మొల్ల రాసిన రామాయణం మనం చదివితే ఆమె ఎందరో రాసిన రామాయణాలను అధ్యయనం చేసిందని అర్థమవుతుంది, అంతేకాదు ఆమె సరళమైన భాషలో రామాయణం రాసిందంటే జనంతో ఎంతో మమేకమైతే గాని ఇంత సులభతరంగా రాయలేదు కదా! సరళంగా ఈమె రాసిన రామాయణం నేటికీ నిలిచిందంటే ప్రజల మనోభావాలకు తగినట్లుగా రాసిందని తెలుసుకోవచ్చును. మొల్లకు అబలలను బేలగా చిత్రించడం ఇష్టం లేదు. అందుకే మందర పాత్రను వదిలివేసింది. చేయవలసిన పనులన్నీ కైక పైనే వేసి కథను రసవత్తరంగా నడిపించింది. దశరథునితో మెలగిన తీరు మనకు ఆసక్తి కలిగిస్తుంది.ఆ రాత్రి రాజశేఖరుని చిత్తంబు వచ్చునట్లుగా మెలగి యాతడు మెచ్చుటెరింగి కైక ఇట్లనియె"కైక ఆ రాత్రి దశరధునితో తన అందచందాలతో అలరించి, తృప్తి పరిచింది తెల్లవారగానే ఆమె తన కోరికను వెలిబుచ్చింది. "వసుషుతీశ నాకు వరమిచ్చి తప్పుట తగువు కాదు మీకు...." ఆ క్షణములోనే తనకు రెండు వరాలు ఇవ్వమని షరతు పెట్టింది. "తగవు కాదు మీకు" అన్ని మాటలోని "మీకు" అనే పదం భావం దశరధునికి ఒక్కనికే మాత్రం సంబంధించినది కాదు. ఆ పదం వారి వంశానికే వర్తించునట్లు అంతరార్థంగా పలికింది. అందుకే దశరథుడు జవాబు చెప్పలేక పోయాడు "స్వామీ! మీ రామచంద్రుని పట్టంబు కట్ట సుముహూర్తం బాసన్నమయ్యె" అని మనవి చేయుటకు వచ్చిన సుమన్తుని తో "అనిలో నున్న న్రృపాలు చిత్తమునకే నాహ్లాదముం గూర్చి నా/ తనయుం బట్టము గట్టి రాఘవుని పద్నాలుగేళ్లు కాంతార మం /దను వర్ధిల్లగల బంపగొ న్న వరమున్ ద్రోయంగ రాదెంతశయు/న్వనసీమన్ ముని వృత్తి నుండు మనుడీ వైళంబయా రామునిన్/ ఈ పద్యంలో కైక తన ఆథిపత్యం చూపించింది. దశరథునికోసం కైక తన ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసింది. ఆ యుద్ధ విజయానికి ప్రతిఫలంగా రెండు వరాలు కోరింది. ఆ వరాలు ఇప్పుడు తీర్చమంది. ఇక్కడ రాముడని కాకుండా రాఘవుడు అంటూ సంభోదించింది. ఇక్కడ రఘువంశానికి సంబంధించిన భరతుని పట్టాభిషేకం, ఇక్ష్వాకు వంశీయుల సత్య వాక్య పరిపాలనా బాధ్యతను జతచేసి రఘు వంశీయులు ఆశ్చర్య పడునట్లు చేసింది. రామాయణానికి మూలమైన ఈ ఘటనలో కైకేయి శీలాన్ని ప్రతిభావంతంగా మొల్ల చిత్రీకరించింది. మొల్ల మనసులో రూపుదిద్దుకొన్న సీత పాత్ర తెలుగుగింటి ఆడపడుచు మూర్తిమత్వముతో కూడుకున్నది. స్వయంవరాన సీత సౌందర్యమూర్తి. అరణ్యవాసంలో అష్ట కష్టాలు అనుభవించిన పతివ్రతా శిరోమణి. అరణ్యంలో సీతా రామలక్ష్మణులు సంచరిస్తూ గోదావరి నదీ తీరానికి చేరారు. అచట పంచవటి- పర్ణశాలను నిర్మించి నివాసం ఉండడం జరిగింది. రావణునిచే ప్రేరేపించబడిన మారీచుడు బంగారు లేడి రూపంలో ఆ ప్రాంతంలో సంచరిస్తాడు. సీత రామునితో ఆ బంగారు లేడిని తెమ్మంటుంది. శ్రీరాముడు వెంటపడి లేడిని వేటాడుతూ తెస్తాడు సీతా పర్ణశాలలో కనిపించదు. రాముని దుఃఖం మరియు కోపం అవధులు దాటి పోతాయి లోకాలను నిర్మూలించాలని అనుకుంటాడు. లక్ష్మణుడు అన్నను శాంతింప చేస్తాడు. ఇది వాల్మీకి రామాయణంలో గల కథ. కాని మొల్ల రామాయణంలో ఈ ఘట్టాన్ని పూర్తిగా మార్చి వేసింది. ఈ క్రింది పద్యము ద్వారా- వచ్చెద నాకలోకమున వారలగుండెలు నాగలోకముని/గ్రోచ్చి యహీంద్ర వర్గమును గూల్చెద గవ్వపు గొండకైవడిన్/ద్రచ్చెద మర్త్యలోకము, నుదారతనేగతినైన గ్రమ్మరం/ దెచ్చదసీత నీక్షణమ దేవర చిత్తము మెచ్చునట్లుగన్// లక్ష్మణుడు కోపమునాపుకో జాలని స్థితిలో, తన పరాక్రమము ప్రదర్శించి సీతమ్మను నే తెచ్చెదనని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి లక్ష్మణుని శాంతింపజేశాడు. శాంత స్వరూపుడైన శ్రీరాముని కంటే ముక్కోపిగా పేరుగాంచిన లక్ష్మణుడు కో పించడమే తగునని మొల్ల మార్పుచేసి రాసింది.ఈ విషయంలో ఆమె కవయిత్రిగా మాత్రమేగాక లోకజ్ఞానం కలదిగా పాఠకుల మన్ననలు అందుకుంటుంది.(ఇంకా ఉంది)ఇది 38వ భాగం - బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336


కామెంట్‌లు