మానేరు ముచ్చట్లు-- రామ్మోహన్ రావు తుమ్మూరి --ముచ్చట్లు మొదలు పెట్టినపుడు అనుకోలేదు. ఇన్ని రోజులు రాస్తానని.వెయ్యేండ్ల వెలగందుల చరిత్ర రాయాలని కొన్ని సంవత్సరాలనుండి అనుకుంటున్నా, ఇన్నాళ్లకు అది నెరవేరే అవకాశం వచ్చింది.కరోనా పుణ్యమా అని కిందికో మీదికో పడి మీ అందరి ప్రోత్సాహంతో చివరి దశకు చేరుకోగలిగాను.అలాగని ఇవాళే ముగిస్తున్నానని కాదు. కాకపోతే ఒక రకంగా వెలగందులకు సంబంధించినంతవరకు ఇది చివరిదని చెప్పవచ్చు.ఎందుకంటే ఆరవ నిజాము మీర్ మహబూబలీఖాన్ పాలనా కాలం క్రీ.శ.1869 లో మొదలై క్రీ.శ.1911 లో ముగుస్తుంది.ఈ సమయంలోనే అంటే 1905 లో అంతవరకూ జిల్లా కేంద్రంగా ఉన్న ఎలగందుల నుండి జిల్లా కేంద్రం కరీంనగర్ కు మార్చటం జరిగింది.మిగతా ఎక్కడా జరగని ఈ మార్పు ఒక్క ఎలగందుల విషయంలో ఎందుకు జరిగిందో తెలియదు.అలా జరిగి ఉండని పక్షంలో ఈ రోజు ఎలగందుల వైభవం ఎలా ఉండేదో ఊహకందనిది.అయినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఇక్కడ జిల్లాల పునర్వవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.అది తెలుసుకోవాలంటే జిల్లాల విభజన చేసిన వ్యక్తి గురించి కొంత తెలుసుకోవాలి.మొగలు చక్రవర్తులలో చెప్పుకోదగ్గవాడు అక్బరు చక్రవర్తి యని మనకు తెలుసు.ఈయన ఆస్థానంలో నవరత్నాలలో ఒకడైన రాజా తోడర్ మల్ అక్బరు ఆస్థానంలో ఆర్థిక మంత్రిగా పని చేయడమే గాక అక్బరు చక్రవర్తికి కుడిభుజంగా ఉండేవాడు.ఆసఫ్జాహీలు మొదట మొగలుల వద్ద పనిచేసిన వారే గనుక.తోడర్ మల్ వారసత్వం కలిగిన రాయ్ మూలీచంద్ మొదటి ఆసఫ్జాహీ కాలంలో ఢిల్లీ నుండి ఇక్కడికి తరలి వచ్చాడు.అలా వచ్చిన వారి వంశంలో ని నరిందర్ పెర్షాద్ నిజాము దివానుగా పనిచేశాడు.ఈ నరీందర్ పెర్షాద్ మనుమడైన కిషన్ పెర్షాద్ మొదటి సాలార్ జంగ్ కొడుకులతో కలిసి పాశ్చాత్య పాఠశాలలో చదువుకున్నాడు. కిషన్ పెర్షాద్ఆరవ నిజామ్ కు చిన్ననాటి స్నేహితుడే కాక విద్యావంతుడు,విశ్వాసపాత్రుడు కావడంతో అతనిని 1901లో తన ప్రధాన మంత్రిగా నియమించాడు.అంతకు ముందు పది సంవత్సరాలపాటు పేష్కారు గా తన సత్తా చూపడంతో కిషన్ పెర్షాదుకు ఆ పదవి లభించింది.నిజాముకు కు కుడిభుజం అనే బిరుదు (యామిన్ ఎ సల్తనత్ ) పొందిన వాడు.ఈ కిషన్ ప్రసాద్ (పెర్షాద్) జిల్లాల పునర్వవస్థీకరణ కావించాడు.1897 వరకు ఎలగందుల జిల్లాలో1.చెన్నూరు,2.జగిత్యాల,3.జమ్మికుంట, 4.కరీంనగర్, 5.లక్సెట్టిపేట,6.మహాదేవపూర్,7.సిద్ధిపేట ,8.సిరిసిల్ల,9సుల్తానాబాద్ అని 9 తాలూకాలుండేవి.1905 లో హైదరాబాదు రాష్ట్రములో జిల్లాల పునర్వ్వస్థీకరణలో భాగంగా జిల్లా కేంద్రము ఎలగందుల నుండి కరీంనగర నగర్ కు మార్చడమే కాకుండా చెన్నూరు,లక్సెట్టిపేట తాలూకాలను ఆదిలాబాదు జిల్లాలో,సిద్ధిపేటను మెదక్ జిల్లాలో చేర్చడం జరిగింది.అంతవరకు వరంగల్ జిల్లాలో ఉన్న పలకాల తాలుకాలను కరీంనగర్ జిల్లాలో కలుపడంతో 1905 లో 7 తాలూకాలతో కరీంనగర్ జిల్లా ఏర్పడింది.దానితో వెయ్యేళ్లు వైభవంగా వెలిగిన వెలగందుల ప్రాభవం కాలగర్భంలో కలిసి పోయింది.మిత్రులారా!దీని తరువాత ఏడవ నిజాం పరిపాలనావిశేషాలు,భారత దేశ స్వాతంత్ర్య సిద్ధి,రజాకార్ ఉద్యమం,పోలీసు చర్య,1948 లో నైజాము పాలన నుండి హైదరాబాదు స్టేట్ భారత్ లో విలీనం,1956 దాకా హైదరాబాదు స్టేట్ గా కొనసాగి భాషప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ, పెద్దమనుషుల ఒప్పందం,1969 లో తొలి తెలంగాణల ఉద్యమం,మలిదశ తెలంగాణ ఉద్యమం జూన్ 2,2014 లో తెలంగాణా ఆవిర్భావం దాకా టూకీగా రాసి ముగిస్తాను. (సశేషం)


కామెంట్‌లు