కనిపించే చిత్రాలు కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లా శ్రీరంగ పట్న లోనివి. శ్రీరంగ పట్న అటు కర్నాటక లో మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశలో ప్రసిద్ది. అనేక మంది యాత్రికులు, శ్రీరంగ స్వామి భక్తులు అక్కడికి వెళ్లి వస్తుంటారు. శ్రీరంగ పట్న గురించి నేనెందుకు ప్రస్తావిస్తున్నానో తెలియాలంటే 1984 లోకి వెళ్ళాలి. అప్పుడు నేను ఖమ్మం ఎస్.ఆర్&బి.జి.ఎన్.ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. అప్పుడప్పుడే మిమిక్రీ కళలో ప్రావీణ్యత సంపాదిస్తూ జిల్లాలో పేరు తెచ్చు కుంటున్నాను. ఖమ్మం ఆంధ్రా గర్ల్స్ హై స్కూల్ లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీన పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. జనం కిక్కిరిసి పోయారు. అక్కడ నా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ప్రోగ్రామ్ పూర్తి కాగానే నెహ్రూ యువ కేంద్ర సూపరింటెండెంట్ శ్రీ కాశీనాధ్ అక్కడకు వచ్చి తనను పరిచయం చేసు కున్నారు. అయితే ఆయన వచ్చింది ఆ కార్యక్రమానికి కాదు. నాకోసం వచ్చారు. కర్ణాటక రాష్ట్రం లోని శ్రీరంగ పట్న లో జాతీయ సమైక్యతా శిబిరాలు ఉన్నందున టీమ్ వెళుతుందని, అందులో నిన్ను కూడా ఎంపిక చేశామని తెలిపారు. అప్పటిదాకా నాకు నెహ్రూ యువ కేంద్ర అంటే ఏమిటో, వాళ్ళెవరో ఏమీ తెలియదు. ఇప్పటి మాదిరిగా అప్పుడు సెల్ ఫోన్లు కాదు గదా మామూలు ఫోన్లు కూడా లేవు. దాంతో నా కోసం ప్రత్యేకంగా ప్రోగ్రాం దగ్గరకు వచ్చి పరిచయం చేసుకొని రెండు రోజుల్లో శ్రీరంగ పట్న బయలు దేరాలని చెప్పారు. రెండు రోజుల్లో బయలు దేరడం కష్టమే అయినా నాకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఒప్పుకున్నాను. అప్పుడు NYK Dist Coordinator గా "నారాయణ స్వామి" అనే అధికారి ఉండే వారు. మంచి అధికారిగా ఆయనకు పేరు ఉంది. నేను కర్ణాటక క్యాంప్ కు ఒప్పుకున్నానని తెలిసి ఆయన కూడా సంతోషించారు. క్యాంపు కు వచ్చిన వారంతా ఖమ్మం అర్బన్ మండలం వి.వెంకటాయపాలెం తదితర గ్రామాల యూత్. వాళ్ళు క్రీడాకారులు కావడంతో కొందరు భారీ సైజు లో ఉన్నారు. వాళ్ళతో పోల్చు కుంటే నేను చాలా చిన్న వాన్ని. వారిలో వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ ఆదినారాయణ, రామానుజ రావు తదితరులు ఉన్నారు. మిగతా వారి పేర్లు నాకు గుర్తుకు లేవు. మమ్మల్నందరినీ superintendent శ్రీ కాశీనాధ్ బెంగళూర్ మీదుగా శ్రీరంగపట్న తీసుకెళ్లారు. వెళ్ళేముందు బెంగళూరు లో గాంధీ సినిమా తెలుగు వెర్షన్ చూపించారు. నా జీవితంలో నేను మన రాష్ట్రం దాటి మొట్ట మొదట ఇతర రాష్ట్రానికి వెళ్ళింది శ్రీరంగ పట్న మే. అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్యాంప్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వాగతం లో భాగంగా సాయంత్రం వేళలో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల వారు తమ టీమ్ పేరు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్(అప్పటి ఉమ్మడి రాష్ట్రం) తరఫున ఎవ్వరూ ప్రిపేర్ గా లేక పోవడంతో పేరు ఇవ్వలేదు. కార్యక్రమాలు ప్రారంభమయ్యాక దేశంలోని అన్ని రాష్ట్రాల బృందాలు ప్రదర్శన ఇస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి ప్రదర్శన లేక పోవడంతో లోటుగా అనిపించి మన టీమ్ వాళ్ళే తెగ ఫీలయ్యారు. ఏదో విధంగా మొదటి రోజు తెలుగు వాళ్ళ ప్రోగ్రాం ఉండాల్సిందే అని పునర్ నిర్ణయం తీసుకున్నారు. మిమిక్రీ చెయ్యమని నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ముందు పేరు ఇవ్వలేదు,అందువల్ల ఇప్పుడు వీలు పడదు అని నిర్వాహక కమిటీ అధికారులు తేల్చి చెప్పారు. మనవాళ్ళు బ్రతిమిలాడితే 5 నిమిషాలు ఇచ్చారు. అప్పటిదాకా పాటలు, నృత్యాలు చాలా ఎక్కువగా జరిగాయి. నిర్వాహకులు గానీ, ప్రేక్షకులు గానీ మిమిక్రీ వినడం తక్కువ. అప్పటికి చాలా మంది దృష్టిలో మిమిక్రీ కొత్త కళ. దాంతో నా మిమిక్రీ కి అనూహ్య స్పందన వచ్చింది. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. అందరూ నా ప్రదర్శన చూసి సంబ్రమాశ్చర్యాలతో ఆనందించారు. 5 నిమిషాలు కాస్తా 20 నిమిషాలకు పెరిగింది. అప్పటిదాకా జరిగిన ప్రోగ్రాం లన్నీ మరచి పోయారు. నా ప్రదర్శన మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. అందుకు కారణం మిమిక్రీ కళ వారికి కొత్త. నేను అనుకరించేవి వివిధ రకాల సౌండ్స్, ప్రపంచ యుద్ద సన్నివేశాలు, వాహన శబ్దాలు, చేజింగ్ అనుకరణ, ఖుర్బానీ సినిమా పాటల మ్యూజిక్ లు, ఇందిరాగాంధీ, ఎన్.టి.ఆర్ ఉపన్యాసాలు. నేను చేసే ఐటమ్స్ అన్నీ వారికి అర్ధం అవుతున్నాయి. తెల్లారి శ్రీరంగ పట్న జనంలో చర్చనీయాంశం. ఇప్పుడు మిమిక్రీ కళ అన్ని ప్రాంతాలకు పాకింది. అప్పుడు వారి దృష్టిలో కొంచెం అరుదైన కళ కావడం వల్ల నా ప్రదర్శన ఎక్కువగా విజయవంతం అయ్యింది. ఆ తర్వాత రోజుల్లో తెలుగు రాష్ట్రం తరఫున వి.వెంకటాయపాలెం వారు ఎలుగుబంటి వేషం తో నృత్యాలు తదితర కార్యక్రమాలు ప్రదర్శించారు. తిరిగి చివరి రోజు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే "ఆండ్రూపో" మృతి చెందిన కారణంగా చివరి రోజు కార్యక్రమం రద్దయ్యింది. లేకపోతే ముగింపు లో కూడా వెలిగే వాన్ని. శ్రీరంగ పట్న లో మొత్తం 10 రోజులు ఉండగా శ్రీరంగనాథుని ఆలయాన్ని తరచూ సందర్శించే వాళ్ళం. అక్కడి కావేరి నదిలో రోజూ స్నానం చేసే వారం. ఆ పట్టణం లో గల తెలుగు వారు నన్ను పలకరించే వారు. ఇలాంటి క్యాంపులో పాల్గొన్న వారికి ఒక రోజు సైడ్ సీన్ ఉంటుంది. మైసూరు తీసుకెళ్ళి బృందావన్ గార్డెన్స్ ను, శ్రీరంగ పట్న లో టిప్పు సుల్తాన్ టూంబ్ ను చూపించారు. మనం ఎప్పుడూ బాధలు తలచు కుంటూ, మైనస్ లు వెతుక్కుంటూ మంచి జ్ఞాపకాలను, విజయాలను తేలికగా తీసుకుంటాము. నేను మాత్రం మంచిని, విజయాలను ఎక్కువగా గుర్తు పెట్టుకొని, అనవసర విషయాలను పక్కన పెడ తాను. మా గురువు గారు విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డా: నేరెళ్ళ వేణుమాధవ్ గారు మంచిని ఎక్కువగా తలచు కొమ్మని సలహా ఇచ్చేవారు. నేను మొదటి సారిగా ఇతర రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రదేశమైన శ్రీరంగ పట్న ను ఎప్పటికీ మరచి పోలేను.-మల్లం రమేష్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం