ్లీ మేము దర్శనం చేసుకుని వచ్చేవరకు నములుతూ ఉండేది.గుర్రబ్బండి నడపాలని తెగ కోరికగా ఉండేది అప్పట్లో. అప్పుడప్పుడు ఆ గుర్రపు కళ్లెం చేతికి ఇచ్చేవాడు ఆ అబ్బాయి. ఆప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో ఆ పసి ప్రాయంలో. ఏదైనా స్తంభం చుట్టూ తాడు వేసి దానినే గుర్రం కళ్ళెం ల భావించి,చేతిలో కర్ర పట్టుకుని స్తంభాన్ని కొడుతూ "చల్ చల్ గుర్రం" ఆట ఆడుకోవడం అప్పట్లో ప్రతీ కుర్రాడికి ఇష్టమైన ఆట. ఆ రోజుల్లోనే గొంటువానిపాలెం అనే మా రెండవ బావగారి ఊరు వెళ్ళేటప్పుడు ఎడ్ల బండి ఎక్కేవాళ్ళం. ఏలేశ్వరం దాటి అడ్డతీగల వెళ్ళేదారిలో హైవే మీదనుంచి రెండు మూడు కి.మీ లోపలికి ఉండేది ఆ ఊరు. ముందర ఉత్తరాల ద్వారా సమాచార అందుకుని, ఆ బస్ వచ్చే టైంకి ఆ అడ్డరోడ్డు దగ్గిరకి రెండెడ్ల బండిన పంపించేవారు.బస్ దిగి ఆ బండి ఎక్కేవాళ్ళం. ఇది కూడా గుర్రబ్బండి లాగే ఉండేది గానీ ఇంకొంచెం విశాలంగా, సొంత బండి గనక గడ్డి మీద దూది పరుపులు కూడా ఉండేవి. ఎడ్లు నింపాదిగా నెమరువేసుకుంటూ, మెళ్ళో గంటలు తో సవ్వడి చేసుకుంటూ తాపీగా వెళ్ళేవి. రోడ్ కూడా కచ్చా రోడ్ కనక ఆ కుదుపులకి, గుంటలకి పరుపులున్నా సరే, వళ్ళు కొంచెం హూనం అయ్యేది. గుర్రబ్బండే బాగుంది స్పీడ్ గా పోయేది అనుకునేవాడిని బండి దిగాక.ఇక కోనసీమ నుంచి కాకినాడ రావాలంటే అప్పట్లో గోదావరి దాటడం ఒకటే మార్గం. రావులపాలెం వంతెన అప్పటికి ఇంకా కట్టలేదు. ఇటు ఇద్దరిలో ముక్తేశ్వరం రేవు దగ్గిర పడవ ఎక్కి అద్దరిలో కోటిపల్లిరేవు దగ్గిర దిగి కాకినాడ బస్ ఎక్కాల్సివచ్చేది. కోటిపల్లి గోదావరి ఒడ్డునే పెద్ద రావిచెట్టు, దానిచుట్టు కూచోడానికి పెద్ద చప్టా ఉండేది. పడవ మీద రేవు దాటాలంటే అర్ధో,రూపాయో టికెట్ ఉండేది.మూగమనసులు సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది అని పడవ వాళ్లు చెప్పేవారు.పొడుగ్గా ఉండే పడవ లో ఇంచుమించుగా అరడజను అడ్డంగా ఉండే చెక్కల మీద కూచునేవాళ్ళం. కొంతమంది పడవలో కింద కూచునే వారు. మేకలు,పచ్చగడ్డి మోపులు, బియ్యం బస్తాలు కూడా మాతో బాటే గోదావరి దాటేవి. ఎలా వచ్చేవో తెలీదు గానీ కొద్దిపాటి నీళ్లు పడవ లో అటూ ఇటూ కదులుతూ, చల్లగా కాళ్ళని తాకుతూ ఉండేవి.రేవులో పడవలోకి చెక్క బల్లలు మీదనుంచి ఎక్కడం, దిగడం జరిగేది.మాలాంటి పిల్లల్ని పడవవాడే ఎత్తుకుని ఎక్కించేవాడు. వెనక చుక్కాని దగ్గిర ఒకడు, ఇంకొడు లావుగా ఉండే పొడువాటి పెద్ద కర్ర పట్టుకుని నీళ్ళల్లోని మట్టిలోకి నొక్కి పెట్టి పడవ మీద బారుగా నడుస్తూ పడవని తోస్తూ ఉండేవాడు. నది లోకి రాగానే ఇక తోయడం ఆపి గాలి వాలు బట్టి తెరచాప విప్పి కట్టి ఇద్దరూ చుక్కాని దగ్గిర చేరి అందరితో కబుర్లు చెబుతూ ఉండేవారు. అందరూ తెలిసున్న మొహాలే , రోజూ అటూ ఇటూ తిరిగేవాళ్లే గదా! అతుకులతో అక్కడక్కడ రంగు గుడ్డ ముక్కలతో చాలా అందంగా ఉండేవి ఆ తెరచాపల పడవలు.అడ్డ బల్లల మీద కూచుని చేయి నీళ్ళల్లోకి ముంచి చల్లటి గోదావరి నీళ్లతో ఆడుకోవడం భలే చక్కని జ్ఞాపకం. కర్రతో బారుగా నడుస్తూ వచ్చేవాడు రాగానే ఎక్కడ మన చేయి తొక్కేస్తాడో అని భయపడి చేయి అడ్డుతీసేసి, వాడు వెళ్ళగానే మళ్లీ నీళ్లతో ఆటలు.పెద్దవాళ్ళు బుద్ధిగానే, కూచుంటే, మాలాంటి పిల్లగాళ్ళం ఆనందాశ్చర్యాలతో తల తిప్పుతూ పడవ నడిపే విధానం చూస్తూ ఉండేవాళ్ళం. బలంగా కండలు తిరిగిన పడవ నడిపేవాడిని చూసి వీడికి ఎంత బలమో ఒంటి చేత్తో పడవని నడిపించేస్తున్నాడు అని తెగ అబ్బురపడేవాడిని.గోదావరి అలలు పడవని ఢీకొట్టి నప్పుడల్లా వచ్చే "బొళక్ బొళక్" మనే శబ్దం ఇప్పటికీ చెవిలో వినబడుతోంది. చిన్న చిన్న చేపలు నీళ్ళల్లోంచి పైకి గెంతి మళ్లీ ములుగుతూ కనపడేవి అప్పుడప్పుడు. నది మధ్యలోకి రాగానే అమ్మ ఇచ్చే పైసలు నదిలోకి విసిరి భక్తితో దండం పెట్టుకునేవాళ్ళం. ఆమ్మ కాగితం పొట్లం విప్పి అందులోని పసుపు, కుంకుమ, కొన్ని పూలు నీళ్ళల్లోకి నెమ్మదిగా విడిచి, అవి అలలమీద తేలుతూ పడవనుంచి దూరంగా వెళుతుంటే దండం పెట్టేది. ఇప్పుడు రోడ్ మీద బస్ ల్లాగ గోదావరి లో ప్రయాణీకుల పడవలు ఇటు అటు వెళ్ళేవి. గూడు పడవుల్లో కొబ్బరికాయలు, ధాన్యం బస్తాలు, లంకల్లో పండిన వాణిజ్య పంటలు రవాణా అయ్యేవి.కోనసీమలో ఎక్కడ చూసినా కాలవలే ఉండేవి. గోదారి ఒడ్డునే పెద్ద కాలవ ఉండేది. అందులో కూడా పడవలు నడిచేవి. వీటిలో ఎక్కువగా సరుకుల రవాణా జరిగేది. బలమైన మోకులు వీటికి కట్టి కాలవ ఒడ్డున ఆ పడవని మనుషులు నడుస్తూ లాగుతూ ఉండేవారు.ఇలాంటి కాలువలకు ఒక పక్క ఒక మోస్తరు ఊరు, రోడ్డు ఉంటే, అటుపక్క చిన్న చిన్న ఊళ్ళు ఉండేవి. ఇటునుంచి అటు, అటునుంచి ఇటు రావాలంటే అటూ ఇటూ కాలవలోకి మెట్లు, కాలవ దాటడానికి బల్లకట్టు అనే చిన్న చిన్న చతురస్రాకార పడవ లాంటివి ఉండేవి బల్లపరుపుగా.రెండు పక్కల ఓపెనింగ్,ఇంకో రెండుపక్కల పట్టుకోడానికి రైలింగ్ లా ఉండేది. ఒక మనిషి బలమైన కర్రతో నీటిలో తోస్తూ అటూ ఇటూ మనుషుల్ని దాటిస్తూ ఉండేవాడు.మా కాకినాడ- సామర్లకోట కాలువలో 80 ల వరకు కూడా దీని వాడకం చూసేను. తరవాత కాలవ మీద చిన్న చిన్న వంతెనలు కట్టాక బల్లకట్టులు కనుమరుగు అయ్యాయి. ఇప్పటికి కోనసీమలో ఇవి అక్కడక్కడ కనపడతాయిజీప్, కారు లాంటివి నది దాటించాలంటే రెండు పడవలు పక్కపక్కనే కట్టి వాటిమీదకి వాహనాన్ని ఎక్కించి దాటించేవారు. ఎండాకాలం నది ఎండిపోతే కొంచెం దూరం ఇసుకలో నడిచి పడవ ఎక్కడం, దిగడం చేసేవాళ్ళం. కాళ్ళు కాలకుండా నడవడానికి ఇసుక మీద ఈత చాపలు, కొబ్బరి చాపలు లాంటివి రేవు దాకా పరిచేవారు.ఎండాకాలం లో లంకల్లో పుష్కలంగా పండిన పుచ్చకాయలు కొనుక్కుని, ముక్కలు తింటూ చేసే పడవ ప్రయాణం ఎంత బాగుండేదో?ఇదండీ కొనసీమతో ముడిపడ్డ నా జ్ఞాపకాల సమాహారం.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి