నేను సీతానగరం హైస్కూల్ హెడ్మాష్టర్ గా పని చేస్తున్నప్పుడు బొబ్బిలి సంస్థానం హైస్కూల్లో హెడ్మాష్టర్స్ కాన్ఫరెన్స్ జిల్లా విద్యాశాఖా ధికారి వారు ఒకనాడు ఏర్పాటు చేసారు. ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తరువాత నన్ను తన పర్సనల్ రూమ్ కు రమ్మనమని తనతో తీసుకు వెళ్ళారు. అక్కడకు వెళ్లిన తరువాత నన్ను కూర్చోపెట్టి " నీతో కొన్ని విషయాలు అఫీయల్ గామాట్లాడాలి. నీవు కొంతకాలం వాటిని నీ మనసులో ఉంచుకోవాలి. ఆ పనులు జరిగిన తరువాత వాటంతట అవే ఒక్కొక్కటి బయటకు వస్తాయి.అంతవరకూ నీవు సీక్రెట్ మెయింటెయన్ చేయకతప్పదన్నారు. అలాగే అన్నాను. సీతానగరం మండలం ఎం.ఇ.ఓ ను సస్పెండ్ చేస్తూ నిన్ను ఆ స్థానంలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఎఫ్. ఏ. సీ) గావేస్తున్నా నన్నారు. ఎం.ఇ.ఓ గా ఉండటం నాకిష్టం లేదు. ఇంకెవరినైనా చూడండి అన్నాను. కౌన్సిలింగ్ లో బొబ్బిలి ఎం. ఇ. ఓ.(రెగ్యులర్)గా అవకాశం వచ్చినా వెళ్లలేదు. నాకు హెడ్మాష్టర్ పోస్ట్ సరైనది అన్నాను. అవును నిజమే కానీ ఈపరిస్థితులో నీవు ఎం. ఇ. ఓ గా ఉండక తప్పదు. పైగా నీవు మండల హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నావు. నిన్ను తప్పించి ఇంకే హెడ్మాష్టర్ కు ఎఫ్. ఏ. సి ఇచ్చినా మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్నవాడికి ఇవ్వకుండా ఇంకా ఎక్కడో ఉన్న హెడ్మాష్టర్లకు తీసుకువచ్చి ఎఫ్.ఏ.సి ఎందుకిచ్చావని ఉన్నతాధి కారులు తనను వివరణ అడుగుతారనీ , అంచేత తప్పనిసరిగా నన్ను ఆ పోష్టులో ఉండక తప్పదని అన్నారు. ఈ నెలాఖరులోగా ఏదో ప్రత్యామ్నాయం చూసి నిన్ను తప్పిస్తానన్నారు. అయినా నా మనసు ఎందుకో అంగీకరించలేదు. సస్పెండ్ కాబోయే ఎం.ఇ.ఓ నా కాలేజీ చదువులలో క్లాస్ -మేట్. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అతను ఎం. ఇ. ఓ పోస్ట్ లో చేరినప్పటి నుండీ అతనిచే పనులు చేయించుకోడానికి మండలంలో కొందరు ఉద్యోగులు కొన్ని వ్యసనాలకు బానిసను చేసి తన ఉద్యోగకర్తవ్య నిర్వహణకు దూరం చేసారు. అదే సస్పెన్షన్ కు దారితీసింది. మండల ఎడ్యు కేషనల్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. అతని స్థానంలో నన్ను మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎఫ్. ఏ. సీ గా నియమించారు. అప్పటికి ఆ మండలానికి మండల అభివృద్ధి అధికారిగానున్న లక్ష్మీగారు, మండల అధ్యక్షులుగానున్న వాకాడ నాగేశ్వరరావు గారు, ఆ మండలంలోనున్న పాఠశాలల పనితీరు గురించి చర్చించేందుకు అప్పుడప్పుడు ఆఫీసులో కూర్చునేవాళ్ళం. నేను హైస్కూల్లో పనిచేస్తున్నాను.గాబట్టి మండలంలో ఎన్నిపాఠశాలలున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి (అంటే ఏ మారుమూల, ఏ కొండల్లో ఉన్నాయి) అన్న విషయాన్ని నేను ఎం. ఇ. ఓగా తెలుసుకోవాలి. ఆ పాఠశాలలకు వెళ్ళి వాటి భౌతిక వనరులు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఆ పాఠశాలకు,ఉపాధ్యాయులకు విద్యార్థులకు కావలసిన అవసరాలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. పాఠశాలకు ప్రభుత్వ పరంగా సరఫరా చేసిన బోధనా పరికరాలేమిటి, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వాటిని ఉపాధ్యా యులు పాఠం చెప్పేటప్పు పాఠాలకనుగుణంగా వాడుతున్పారా లేదా ? ఇన్ని వందలు, వేల రూపాయల విలువైన బోధనాపరికరాలను ఏదో మూలపడేసి మట్టిపాలు జేస్తున్నారా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఇక పిల్లల మధ్యాహ్న భోజనాలు (మిడ్-డే మీల్) కు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిం చాలి. మిడ్-డే మీల్ లో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలల్లో పిల్లల హాజరుకు, హాజరుపట్టీకి చాలా వ్యత్యాసం ఉంటున్నట్టు ఆనోటా, ఈనోటా తెలుసుకోవడం జరిగింది.అదిఎంతవరకు నిజమో తెలుసుకోవాలి.( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు