జగద్గురు వాణి---నాలుగేళ్ళ క్రితం శంకర కృప అనే ఆధ్యాత్మిక మాసపత్రికకు వార్తావిశేషాలు రాస్తుండేవాడిని ఇంగ్లీషు నుంచి తెలుగులోకి. ఈ మాసపత్రిక ప్రచురణ కర్త కాశీ. వి. రావుగారీ అవకాశం కల్పించారు. ఇప్పుడు రాయడం లేదు. అయితే రాయించుకున్న రోజుల్లో ఓమారు కాశీగారు శృంగారికి తీసుకుపోయారు. ఓ మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నాం. కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం దర్శనీయ పుణ్య క్షేత్రాలలో ఒకటి. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను. ఆ పర్యటనలోనే నేను రెండు మూడు పుస్తకాలు కొనుగోలు చేశాను. వాటిలో ఒకటి జగద్గురు వాణి. శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తమ అనుగ్రహ భాషణలతో ఉపదేశాలతో అనేక ధార్మిక విషయాలు భక్తులకు బోధిస్తుంటారు. భక్తులకవి నిత్యమార్గదర్శకాలు. ఈ ఉపదేశాలను ఇంగ్లీషులో జగద్గురు స్పీక్స్ అనే శీర్షికన ఓ పుస్తకం వెలువడింది. తెలుగులో దీనిని తుమ్మలపల్లి హరిహరశర్మగారు అనువదించారు. ఎనభై ఎనిమిది పేజీల ఈ పుస్తకంలో పలు ధార్మిక విషయాలున్నాయి. శృంగేరి యతీంద్రులు, హిందూ దేవతలు, శాస్త్రాలు - పురాణాలు, శ్రీ జగద్గురువుల ఉపదేశాలు అనే అధ్యాయాలతో కూడిన ఈ పుస్తకంలో ప్రతి పేజీ అవశ్యపఠనీయం. శృంగేరి శారదా పీఠ సాంప్రదాయాలను భక్తితో గౌరవంతో అనుసరించడం సర్వులకూ క్షేమదాయకమని, తప్పనిసరిగా భగవన్నామస్మరణ చేస్తూ శ్రేయస్సును గడించాలని, సంతృప్తే ఆనందహేతువని, అందరి మంచీ కోరాలని, ధైర్యంతో మంచి పనులు చేయాలని, రాగద్వేషాలను వదలిపెట్టాలని, మాట నిలబెట్టుకోవాలి తదితర విషయాలెన్నో ఉన్న ఈ పుస్తకం అందరూ చదవతగినదే. పిల్లలతోనూ చదివించాలి. ప్రతి ఇంట ఉండదగ్గ పుస్తకమే జగద్గురు వాణి.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు