మానేరు ముచ్చట్లు-- రామ్ మోహన్ రావు తుమ్మూరి --రెండవ ఆసఫ్జా నిజామలీఖాని తదనంతరం అతని కుమారుడు మీర్ అక్బరలీఖాన్ సిద్ధిఖీ బయాఫందీ బహదూర్ సికిందర్ జా ఆసఫ్ జా III క్రీ.శ.1803 లో మూడవ నిజాముగా గద్దెనెక్కాడు.ఇతని హయాంలో బ్రిటిష్ కంటోన్మెంట్ స్థాపించబడి ఆ ప్రదేశం ఇతని పేరుమీదుగా సికిందరాబాదు అని పిలువబడింది.ఇతని దివాన్ గా మునీరుల్ ముల్క్ నియమింపబడినా, ఆంగ్లేయుల ప్రోద్బలంతో పేష్కార్ గానియమింపబడిన చందూలాల్ ఆంగ్లేయులుకు అనుకూలుడవటంతో ఈ నిజాం అప్పులపాలయ్యాడని తెలుస్తున్నది.ఇతని కాలంలోనే మూసీ నదికి దక్షిణ దిశలో నిజాం ప్రధానమంత్రి మీర్ ఆలం పేరు మీద మీరాలం చెరువు నిర్మాణం జరిగింది.అప్పట్లో నగరవాసు లకు మంచినీటిఎద్దడి లేకుండా కాపాడింది ఈ చెరువు. ఇతనికాలంలో ఎలగందుల ఖిలేదార్ గా బహదూర్ ఖాన్ నియమించబడ్డాడు.బహదూర్ఖాన్ తర్వాత ఎలగందుల ఖిలేదార్ గా సయ్యద్ కరీమొద్దీన్ నియమింపబడ్డాడు.ఇతడే ఎలగందులకు తూర్పు దిశలో ఉన్న అరిపిరాలను తన పేరు మీదుగా కరీం నగర్ అని మార్చి కొత్తగ్రామం రూపొందించాడు.ఇతని సమాధి పాతబజారులో శివాలయం ఎదురుగా కాపువాడలో ఉన్నది.దాన్ని కరీమొద్దీన్ షా వలీ దర్గా అని పిలుస్తారు.ఇతను నిర్మించిన కరీంనగర్ తరువాతి కాలంలో జిల్లా కేంద్రమయ్యింది.మూడవ నిజాం తదనంతరం అతని పెద్దకుమారుడు ఫర్ఖుందా అలీఖాన్ నసీరుద్దౌలా నాలుగవ అసఫ్ జా అయ్యాడు.ఇతని కాలంలో ఇద్దరు ముగ్గురు దివాన్లు ఆంగ్లేయుల అప్పులను అరికట్టలేక రాజీనామా చేయగా తుదకు క్రీ.శ.1853 లో యువకుడు సమర్థుడైన మీర్ తరాజ్ అలీఖాన్ సాలార్ జంగ్ నియమితుడై మూడు దశాబ్దాల కాలంలో ముగ్గురు నైజాము ప్రభువుల వద్ద పని చేసి ప్రభువుల,ప్రజల,ఆంగ్లేయుల మన్ననలుపొందాడు.ఇతని హయాంలో దారుల్ ఉల్మ్ కళాశాల మరియు కేంద్ర ట్రెజరీ ఏర్పడ్డాయి.స్టంపుకాగితాలు కూడా అప్పటినుండే మొదలయ్యాయి.నాలుగవ నిజాం నసీరుద్దౌలా కాలంలోసర్కారు జిల్లాలుగా విభజించబడి జిల్లాలకు తాలూక్దార్లు (కలెక్టర్లు) నియమించబడిడారు.ఆ విధంగా ఎలగందుల కూడా జిలె ఎల్గందల్ గామారింది.అప్పటినుండి ఎల్గందల్ తాలూక్ దార్ల పరిపాలన క్రిందికి వచ్చింది.నాలుగవ నిజాము నసీరుద్దౌలా తదుపరి క్రీ.శ.1857 లో అతని కుమారుడు అఫ్జలుద్దౌలా ఐదవ నిజాముగా గద్దెనెక్కాడు.(సశేషం)


కామెంట్‌లు