అబధ్ధమాడితే......(నీతికథ) బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.--ఉజ్జయిని పాలకుడు వీరసేనుడు సామంత రాజులు నగర ప్రముఖులతో సభలో ఉండగా, సభ లోనికి వచ్చిన సదానంద మహర్షిని ఘనంగా సత్కరించిన వీరసేనుడు 'స్వామి తమరు వచ్చిన కార్యం చెపితే తక్షణం నెరవేరుస్తాను.అన్నాడు వినయంగా చేతులు జోడించి.'మహారాజా నేను కాశీ యాత్ర వెళుతున్నాను నా ప్రయాణా నికి దారి బత్తెం ఏర్పాటు చేయించండి'అన్నాడు సదానందమహర్షి.వెంటనే సదానందుని కాశీ యాత్ర ప్రయాణానికి అన్నిఏర్పాట్లు చేయబడ్డాయి. 'రాజా పెద్దల ఎడల నీ ప్రవర్తన నన్ను సంతోష పరచింది ఏదైనా వరం కోరుకో'అన్నాడు సదానందుడు. 'మహర్షి నా రాజ్యంలో విపరీతంగా అబధ్ధాలకు అలవాటు పడిపోయారు ఎవరు అబధ్ధం చెప్పినా వారికి గాడిద చెవులు వచ్చేలా వరం ప్రసాదించండి'అన్నాడు వీరసేనుడు.'తథాస్తూ' అని రాజును దీవించిన సదానందుడు కాశీ యాత్రకు బయలు దేరి వెళ్ళాడు. మరుక్షణం నుండి ఉజ్జయిని రాజ్యంలో లక్షల మందికి గాడిద చెవులు పుట్టుకు రాసాగాయి. ఆ గాడిద చెవులు కనిపించకుండా మగవారు చెవులు కనపడకుండా తలపాగా ధరించ సాగారు.ఆడవారు చీర కొంగుతో తలపై ముసుగు వేసుకోసాగారు పిల్లలు మాత్రం గాడిద చెవులతో బహిరంగంగా తిరగ సాగారు. కొన్ని రోజులకు ఆరాజ్య ప్రజలతో పాటుగా రాజు , రాణి, మంత్రి, సేనానీకి, సైన్యానికి గాడిద చెవులు పుట్టుకు వచ్చాయి.ఇటువంటి వరం కోరుకుని తను తప్పు చేసానేమో! అని రాజు చింతించ సాగాడు. కొద్ది రోజుల అనంతరం కాశీ యాత్ర ముగించుకున్న సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళుతూ రాజుకు కనిపించి వెళదామని వచ్చాడు. మహర్షి చూసిన రాజు చేతులు జోడించి 'మహర్షి తెలియక ఇటువంటి వరంకోరుకున్నాను నాతప్పు మన్నించి ఈ వరాన్ని రద్దు చేయండి'అని వేడుకున్నాడు. 'మహారాజా అబధ్ధం చెప్పినందుకు గాడిద చెవులు వచ్చాయో వాళ్ళు బహిరంగంగా రచ్చబండ వద్ద ప్రజల ముందు,తను అబధం చెప్పడం వలన తనకు గాడిద చెవులు వచ్చాయని ఒప్పుకుంటే వారికి మామూలు చెవులు వస్తాయి.అని చెప్పిన సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ విషయం రాజు తన రాజ్యం అంతటా దండోరా వేయించాడు. ప్రజలంతా తాము అబధ్ధం చెప్పామని అంగీకరించడంతో అందరికి మామూలు చెవులు వచ్చాయి. నాటి నుండి ఆరాజ్య ప్రజలు అబధ్ధం చెప్పాలంటే బయపడుతూ నిర్బయంగా నిజమే చెపుతూ నిజాయితీగా జీవించసాగారు.ఉజ్జయిని నగర ప్రజలు అలా నిజాయితి పరులుగా మారారు. బాలలు అబధ్ధాల వలన ఎటువంటి తిప్పలు వస్తాయో తెలుసుకున్నారుగా! *** *** ***


కామెంట్‌లు