మకరంద రెక్కలు---మద్రాసులో ఉన్న రోజుల్లో ఒకానొక తమిళ కార్యక్రమానికి హాజరయ్యాను ప్రేక్షకులలో ఒకడిగా.అదొక గజల్ గాన కార్యక్రమం. తమిళంలో.రంజుగా సాగుతుండటంతో ప్రేక్షకులు పరవశంలో మునిగితేలుతున్నారు. చీకటైపోతోందని ఒకరిద్దరు ఇళ్ళకు వెళ్ళిపోదామనుకుంటున్న వేళ వేదికపైనుంచి ఓ పాట..."మరణించిన తర్వాతానా కళ్ళు తెరిచే ఉన్నాయి" అని వినిపిస్తోంది. ఈ మాటలతో వెళ్ళిపోవాలనుకున్న వారిలో ఓ ప్రశ్న....మరణించిన తర్వాతా కళ్ళు తెరిచే ఉండటమా? అదెలా? తదుపరి మాటేంటో వినాలని వెళ్ళిపోవాలనుకున్న వారూ ఆగిపోయారు. అప్పుడు గజల్ పాడుతున్నతను మీమీ సీట్లల్లో కూర్చుంటే తదుపరి పాట కొనసాగిస్తానన్నాడు.దాంతో ఎవరికి వారు తమతమ సీట్లల్లో కూర్చున్నారు. అనంతరం గాయకుడు"మరణించిన తర్వాతా కళ్ళు తెరిచే ఉన్నాయి"అని పాట మొదలెత్తి "ఇప్పుడుడూడా నీ కోసం నిరీక్షిస్తున్నాను" అని పాడగానే ఆభిమానులందరూ కవిహృదయమున్న వారందరు హర్షధ్వానాలు చేశారు. గజల్ ఆకర్షణ అంతా ఇదే. ఇందులోనే ఉందంతా. ఉర్దూ కవితలో గజల్ అనే ప్రక్రియ ఓ అద్భుతమైన రూపం. అది ఉర్దూ కవితకు శ్వాస. కొత్త పాతల కలయికతోపాటు హైకూ గుణమూ కలిసున్న గజల్ సాహిత్యం నాకెంతో ఇష్టం. నాకు రాయడం తెలీదు కానీ తెలుగులో సినారె తదితరుల కవుల గజళ్ళు ఎంతో ప్రేమతో చదివి ఆస్వాదించాను.గజల్ ప్రేమలోంచి పుట్టిన ఓ గొప్ప పువ్వు.అంతరంగంలో ఆశలే దాని వర్ణాలై ఉన్నాయి.ప్రేమబాష్పాలే మంచుబిందువులై పొంగుకొస్తాయి.జీవిత రహస్యమే దాని మకరందం.గజల్ పుష్పాలలోని మకరందాన్ని రుచి చూచి ఆస్వాదిస్తున్నప్పుడల్లా నన్ను నేను మరచిపోతాను. గజలూ, నీకొక వందనం. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు