నాన్నకు లేఖ--ప్రియమైన నాన్నకు, మీకు నేను చాలా ఉత్తరాలు రాసాను. చాలావరకూ "ప్రియమైన" అని మొదలుపెట్టి "ఇట్లు" అని ముగిసే అతి చిన్న ఉత్తరాలు.మొదటిసారిగా నా మనసు లోతుల్లోంచి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. దీనిని నేను మీరు బతికున్న రోజుల్లోనే రాసి ఉండవలసింది. అది చదివి ఓ నవ్వో ఓ చుక్క కన్నీరో జవాబుగా ఇచ్చి ఉంటారు కచ్చితంగా నవ్వే మీ సమాధానమై ఉంటుంది. ఏడ్చే మనిషి కాదు మీరు. ఇప్పుడు ఆలోచించి చూడగా మీరెప్పుడూ ఏడ్చి చూసిందే లేదు. ఐనా ఏ నాన్నలూ పిల్లల ముందు ఏడుస్తారు? నాన్నా,మీరు బతికున్న రోజుల్లో చాలాసార్లు మాట్లాడాలనుకుని, రాయాలనుకుని ఉండిపోయిన వాటినే ఈ ఉత్తరంలో రాస్తున్నాను. చిట్టచివరి ఆకు నేల రాలడానికి గాలి రావాలిగా? కాలం ఆకు ఎప్పుడూ ఆలస్యంగానే వీచేటట్లు....పిల్లలందరికీ నాన్నలే మొదటి కథానాయకుడు అంటారు. నాన్న అంటే మేధస్సు. ఎంతటి శక్తిమంతమైన మాట....మీరు చనిపోయిన పద్దెనిమిదో రోజు అటకమీద నుంచి మీ పాత ట్రంకు పెట్టె తీసి చూసినప్పుడు మీ డైరీలను చదివే అదృష్టం కలిగింది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు చదువుతారు అని తెలిసే రాసేవే డైరీలు.నేను 1975 జూలై 12 వ తేదీన పుట్టినప్పుడు ఏం రాశారో చూడాలనే ఆరాటంతో ముందుగా ఆ పేజీనే తొలుత చూశాను. ఒకే ఒక వాక్యం రాశారు. అది,*ఈరోజు ప్రపంచ రెండో మేధావి పుట్టాడు!" అని.కాకికి పిల్లకాకే ముద్దు అన్నట్లు నాన్నా మీ ఆత్మవిశ్వాసం ఎక్కువేనని అనిపించింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఎదుర్కొనే ఒక్కొక్క తరుణంలోనూ మీ ముఖం నుంచే నాకైన అనుభూతిని అప్పుగా తీసుకుంటున్నాను. ఇది రాస్తున్న ఈ క్షణంలోనూ ప్రపంచ మూడో మేధావి నా చేయి పట్టుకుని లాగి తనతో ఆడుకోవడానికి పిలుస్తున్నాడు. వాడికి మీ పేరే పెట్టాను. ఆ పేరున్నవాడే మనవడు.మీకు పుస్తకాలంటే ప్రాణం. తమిళ ఉపాధ్యాయుడిగా అతి స్వల్ప జీతం పొందుతూ ఇంటిని పుస్తకాలతో నింపేసారు. ఇప్పుడు ఆలోచిస్తున్నా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కాంచీపురం చుట్టూ ఉన్న ఇరవైకిపైగా ఉన్న గ్రంథాలయాలలో మీరు సభ్యులుగా ఉంటూ నన్నూ అక్కడికి తీసుకుపోతుండేవారు.మీరు తరచూ చెప్పే మాట..."నాకు తమిళం మాత్రమే తెలియడంవల్ల తమిళ పుస్తకాలు మాత్రమే కొన్నాను. అందువల్ల అప్పులతో మిగిలాను. ఇంగ్లుషుకూడా తెలిసుంటే మనమంతా నడిరోడ్డులో ఉండేవాళ్ళం.నేను మీగురించి ఓ కవిత రాశాను.మా నాన్నఓ బస్తాడు పుస్తకాలు దొరుకుతాయంటే నన్నూ అమ్మేసేవారు! అని.పుస్తకాలు చదువుతున్నప్పుడు మీకు నచ్చిన వాక్యాల కింద ఎర్ర సిరాతో గీతలు గీసేవారు. ఆ గీతలు చూస్తుంటే నాకు ఒళ్ళు మండేది. "మీ అభిప్రాయాలను నామీద రుద్దకండి. మీకు నచ్చిన వాక్యం నాకు నచ్చకపోవచ్చు. ఎందుకు వాక్యాలకింద ఆ గీతలు గీస్తున్నారు?" అని అడిగేవాడిని కోపంతో.మీరప్పుడు ప్రశాంత వదనంతో చెప్పేవారు "నువ్వనుకున్నట్లు కాదు. ఎక్కడో ఉన్న రచయిత రాసిన అక్షరాలు నాకు నచ్చి నేనిక్కడ నుంచి కరచాలనం చేస్తున్నాను" అని.మిమ్మల్ని పట్టుకున్న పుస్తకాల బేతాళుడు నన్నూ పట్టుకున్నాడు. ఇప్పుడు నా కొడుకునీ పట్టుకుని ఊపుతున్నాడు.భాష తెలియని ఈ మూడున్నరేళ్ళ వయసులో ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుని తనకు తెలిసిన ఏదో ఒక భాషలో చదివి కొత్తగా ఒక కథ చెప్తాడు. సింహం తల, ఏనుగు దేహం కలిగిన ఆ మృగం గురించి వాడు చెప్తుంటే భయపడుతున్నట్లు నటించడం బాగానే ఉంది. ఏది నడిచే నీడలమో మనం? అనే ఒక చిన్న కథలో రచయిత మౌని రాశారు. 36 వ ఏట ఆ వాక్యాలు అర్థమైనట్లు అనిపిస్తుంటాయి.పుస్తకాలు కొనడానికి మీరు అప్పులు చేసేవారు. అప్పు తీర్చడానికి అప్పు చేసేవారు. దానిని తీర్చడానికి మళ్ళీ అప్పు చేసేవారు. అప్పులు చేసిన మీ మనస్సు కలతపడనే లేదు.అప్పిచ్చిన వారు ఎదురుపడినప్పుడో కొందరు పక్కకు తప్పుకున్నా మీ అంతట మీరే దగ్గరకు వెళ్ళి వచ్చే నెల ఇచ్చెస్తాను సార్ అనడం, వాళ్ళు ఫరవాలేదు సార్ అని వెళ్ళిపోయినప్పుడు మీరు నన్ను చూసి "అప్పులిచ్చిన వారిని చూసి భయపడకూడదు" అనేవారు.నాన్నా, ఇప్పుడంటున్నాను...నేను చదివిన పుస్తకాలలోనే మీ అనుభవాలే గొప్ప పుస్తకం.ఇప్పుడు ఎన్నో సినిమాలకు నేను పాటలు రాస్తున్నప్పటికీ మీతో కలీసి చూసిన సినిమాలను మరచిపోగలనా? చాలాసార్లు మీరు నైట్ షో సినిమాలకే తీసుకుపోయే వారు. రాత్రి పడుకునేటప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. అయితే కొన్నిసార్లు నేను మీకన్నా ముందే ఆన్నం తినేసి పడుకున్నట్లు నటించేవాడిని. మరుసటిరోజు మీరు నాకు చేతి ఖర్చులకోసం అయిదు రూపాయలు ఇచ్చేవారు. అయితే ఓసారి పది రూపాయలు ఇచ్చారు. అది తీసుకుని "నాన్నా ఇది పది రూపాయలు" అన్నాను. ఫరవాలేదులే. సినిమా గినిమా చూడటానికి ఉంటుందిలే అన్నారు మీరు.పదో తరగతి పరీక్షలకు చదువుతుంటే ఓసారి మీరు నా ముందు నిల్చుని మరీ ఆంతలా చదవకు...టెంట్ లో రక్తకన్నీరు సినిమా ఆడుతోంది. చూసిరా అంటూ డబ్బులు ఇచ్చారు. నేను కాదని మళ్ళీ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నిజానికి మీరు ఇందుకు భిన్నంగా పబ్లిక్ పరీక్షలు...సరిగ్గా చదువు అని చెప్పుంటే నేను కచ్చితంగా రక్తకన్నీరు సినిమాకి వెళ్ళి ఉండేవాడిని.నాన్నా, పుస్తకాల తర్వాత మీ ప్రేమ, సైకిల్ పైనే ఉండేది. మీరు పని చేసిన స్కూలు, మన ఇంటికి ఇరవై మైళ్ళ దూరంలో ఉండేది. రోజూ నలభై మైళ్ళు సైకిల్ తొక్కేవారు. కాంచీపురంలో జరిగే సైకిల్ పోటీలలో ఇచ్చే జ్ఞాపికలపై మీ పేరుండేది.మీరు మరణించే వరకూ నన్ను మీ సైకిల్ లో వెనుక సీట్లో కూర్చోపెట్టుకుని మీతో తీసుకువెళ్ళేవారు.మీరు మరణించిన తర్వాత మీ అస్థికలను కలపడానికి మహాబలిపురం సముద్రానికే వెళ్ళాను. దారి పొడవునా మీ జ్ఞాపకాలే. నా జీవితంలో నేనెప్పుడూ దాటలేని దారులు.మొదటిసారిగా మీ చేయి పట్టుకుని స్కూలుకి వెళ్ళడం, హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్ళడం, సముద్రతీరానికి వెళ్ళడం, ఇలా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎదలో కదలాడుతున్నాయి. చిన్న వయస్సులో సైకిల్ తొక్కడం నేర్పించేటప్పుడు నా నడుము పట్టుకునేవారు. ఉన్నట్లుండి చెయ్యి విడిచిపెట్టేసేవారు. కానీ మీరు పట్టుకునే ఉన్నారనే ధ్యాసలో సైకిల్ తొక్కుకుంటూ పోయేవాడిని. ఇప్పుడూ అలాగే మీరు నన్ను పట్టుకున్నట్లే ఈ జీవితాన్ని నడిపిస్తున్నాను.నాన్నా ....మీ ప్రాణంలోని ఓ చుక్కతో నా ప్రపంచం మొదలైంది. ఈరోజు ఈ సమయంలో అంతులేని ప్రేమతో నా కన్నీటిలో కొన్ని చుక్కలను మీకు కానుకగా అర్పిస్తున్నాను. ఇట్లు మీ కొడుకు (తమిళ సినిమాలలో స్వల్పకాలంలో ఎక్కువ పాటలు రాయడమే కాకుండా అనేక బహుమతులు పొందిన నా. ముత్తుకుమార్ గొప్ప కవికూడా. ఆయన అమ్మా, నాన్నా, అక్కా, బామ్మ, భార్య, పిన్ని ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలపై ఆణిముత్యాల్లాంటి వ్యాసాలు రాశారు. ఓ వారపత్రికలో ఈ వ్యాసాలు సీరియల్ గా వెలువడ్డాయి. వాటిలో ఓ వారం ఆయన తన తండ్రికి రాసిన ఓ ఉత్తరంలో కొంంత భాగానే అనువదించి ఇక్కడ ఇచ్చాను. నాకెంతో ప్రియమైన రచయిత నా. ముత్తుకుమార్)- యామిజాల జగదీశ్


కామెంట్‌లు