తాంబరం - శానిటోరియం--తాంబరం అనేది చెంగల్పట్ జిల్లా తమిళనాడు) లోని ఓ ప్రాంతం. మద్రాసుకు సబర్బన్ ప్రాంతమవుతుంది. ఇక్కడి నుంచి బీచ్ స్టేషన్ వరకూ లోకల్ ఎలక్ట్రిక్ రైళ్ళు నడుస్తాయి. తాంబరంలో చెప్పుకోదగ్గవి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, ఎయిర్ ఫొర్స్,-రైల్వే క్వార్టర్స్. అలాగే తాంబరం నుంచి బీచ్ కీ బయలుదేరే ఎలక్ట్రిక్ రైలు ముందుగా ఆగే స్టేషన్ తాంబరం శానిటోరియం. శానిటోరియం రైల్వే స్టేషనుకి సమీపంలో ఓ పురాతన ఆస్పత్రి ఉంది. దీనిని స్థాపించినవారు డాక్టర్ శౌరి ముత్తు. ఆయన పూర్తి పేరు డాక్టర్ డేవిడ్ జాకబ్ ఆరన్ శౌరి ముత్తు.శౌరిముత్తు 1864లో జన్మించారు. ఆయనకు సంబంధించి చిన్ననాటి విషయాలు అందుబాటులో లేవు. ఆయన వైద్య శాస్త్రంలో గుర్తింపు పొందడం కోసం ఇంగ్లండుకి వెళ్ళి చదువుకున్నారు.అయితే అక్కడికి వెళ్ళి స్థిరపడి చదవడమన్నది భారతీయులకు పెను సవాలుగా ఉండేది. వర్ణవివక్ష కారణంగా సమస్యలు తలెత్తుతుండేవి. అయినప్పటికీ తనకెదురైన సమస్యలను విజయవంతంగా అధిగమించి డాక్టర్ పట్టా పొందిన శౌరి ముత్తు బ్రిటీష్ యువతిని పెళ్ళాడారు. ఆమె పేరు మార్గరెట్ ఫాక్స్. ఊపిరితిత్తులకు సంబంధించిన అంశంలో ప్రత్యేక చదువులు చదువుకున్న శౌరి స్వచ్ఛమైన గాలితోపాటు పారిశుద్ధ్యం అత్యంత కీలకమైనదిగా ఆయన చెప్పి వీటివల్ల క్షయ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని గట్టిగా భావించారు. వైద్య పట్టా పొందిన తర్వాత ఇంగిల్ వుడ్ అనే ఆస్పత్రిలో ఇన్ చార్జ్ డాక్టరుగా పని చేసిన శౌరి సోమర్సెట్లో హిల్ గ్రోవ్ శానిటోరియంను నెలకొల్పడం విశేషం. ఆయన పర్యవేక్షణలో చికిత్స పొందిన వారిలో మనందరికీ తెలిసిన భారతదేశం గర్వించదగ్గ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజం. డాక్టర్ శౌరికి అత్యంత సన్నిహితులలో మహాత్మా గాంధీ ఒకరు. ప్రకృతి చికిత్సా పద్ధతుల గురించి వీరిద్దరూ మాట్లాడుకునేవారు. గాంధీజీ మాట మేరకే 1920 తర్వాత ఆయన తరచూ మన దేశానికొచ్చి ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు. అంతేకాదు క్షయ రోగులకోసం ఓ ఆస్పత్రి ప్రారంభించాలని కూడా అనుకున్నారు. తాంబరంలో 250 ఎకరాల స్థలం కొని 1928 ఏప్రిల్ 9 న ఆస్పత్రి నెలకొల్పారు. మొదట్లో పన్నెండు పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభమైంది. ఈ ఆస్పత్రి సర్ సీపీ రామస్వామి అయ్యర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.అయితే ఇంతలోనే అదే ఏడాది శౌరి భర్య ఇంగ్లండులో మరణించారు.అనంతరం ఆయన ఈ ఆస్పత్రిని తీసుకుని నిర్వహించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.1937 నుంచి ప్రభుత్వ హయాంలో నడుస్తున్న ఈ ఆస్పత్రిలో ఎందరెందరో ప్రముఖులు చికిత్సపొందారు. 1946 లో ఈ ఆస్పత్రి 750 పడకల ఆస్పత్రిగా మారింది. 1960 నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా వృద్ధి చెందింది.1986 లో ఈ ఆస్పత్రి పేరు ప్రభుత్వ థొరాసిక్ మెడిసిన్ ఆస్పత్రిగా మార్చారు.1993 లో మొదటిసారిగా ఎయిడ్స్ రోగులను చేర్చుకుని చికిత్స చేసిన ఆస్పత్రిగా ఇది చరిత్ర పుటలకెక్కింది.వైద్యరంగానికి డాక్టర్ శౌరి చేసిన కృషి అన్ని విధాల ప్రశంసనీయం.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు