పుస్తకప్రియులు - అనుభవాలు---నాకు తెలిసినంత వరకూమద్రాసులో పాత పుస్తకాల దుకాణాలకు తరచూ వెళ్ళి పుస్తకాలు కొనేవాళ్ళు ఇద్దరు. వారు, విఠల్.రావు, తమిళ మిత్రుడు ఎస్. రామకృష్ణన్. రామకృష్ణన్ ఏ ఊరుకెళ్ళినా ముందుగా అక్కడ పాత పుస్తకాలు అమ్మే దుకాణాలు ఉన్నాయో లేవో వాకబు చేస్తారు. అనంతరం అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేస్తారు. అలా వెతుక్కుంటూ వెళ్ళి ఆయన అనేక అమూల్యమైన అరుదైన పుస్తకాలు కొనుగోలు చేశారు. పాత పుస్తకాలు అమ్మే వారి శైలే వేరంటారాయన. కొన్ని సార్లు యాబై పేజీలున్న పుస్తకాలకు రెండు వందల రూపాయలు అడుగుతారు. కొన్నిసార్లు వేల పేజీల ఉన్న పుస్తకాలను పది రూపాయలకూ ఇరవై రూపాయలకూ ఇచ్చేస్తారు. ఒక్కొక్కప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడుతారు. మరికొన్నిసార్లు మండిపడతారు.పుస్తకాలలో అందమైన బొమ్మలుంటే ఆ పుస్తకాల ధర అధికంగానే ఉంటుంది. బొమ్మలు లేని పుస్తకాలకైతే అయిదో పదో చాలని సరిపెట్టుకుంటారు.ఆయన ఓ మారు The Thief’s Journal అనే పుస్తకాన్ని ప్లాట్ ఫాం మీద చూశారు. దాని ధర అయిదు రూపాయలు అన్నాడు దుకాణదారు. అది అప్పటికే ముద్రణలో లేనిది. కానీ దాని ప్రాధాన్యం ఆ దుకాణదారుకి తెలీదు. దాంతో రామకృష్ణన్ తనంతట తానే ఇరవై అయిదు రూపాయలు ఇచ్చి పుస్తకం తీసుకున్నారు. అంతేకాకుండా అది విలువైన పుస్తకమని కూడా దుకాణదారుతో చెప్పారు.దుకాణదారు నవ్వుతూ అందుకోసం ఎక్కువ డబ్బులు ఇస్తున్నారా అని తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ దుకాణదారు ఏదైనే పుస్తకం కొనడానికి వెళ్తే రామకృష్ణన్ నే తోచిన డబ్బు ఇవ్వమని చెప్పడం మొదలుపెట్టాడు. వర్షాకాలం పాత పుస్తకాల దుకాణాలవారికి కష్టంతో కూడినది. ఓమారు పాత పుస్తకాల దుకాణదారొకరు రామకృష్ణన్ ఉంటున్న గది వెతుక్కుంటూ వచ్చి ఓ వెయ్యి రూపాయలు అప్పుగా కావాలి, మీరు మా దుకాణానికి వచ్చినప్పుడల్లా మీకు కావలసిన పుస్తకాలు తీసుకోండి. మీరిచ్చిన అప్పులో తగ్గించుకోండి అన్నాడు. అతనున్న క్లిష్ట పరిస్థితి అర్థం చేసుకున్న రామకృష్ణన్ వెంటనే మరేమీ మాట్లాడకుండా అతనడిగిన డబ్బు ఇచ్చి పంపించారు. మరో వారం రోజుల తర్వాత రామకృష్ణన్ అతని దుకాణానికి వెళ్ళగా తెలిసింది... అతను దుకాణాన్ని అమ్మేసుకుని ఎటోవెళ్ళిపోయనట్లు. అతను తనను మోసం చేసాడని రామకృష్ణన్ కి కోపం వచ్చింది.అతని ఆచూకీ కోసం వెతికారు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అనంతరం అతనిని మరచిపోయారు.ఓ నాలుగేళ్ళ తర్వాత ఓరోజు మధ్యాన్నం అతను రామకృష్ణన్ ఇంటి తలుపు తట్టాడు. అతనిని చూడటంతోనే రామకృష్ణన్ "కోపంతో ఏం కావాలి?" అని అడిగారు.దుకాణం నడపలేక అమ్మేసానని, అందుకే మీకు డబ్బులు ఇవ్వలేకపోయానని, ఓ వకీలు ఇంట్లో కొన్ని పాత పుస్తకాలు దొరికాయని, మీకోసం తెచ్చానని రెండు కట్టల పుస్తకాలు రామకృష్ణన్ ముందు పెట్టాడు. వాటిలో షేక్ స్పియర్ రాసిన పుస్తకాలు, మిల్టన్, చార్లెస్ డికెన్స్, వర్డ్స్ వర్త్ అంటూ ప్రముఖులు రాసిన నలబై అయిదు పుస్తకాలు ఉన్నాయి. "మీరిచ్చిన వెయ్యి రూపాయల అప్పుకి ఇవి వడ్డీ రూపంలో ఇచ్చాననుకోండి సార్" అన్నాడు అతను. "త్వరలోనే అసలు ఇచ్చి మీ అప్పు తీర్చుకుంటాను" అని చెప్పాడు ఆ పుస్తకాలతను. ఆ మాటలకు రామకృష్ణన్ చలించిపోయారు. "పరవాలేదులే, నేనే ఈ పుస్తకాలకు ఇంకా డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది" అంటూ మూడు వందల రూపాయలు ఇచ్చారు రామకృష్ణన్.కానీ అతను ఆ మూడు వందల రూపాయలు తనకు అక్కర్లేదని, ఓ పూట భోజనం పెట్టించమని కోరాడు. దాంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ కి వెళ్ళి భోం చేశారు.అనంతరం అతను పోతూ పోతూ ఇలా చెప్పాడు....."చదువుకున్న వారిని మోసం చేస్తే బాగుపడరండి, నేను త్వరలో ఓ తోపుడు బండిలో సూప్ అమ్ముతాను" అని అన్నాడు.కొన్ని వారాల తర్వాత రామకృష్ణన్ అతను చెప్పిన చోటుకెళ్ళి చూడగా చూస్తే ఆతను కనిపించలేదు. అసలు అటువంటి సూప్ అమ్మే బండీయే లేదు. అతనెక్కడికి పోయాడో తెలీలేదు. కానీ రామకృష్ణన్ మనసు అతడినే వెతుకుతోందింకా.పాత పుస్తకాల దుకాణాలలో అదృష్టముంటే మంచి పుస్తకాలు దొరుకుతాయంటారు రామకృష్ణన్. ఆయన అప్పుడ ప్పుడూ పుస్తకాలు కొనకపోయినా పాత పుస్తకాల దుకాణావికి వెళ్ళి అక్కడ పుస్తకాలు తిరగేయడం చేస్తుంటారు.పాత పుస్తకాలతో ఉన్న బంధమే వేరంటారాయన.చాలాసార్లు ఆయన పాతపుస్తకాలు కొన్నప్పుడు ఈ పుస్తకాలను అంతకుముందు కొన్నవారెవరు, అసలు కొన్న తర్వాత చదివిన వారెంతమంది అని ఆలోచిస్తారు. ఓసారి ఆస్కార్ వైల్డ్ రాసిన ఓ పాత పుస్తకంలో ఓ ఉత్తరం ఆయన కంట పడింది. అది వకీల్ భాష్యం అనే ఆయనకు ఆయన తండ్రి రాసిన ఉత్తరం. ఇంగ్లీషులో రాసిన ఉత్తరం. అందులో అడ్రెస్ కలకత్తా అని ఉంది. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది...."బతకాలనుకుని వెళ్ళిన చోట మంచి భోజనం, మాట్లాడేందుకు తోడు, మానావమానాలు గురించి ఆలోచించకూడదు. జయించాలి, ఆ ఒక్కటి మిగిలినవన్నింటినీ వెతికిస్తుంది" అని ఆ ఉత్తరంలో రాసి ఉంది.ఎవరో ఎవరికో రాసిన ఉత్తరం. అందులోని మాటలు ఆయనను ఆలోచనలో పడేసింది.ఓమారు పాత పుస్తకంలో ఓ పది రూపాయల నోటు ఉంది. అది ఓరోజు రామకృష్ణన్ అవసరం తీర్చింది. అది పి.జి. ఉడ్ హౌస్ పుస్తకం. అది చదివి అక్కడక్కడా తనకు నచ్చిన వాక్యాల కింద గీయడం బలేగా అనిపించింది రామకృష్ణన్ కి.రామకృష్ణన్ ఓమారు ఓ పాత పుస్తకం చదివారు. దాని పేరు "జీవితంలో కోన్ని ఉన్నతస్థాయిలు". రచయిత విఠల్ రావు. రామకృష్ణన్ కి ఈ పుస్తకంలోని వ్యాసాలు ఎంతగానో నచ్చాయి.విఠల్ రావు ఓ గొప్ప రచయిత. చిత్రకారుడు. ఆయనను రామకృష్ణన్ అనేకసార్లు ట్రిప్లికేన్లో ఓ పాతపుస్తకాల దుకాణంలో ప్రత్యక్షంగా చూశారు. పాత పుస్తకాలు ఎలా సేకరించాలి, పాతపుస్తకాలు అమ్మేవారి గుణగణాలు, సాహిత్య పత్రికల ప్రాధాన్యం గురించి విఠల్ రావు ఓ గొప్ప వ్యాసం రాశారు.సెంట్రల్ స్టేషన్ పక్కనున్న మూర్ మార్కెట్ అగ్నికి ఆహుతైనప్పుడు దాని గురించి ఆయన రాసిన వ్యాసం చాలా బాగుందన్నారు రామకృష్ణన్. రామకృష్ణన్ తన ఊరు నుంచి మద్రాస్ వచ్చి నప్పుడుల్లా సెంట్రల్ స్టేన్ దిగగానే పక్కనే ఉన్న మూర్ మార్కెట్ కి వెళ్తారు. అక్కడ ఓ సంచీడు పుస్తకాలు కొనుక్కుని ఇవతలకు వస్తారు. 1952లో హెమ్మింగ్వే ముఖచిత్రంతో విడుదలైన "లైఫ్" అనే మ్యాగజైన్ ని ఆయన ఈ మూర్ మార్కెట్లోనే కొన్నారు. అదెంతో అపూర్వమైన సంచిక అని రామకృష్ణన్ చెప్పారు. 1985 మే 30వ తేదీ అర్ధరాత్రి మూర్ మార్కెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఆరు గంటలకు గానీ మంటలను అదుపు చేయలేకపోయారు. 72 పుస్తకాల.దుకాణాలైతే బుగ్గిపాలయ్యాయి. ఇక్కడ దాదాపు ఎనిమిది వందల దుకాణాలుండేవి. వాటిలో ఎక్కువ దుకాణాలు పుస్తకాలకు సంబంధించినవే.ప్రమాదం జరిగిన వారం తర్వాత రామకృష్ణన్ మద్రాస్ సెంట్రల్లో దిగడంతోనే మూర్ మార్కెట్ సందర్శించారు. అక్కడి నెలకొన్న పరిస్థితిని చూసి ఆయన ఎంతో బాధ పడ్డారు. దేహంలో ఓ అవయవం దెబ్బతిన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంతలా విలవిలలాడారు. ఈ ప్రమాదంఅనుకోకుండా జరిగినది కాదని, ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందని తెలిసి ఆయన మరింత బాధపడ్డారు. నిజంగా కుట్రే ప్రమాదానికి కారణమైతే అంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు రామకృష్ణన్. ఈ మూర్ మార్కెట్ కి నేనూ వెళ్ళి వచ్చేవాడినే కానీ పుస్తకాలుకొనేవాడినికాను. అయినా నా దగ్గర డబ్బులుండేవి కావు. సెంట్రల్ స్టేషన్ కి రావడానికే డబ్బులు వెతుక్కునే వాడిని.మూర్ మార్కెట్ తో తనకున్న అనుబంధం గురించి విఠల్ రావు చక్కటి వ్యాసం రాశారట. ఆయనకు ఎదురైన అనుభవాలన్నీ తానూ చవిచూశానని రామకృష్ణన్ చెప్పారు. ఆయన వల్లే కొన్ని ఫోటోల గొప్పతనం ఆయనకు తెలిసిందట. విఠల్ రావు ఓ వ్యాసంలో తన తండ్రికి, ఓ పాతపుస్తకాల దుకాణదారుతో ఉన్న అనుబంధం గురించి కూడా ఓ వ్యాసం రాశారుట. అలాగే బైండింగ్ గూరించి మూర్ మార్కెట్ అయ్యర్ అనే ఆయన గురించి విఠల్ రావు రాశారట. సాహిత్యం, శిల్పం, చిత్రకళ, ఫోటోగ్రఫీ ఇలా అనేక అంశాపై ఆయన వ్యాసాలు రాశారంటారు రామకృష్ణన్. పుస్తకాలపై ఉన్న ప్రేమే విఠల్ రావుతో మంచి మంచి వ్యాసాలు రాయించాయట. చెన్నై నగరంలో పాత పుస్తకాల గురించి ఇంత చక్కటి వ్యాసాన్ని మరెవరూ రాయలేదన్నది రామకృష్ణన్ అభిప్రాయం.- యామిజాల జగదీశ్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి