ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివగారి 92వ జయంతి నేడు: ఈ రోజు డా సామల సదాశివ 92 వ జయంతి.ఆయన ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు అభినవ మొల్ల శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారు రాసిన ప్రశంసా పద్యాలలోని ఒక పద్యం గుర్తుకు వస్తుంది. ఉ.కమ్మని ఉరిదుభాషయను కాచిన తీయని పాలలో ననం తమ్ముగ దాగియున్నపరతత్త్వ మహత్తర నూత్నప్రేమ తత్త్వమ్మును దీసి తెల్గు కవితానవనీతము జేసి ఆంధ్రలో కమ్మున బంచి పెట్టిన యఖండ యశోవిభవా సదాశివా! మహానుభావుని గురించి ఎంత చక్కగా చెప్పారో ఆమె.తెలంగాణా ఉద్యమం మంచి ఊపులో ఉన్నపుడు తెలంగాణా ఆవిర్భావ ప్రత్యూష రేఖలుపొడసూపే వేళ తెలంగాణ ఉషోదయం తిలకించకుండానే అగస్టు 7 ,2012 న అస్తమించిన ఆదిలాబాద్ కవి,రచయిత అన్నిటికంటే ముఖ్యంగా మాస్టారు అని పిలువబడ్డ సామల సదాశివ సారును గుర్తుకు తెస్తుంది అగస్టు నెల ఇటీవలఐదారేండ్ల నుంచీ. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకుని,తాను పుట్టి పెరిగిన నేలను వదలకుండా ఎక్కడెక్కడి వారినో ఆకట్టుకునే రచనలు చేసి పండిత పామరులను అలరింప జేసి అనేక మంది పాఠకుల్ని తయారుచేసుకున్న ప్రముఖ రచయిత సామల సదాశివ.తాను ఖట్టర్ తెలంగాణావాదినని చెప్పుకునే మాస్టారుకు తెలంగాణేతర ప్రాంత అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేదంటే ఆయన ఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గలవారో గమనించవచ్చు.అవిభక్త ఆదిలాబాదు జిల్లా లోని కాగజ్ నగర్దగ్గర తెనుగుపల్లె మాతామహుల ఇంట్లో 11 - 5 -1928 న జన్మించిన సదాశివ బాల్యం నవెగాంలో గడిచింది.తండ్రి నాగయ్య పంతులు బడిపంతులు.తల్లి చిన్నమ్మ.ఏకైక సంతానమైన సదాశివ తండ్రి వద్ద చదువు నేర్చుకుని అప్పట్లో పెద్ద తరగతులన్నీ ఉర్దూ మాధ్యమంలో ఉండటమేగాక పెద్ద ఊళ్లలో మాత్రం ఉండటం చేత వరంగల్ లో పాఠశాలవిద్యనభ్యసించారు.ఇంట్లో భారత భాగవతాలు రామాయణం వంటివి ఉండటం వలన సహజంగా జ్ఞానాంశ కలవాడు కనుక,వాటిని ఒంటబట్టించుకున్నారాయన.అంతే గాక తండ్రి ఒక గురువు వద్ద అరబ్బీ ఫారసీ నేర్చుకునే అవకాశం కలిగించారు.అలా యౌవన దశలోపే ఆయనకు ఇటు సంస్కృతాంధ్రాలు,అటు అరబ్బీ, ఫారసీ,ఉరదూ భాషలపై పట్టు దొరికింది.దానికి తోడు కొద్దీ గొప్పో ఆంగ్లం తోడైంది.అప్పట్లో తెలుగు భాషలో పద్యాలు రాసేవారికి బాగా ప్రాధాన్యత ఉండటం గమనించి పద్యాలు రాసి భారతి వంటి పత్రికలకు పంపటంతో వేలూరి శివరామశాస్త్రి,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి ఉద్ధండ పండితుల దృష్టిలో పడ్డారు సదాశివ.నిర్దుష్టంగా భావరమ్యమైన పద్యాలు వారి నాకర్షించటంతో ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా వారితో పరిచయాలు పెరిగి పలు రచనలు చేసే స్ఫూర్తి లభించింది.కారణాంతరవల్ల తండ్రి ఉద్యోగం మానేయవలసి వచ్చినందువల్ల సదాశివ పాఠశాల చదువు కాగానే ఆదిలబాదు జిల్లాలోనే బడిపంతులు ఉద్యోగంలో చేరారు.ఇటు ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సాంబశివ శతకము,నిరీక్షణ,మంచిమాటలు,విశ్వామిత్రము,అంబపాలి,ధర్మవ్యాధుడు వంటి పలు పద్యలఘుకృతులు వెలువరించారు. అమ్జద్ రుబాయీలను తేటగీతులలో తెనిగించారు.తెలుగులో కథలు నవలలు కూడా ప్రయత్నించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.అలాగే ఉర్దూలో అనేక వ్యాసాలు రాసి ఉర్దూ పాఠకులకు దగ్గరయ్యారు.మన తెలుగు కవులను వారి రచనలను ఉర్దూ పాఠకులకు పరిచయం చేసిన ఘనత సదాశివ గారిదే.ఈసమయంలోనే సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకు పద్యరచన మానుకుని తనకున్న ఉర్దూ అరబ్బీ భాషా పటిమతో ఉర్దూ సాహిత్యవిశేషాలను ఉర్దూ కవులను తెలుగువారికి పరిచయం చేసే పనికి పూనుకున్నారు.అలా ఉర్దూసాహిత్య చరిత్ర,ఫారసీకవుల ప్రసక్తి,మహాకవి గాలిబు వంటి పుస్తకాలు రచించి ఉర్దూ తెలుగు వారధిగా మంచి పేరు తెచుచుకోవడమే గాక అకాడమీ సభ్యులుగా చిరకాలం పనిచేశారు.గీటురాయి,మిసిమి పత్రికలలో గజల్ పుట్టుపూర్వోత్తరాలు,రూమీ మస్నవీలుఇంకా అనేక ఉర్దూ భాషాసంస్కృతులకు ముఖ్యంగా హిందూస్తానీ సంగీత గాయనీగాయకుల విశేషాలు వ్యాసరూపంలోవచ్చాయి. అలాగే వారి ఉరుదూ రచనలు సియాసత్ వంటి ప్రసిద్ధ ఉరుదూ పత్రికలలో ప్రచురించబడేవి. వారి వచన రచన ముచ్చట్ల రూపంలో ఉండటంతో అనేకమంది పాఠకులను అలరించేది.స్వతహాగా చిన్నప్పటినుంచే సంగీతాభిమాని మరియు సంగీతజ్ఞడవటంతో ఆయనవ్యాసాలు చాలా విశిష్టతను కలిగి అడిగి రాయించుకునే స్థాయికి చేరుకున్నాయి.అవే తరువాత మలయమారుతాలు,సంగీతశిఖరాలు,స్వరలయలు పుస్తకాలుగా వెలువడినాయి.ఇందులో స్వరలయలు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించి పెట్టింది.ఇవన్నీ ఒక ఎత్తయితే వార్త పత్రికకు యాది పేరిట ఆయన రాసిన వ్యాసాలు ఆయన ఇంటిపేరు మార్చి ఆయనను యాది సదాశివను చేశాయి.ఆయన వ్యాసాలకోసం పత్రికను కొన్న వారెందరో అప్పట్లో.ప్రతిభాశాలి గనుక ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం మరియు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డాక్టరేటు పట్టాలను ప్రసాదించాయి.తనకు పరిచయమైన వ్యక్తులు చిన్నా పెద్దా అని తేడాలేకుండా మానవీయతా దర్శనాన్నిఅనితర సాధ్యంగా యాదిలో పొందు పరచడంతో దానికి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది.సంగీత సాహిత్యాలే గాక చిత్రలేఖనంలో కూడా అత్యంత ప్రావీణ్యంగల సదాశివ తైలవర్ణ చిత్రాలెన్నో గీశారు.ఆయనకు పరిచయమైన ప్రతివ్యక్తితోనూ పండిత పామరులనే తేడాలేకుండా, వాదాలకతీతంగా నిరంతరం ఉత్తరాల ద్వారానో ఫోన్ ద్వారానో, సంబంధాలను కొనసాగించేవారు.ఉద్యోగ రీత్యా ఆదిలాబాదులో స్థిరపడి ఆదిలాబాదుకు ఏ అధికారి వచ్చినా ఆయనను కలుసుకునే విధంగా పేరు తెచ్చుకున్న మానవప్రేమికుడు.వచ్చిన వారితో వారి స్థాయికి తగ్గ ముచ్చట్లు పెట్టి వారి హృదయాలలో చిరస్థాయగ నిల్చిన అసాధారణ వ్యక్తి సామల సదాశివ.ఉద్యోగం చివరి దశలో పదోన్నతిపై భద్రాచలంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసిఅక్కడే ఉద్యోగవిరమణ గావించారు.అలా ఆయన్ని ఆయనకు ఇష్టమైన రాముడు తన దగ్గరికి రప్పించుకున్నాడు కావచ్చు.ఎందుకంటే ఆయనంతట ఆయన ఏనాడు ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదని చెప్పేవారు.భద్రాచలంలో ఆలయానికి వెళ్లినపుడు ఆయన గుర్తించిన నిలయ విద్వాంసులు ఆయన కిష్టమైన కీర్తనలు వాయించేవారంటే వారెంతగా మనుష్యులను ఆకర్షించేవారో తెలుస్తుంది. ఆయన రచనలలో ఇంతవరకు వెలుగు చూడనిది ఆయన నారాముడొక్కటే.ఆయన తొలిదశలో రాసిన కథలు కొన్ని అప్పట్లో సుజాతపత్రికలో ప్రచురించబడ్డాయి.వాటిని ఇటీవలే ఫేస్బుక్ మాధ్యమం ద్వారా సంపాదించగలిగాము.కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకులలో ప్రముఖుడు వారాల ఆనంద్ గారు సామలసదాశివ ముఖాముఖితో ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు.మిత్రుడు తాళ్లపల్లి మురళీధరగౌడు తన జీవనరేఖలు అనే ప్రముఖుల ఇంటర్వ్యూల పుస్తకంలో సదాశివగారి ఇంటర్వ్యూ ప్రచురించారు.ప్రతిభాశాలియైన సదాశివ పొందిన సన్మాన,సత్కార,పురస్కారాలు అన్నీ ఇన్నీ కావు. అడవులజిల్లా ఆదివాసుల జిల్లాలో పుట్టిన సదాశివ అక్కడి గోండు వీరుడు కొమురం భీమును తొలిసారిగా పాఠ్యపుస్తకాలకెక్కించి ఈరోజు కొమురం భీము ఒక గొప్ప విప్లవవీరుడిగ గుర్తించబడటానికి కారణభూతులయ్యారు.ఆయన రేడియో ప్రసంగాలకు చెప్పలేనంత ఆదరణ లభించేది.ఆదిలాబాద్,వరంగల్,హైదరాబాద్,విశాఖపట్టణం మొదలైన ఆకాశవాణి కేంద్రాల నుంచి ఆయన అనేక ప్రసంగాలు ప్రసారం చేయబడ్డాయి.సియాసత్ ఉర్దూ దినపత్రికకు ఆయన రాసిన వ్యాసాలు వెలుగులోనికి రావలసి ఉన్నాయి.తనకు తాను ఖట్టర్ తెలంగాణ వాదినని చెప్పుకునే సదాశివ తెలంగాణా అస్తిత్వానికై ఎంతో పాటు పడ్డారు.కాళోజీ సోదరులతో ఆయనకున్న అనుబంధం మాటల కందనిది.అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సదాశివ ఆత్మీయ స్నేహితులు.తెలంగాణా ఉద్యమసమయంలో చంద్రశేఖర్ రావుతో సహా ఆయనను సంప్రదించని నాయకులు లేరు.దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడకముందే అగస్టు 7,2012న ఆయన కన్ను మూశారు.ఆయనకు భార్య ముగ్గురు కుమారులు.ఇటీవలే ఆయన సతీమణి పరమపదించింది.మనుమలు మనుమరాళ్లంటే ఎనలేని ప్రేమ.తెలుగు సాహిత్య చరిత్రలో సదాశివకు సముచితస్థానమున్నదనటంలో సందేహం లేదు.మొన్న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పేరున ప్రత్యేక వ్దికనేర్పాటు చేయటం ఒక చిన్న ఉదాహరణ.అలాగే విశ్వనాథ పీఠం వారు ఆయనకు కేంద్ర సాహిత్యపురస్కారం లభించిన సందర్భంగా ఆయన విశిష్ట రచనలతో పాటు పలువురి వ్యాసాలతో ఆరువందలకు పైగా పేజీల ప్రత్యేక సంచికను తయారు చేసి ఆయన సమక్షంలోనే ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరించటం ఆయన సాహితయసేవకు ఒక మంచి గుర్తింపు.అలాగే ఆయనమరణానంతరం కావలి నుండి వెలువడిన ఒక వ్యాస సంకలనానికి ఆయన ముఖ చిత్రంతో సదాశివ స్మారక సంచికగా వేయటం ఎల్లలు లేని ఆయన సాహితీ సౌరభానికి నిదర్శనం.ఆదిలాబాదు జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక నగరం సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన శిలావిగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.నేను ఆదిలాబాదు జిల్లాలో నలభై సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉండటంతో ఆయనతో మూడు దశాబ్దాల సాన్నిహిత్యం చూరగొన్నాను.నా తొలి పుస్తకం గొంతెత్తిన కోయిల ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబడటమే గాక మలి పుస్తకం మువ్వలు వెలువడటానికి ఆయన ప్రేరణ కారణం. నా సాహిత్యప్రగతికి మూలకారణమైన కే.నారాయణ గౌడు సదాశివగారి ప్రియశిష్యుడు.సదాశివ పద్యకృతులన్నీ సంకలించి సదాశివ కావ్య సుధగా కాగజ్ నగర్ తెలుగు సాహితీ సదస్సు ప్రచురించింది. దానికి కే.నారాయణ గౌడు గారు సంపాదకులు.ఆయనే నన్ను తొలి సారి సదాశివ గారికి పరిచయం చేశారు.సదాశివ మరణానంతరం సదాశివ సాహితీబంధువుల వ్యాసాలు,కవితల సంకలనం ‘సదాశివస్మృతిసుధ’కు నేను సంపాదకుణ్ణి కావటం నాకు ఒక పదిలమైన జ్ఞాపకం.జలాలుద్దీన్ రూమీ ఖండకావ్యంలో వారు రాసిన క్రింది పద్యం వారికి అక్షరాలా వర్తిస్తుంది ఉ.శ్రోతల మానసంబులు స్పృశించి,కదల్చి రసానుభూతినే కైతయొసంగు నయ్యదియె కైత;అదైనను ఆత్మ తత్త్వ వ్యా ఖ్యాతమయేని శ్రేష్టతమ మట్లు కవిత్వము చెప్పునట్టి విఖ్యాత కవీంద్రులే ఋషులకారణబంధులు మానవాళికిన్తె లంగాణాలో ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు.ఆయన 92వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం