సీతానగరం హైస్కూలుకు మండలాఫీసుకు అర కిలోమీటర్ దూరం ఉంటుంది. హైస్కూల్ వర్క్ కన్నా మండలాఫీసు వర్క్ కే అధిక ప్రాధాన్యతని‌మ్మని జిల్లా విద్యాశాఖాధికారి వారు చెప్పారు. అయినా దేని వర్క్ దానిదే అని భావించే వాడిని. నేను ముందుగానే చెప్పాను నాకు మండల విద్యాశాఖాధికారి పదవి కన్నా ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పని చేయడమే నాకిష్టమని. అయినా జిల్లాఉన్నతాధి కారిఉత్తర్వులు ప్రకారం మండలాఫీసుకు వెళ్ళి ఆఫీసు పనులు చూసేవాడిని. అక్కడ ఆఫీసు ఆఫీసులా ఉండేదికాదు. ఆఫీసు 'డెకరం' లేదు. ఎం. ఇ. ఓ కు ఒక కుర్చీ గానీ , టేబుల్ గానీ ఉండేవికాదు. ఇద్దరు మండల రిసోర్స్ పెరసన్స్, ఒక అటెండర్ ఉండేవారు. అయితే నాకంటే ముందుగా ఉన్న ఎం. ఇ. ఓ యొక్క స్థానానికి వాళ్ళు గౌరవం ఇచ్చినట్టు లేదు. అటెండర్ కూడా తానొక ఎం. ఇ. ఓ ను అనుకుండేవాడు ఏమో !వీళ్ళందరినీ ఎవరి స్థానంలో వారిని ఉంచాను. ఎం. ఇ. ఓ కు కేటాయించిన రూంలో ఒక టేబుల్ , కుర్చీ, కాలింగ్ బెల్ ఏర్పాటు చేసాను. ఇద్దరు మండల రిసోర్స్ పెర్సన్స్ కు రెండు కుర్చీలు, ఒక టేబుల్, ఫైల్స్ కు డెస్క్ సపరేట్ గా ఏర్పాటు చేయించాను. అటెండర్ ను బయట ఉండమని చెప్పాను. లోనకు నా పెర్మిషన్ లేనిదే ఎవరినీ విడిచిపెట్టొద్దని అతనితో చెప్పాను. అలానే చాలా మంది టీచర్స్ ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటలయ్యే సరికి మండల విద్యాశాఖ అధికారి ఆఫీసుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నిజానికి వారు వారి పాఠశాలలను మూడు గంటల ముప్పై నిమిషా లకు విడిచి పెట్టాలి. తరువాత ఏదైనా పని మీద వాళ్ళ స్కూలు నుండి ఆఫీసుకు రావాలంటే కనీసం మరో అరగంట నుండి రెండు,మూడు గంటలు కాలం పడుతుంది. అటువంటిదీ మూడు గంటలకే ఆఫీసుకు వస్తున్నారంటే పాఠశాలకు వెళ్ళి సంతకం చేసి వచ్చేస్తున్నారన్నమాట. నేను వెళ్ళిన ఒకటి, రెండురోజుల్లో ఆఫీసుకు ఇలా ఆరుగురు, ఏడుగురు టీచర్స్ వచ్చారు. అది చూసిన నేను " ఈ టైంలో పాఠశాలలో ఉండ వలసిన మీరు ఆఫీసులో ఉన్నారేమిటి? ఏమైనా పని ఈ ఆఫీసులో పెండింగ్ లో ఉందా ? ఇంతకీ ఇక్కడకు శలవు పెట్టేవచ్చారా " అని ప్రశ్నలు వేసేసరికి నోళ్ళు మూగపోయాయి. ఆ మరుచటి దినం నుండి 'మూవ్ మెంట్ రిజిస్టర్ ' పెట్టాను. దీంట్లో టీచర్ పేరు, పనిచేసే పాఠశాల, పాఠశా లను ఎన్ని గంటలకు విడిచిపెట్టి టీచర్ బయలు దేరారు, ఏ పని మీద ఆఫీసుకు వచ్చారు, ఎన్ని రోజులై ఆఫీసులో ఫైల్ పెండింగ్ లో ఉంది లాంటి వివరాలు ఆ టీచర్ తెలుపవలసి ఉంటుంది. అవసరం లేకుండా ఆఫీసుకు రావటానికి వీలు లేదని, అలా వస్తే డిసిప్లినరీ ఏక్షన్ తీసుకోబడుతుందని చెప్పడం జరిగింది. ఆరోజునుండీ మరెవరూ ఆఫీసు పరిసర ప్రాంతాలలో కనిపించ లేదు. ( సశేషం) - శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు