పాత్రికేయుల ప్రొఫెషనాలిటీ.. పర్సనాలిటీ....--పాత్రికేయులు వృత్తిగతంగా ఎలా వ్యవహరించాలో జర్నలిజంలో చాలా ఏళ్లుగా కొన్ని సూత్రీకరణలు, ప్రమాణాలు ఉన్నాయి. సంఘటనలకు, పరిణామాలకు సంబంధించి పాత్రికేయులు సాక్షులుగా, పరిశీలకులుగా మాత్రమే ఉండాలని, తొణకని తటస్థతతో వాటిని రిపోర్టు చేయాలని చెబుతారు. జర్నలిస్టులు ప్రజాబాహుళ్యంలో భాగమైనప్పటికీ, వారికి విశ్వాసాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతం మాత్రమే కావాలనే వాదన ఉంది. ముఖ్యంగా రాజకీయాలు, కులమతాలు, ప్రాంతీయతల పరంగా జర్నలిస్టులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను, భావజాలాలను మానసికంగా తమకే పరిమితం చేసుకోవాలని, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయకూడదని, రాతల్లో చూపకూడదని, భౌతిక కార్యాచరణలో పాలుపంచుకోకూడదనే పద్ధతులూ ఉన్నాయి. విధి నిర్వహణలో పాత్రికేయుడు ఔట్‌సైడర్‌గా, స్వతంత్రమైన వ్యక్తిగా ఉండాలని, చూసింది చూసినట్టుగా పత్రికా రచన చేయాలని చెబుతారు. సంఘటనలు, పరిణామాల్లో సగటు వ్యక్తివలె ‘ఇన్‌వాల్వ్‌’ అయితే, పాత్రికేయ విధి నిర్వహణలో ప్రొఫెషనాలిటీ కొరవడుతుందనే భావజాలం కూడా ప్రచారంలో ఉంది.1993లో న్యూయార్క్‌ టైమ్స్‌ ఫొటోగ్రాఫర్‌ కెవిన్‌ కార్టర్‌ సూడాన్‌లో కరువు విలయతాండవం చేస్తున్న సందర్భంలో... చిక్కి శల్యమైన ఓ బాలిక ఆహారం కోసం ఎదురుచూస్తుండగా, ఆమె పక్కనే ఓ రాబందు కాచుకొని ఉన్న దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. ఈ చిత్రాన్ని ‘ది వల్చర్‌ అండ్‌ ఎ లిటిల్‌ గర్ల్‌’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తన మొదటి పేజీలో ప్రచురించింది. ఈ ఒక్క ఫోటో సూడాన్‌లోని కరువు తీవ్రతను యావత్‌ ప్రపంచానికి కళ్లకు కట్టింది. 1994లో ఈ ఫొటో ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్‌ ప్రైజ్‌ను గెలుచుకుంది. అయితే ఈ ఫోటో ఎంత ఆదరణ పొందిందో, అంత వివాదాస్పదమూ అయింది. అత్యంత హృదయవిదారక పరిస్థితుల్లో మరణం అంచున ఉన్న బాలిక పట్ల ఒక మనిషిగా స్పందించకుండా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుంటూ గడపడం మానవత్వమేనా... అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అక్కడ రాబందులు రెండు ఉన్నాయని, ఒకటి ఫొటోలో కనిపిస్తున్నది అయితే, మరొకటి ఫొటోగ్రాఫర్‌ రూపంలో ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన కెవిన్‌... పులిట్జర్‌ అవార్డు అందుకున్న మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ పరిణామం జర్నలిస్టుల ప్రొఫెషనాలిటీ, పర్సనాలిటీల మధ్య ఉండే సన్నని విభజన రేఖపై తీవ్ర చర్చకు దారి తీసింది. జర్నలిస్టులూ మనుషుల్లో భాగమేనని, వారికీ భావజాలాలు, అభిప్రాయాలు ఉంటాయని, వాటిని వ్యక్తపరచడంపై పరిమితులు విధించడమంటే వారి స్వేచ్ఛను హరించడమేనని, స్వేచ్ఛ లేనిచోట సృజన వికాసం పొందలేదనే వాదనలు వెలువడ్డాయి. ప్రజల పక్షాన తమ అభిప్రాయాలను చాటుకుంటూనే విధి నిర్వహణ చేయవచ్చనే కొత్త సూత్రీకరణలూ వచ్చాయి. ఈ మార్పు వల్లే కాబోలు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది జర్నలిస్టులు– ప్రజల పట్ల, తమ ప్రాంతం పట్ల, తమ దేశం పట్ల వకాల్తా పుచ్చుకొని ప్రెస్‌మీట్లలో పాలకులతో వాగ్వాదాలకు, ఘర్షణలకు దిగిన దృశ్యాలు ఆవిష్కారమయ్యాయి. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఈ మార్పుకు సరైన సాక్ష్యంగా కనిపిస్తుంది. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో పాత్రికేయ విభజన రేఖలను, లక్ష్మణరేఖలను తోసిరాజని జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమకారులై కదం తొక్కారు. రాయినిగూడెంలోనైతే ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగాన్ని బాజప్తా అడ్డుకొని తెలంగాణ కాంక్షను దైర్యంగా చాటగలిగారు. ఉద్యమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను తమ వృత్తిపరమైన పరపతి, పలుకుబడి, సంబంధాలతో విడిపించగలిగారు. కేసులు నమోదు కాకుండా మేనేజ్‌ చేయగలిగారు. ఉద్యమానికి చివరికంటా రక్షణ కవచం వలె నిలిచారు. జర్నలిస్టులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమంటే వారి పాత్ర ఎంత క్రియాశీలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రస్తుత తెలంగాణ స్వయంపాలనలో తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితి ఎట్లా ఉందని చూసుకుంటే... అదో పెద్ద డిబేట్‌ అవుతుంది. దానికిది సందర్భం కాదు.తెలుగు పత్రికా రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టుల్లో సింహభాగం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే కనిపిస్తారు. అడుగడుగునా ఒడిదొడుకులు, సంక్షోభాలు, సంఘర్షణలు, సమస్యలు వారి జీవన గమనంలో భాగంగా కనిపిస్తాయి. అందుకే సామాన్య ప్రజల సమస్యల పట్ల వారిలో ఒకరకమైన మమేకత కనిపిస్తుంది. పీడితులూ బాధితులకు సంబంధించి, సామూహిక ప్రజల సమస్యలకు సంబంధించి వార్తా రచనకే పరిమితం కాకుండా, చొరవతో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులతో, సమాజంలోని భిన్న వర్గాలతో మాట్లాడి సాయం అందేలా వ్యక్తిగతంగా తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. అయితే ఇట్లాంటి పాత్రికేయుల సంఖ్య స్వల్పంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పృహ, అవగాహన, చైతన్యాన్ని అందింపుచ్చుకునే పాత్రికేయుల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. అయితే సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల భౌతిక కార్యాచరణ అంతిమ ప్రయోజనం.. ప్రజలది అయినప్పుడు మాత్రమే దానికి ఆమోదనీయత, మద్దతు ఉంటాయి.ఈ కోణంలో సీనియర్‌ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి కరీంనగర్‌ బ్యూరో చీఫ్‌ నగునూరి శేఖర్‌ చేసిన ఓ మానవీయ ప్రయత్నం సగటు పాత్రికేయులందరికీ స్ఫూర్తిదాయకం. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని కాట్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డునపడిన నేరెళ్ల మమత(18), సమత(12) కన్నీటిగాథను కేవలం పత్రికారచనకే పరిమితం చేయకుండా, వారిని గట్టెక్కించే కార్యాచరణకు స్వయంగా పూనుకున్నారు. వారి దీనస్థితిని సోషల్‌మీడియాలో పోస్టు చేయడం ద్వారా, దేశ విదేశాల నుంచి బాలికలకు ఆర్థికంగా అండ లభించేలా చేయగలిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వయంగా మాట్లాడి వారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే చర్యలకు బాసటగా నిలిచారు. స్థూలార్థంలో ఇది శేఖర్‌ మానవీయతకు నిదర్శనమే కావొచ్చుగాని, సూక్ష్మార్థంలో అది పాత్రికేయ వృత్తికి ఉన్న విశ్వసనీయతకు, పరపతికి సాక్ష్యం. ఈ శక్తిని సమాజం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వాడే సంకల్పం, చిత్తశుద్ధిని పెంపొందించుకున్నప్పుడు, దానిని వీలైనప్పుడల్లా అమలు చేసే అలవాటును జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు పాత్రికేయ వృత్తికి సమాజం జేజేలు పలుకుతుంది.సూడాన్‌ బాలికను ఫొటో తీయడంతో పాటు, ఆమెకు ఆహారం సమకూర్చి శిబిరంలోకి తీసుకుపోయి ఉంటే, బహుశా కెవిన్‌ కార్టర్‌కు పులిట్జిర్‌ అవార్డును మించిన ప్రశంసలు జీవితపర్యంతమూ దక్కేవి. కానీ ఆ చైతన్యం, స్పృహ లేకపోవడం వల్ల కెవిన్‌ అప్పుడు ప్రొఫెషనాలిటీకే పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడా స్పృహను ఆచరణలోకి తీసుకువెళ్లే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కావాల్సిందల్లా.. నిబద్దత, నిజాయితీ మాత్రమే. సోషల్‌ రెస్పాన్సిబిలిటీని జర్నలిస్టులు రాతల్లోనే కాదు, చేతల్లోనూ చూపిస్తే ఈ సమాజానికి వారి పర్సనాలిటీ ఎంత మేలు!–శంకర్‌ శెంకేసి--79898 76088


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం