ముందుచూపు (కథ) , బోగా పురుషోత్తం, తుంబూరు ; ఓ రైతుకు నాల్గు ఆవులు ఉండేవి. వాటి నుంచి వచ్చే పాలను పక్క ఊరికి తీసుకెళ్లి అమ్మి సొమ్ము చేసుకు వచ్చేవాడు. దీంతో అతని ఇంట్లో ఇబ్బందులేవీ లేకుండా జీవనం సంతోషంగా సాగేది. ఓ సారి తన పెద్ద కొడుక్కి మెడిసిన్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఇక చేసేదేమిలేక రైతు డబ్బుకోసం ఇతురులను అడిగినా ఇవ్వకపోవడంతో మానుకున్నాడు. చివరకు తనవద్దవున్న నాల్గు ఆవుల్లో రెండింటిని అమ్మేశాడు. వచ్చిన లక్ష రూపాయలను కొడుకు ఫీజు కట్టాడు. అయితే మునుపటిలా కాకుండా ఆదాయం తగ్గిపోవడంతో ఇచ్చే పాలనే అమ్మి వచ్చిన ఆదాయంతో జీవనం గడపసాగారు. ఉన్నట్లుo డి కూతురి ఇంజినీరింగ్ ఫీజు కూడా చెల్లించాల్సివచ్చింది. ఇక చేసేదేమీలేక వున్న రెండు ఆవుల్ని కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రైతు భార్య " వీటిని కూడా అమ్మేస్తే మనం బతికేదెలాగయ్యా..? " అని నిలదీసింది. రైతుకు తెలియక వున్న రెండు ఆవుల్ని కూడా అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో కూతురి ఇంజినీరింగ్ ఫీజు చెల్లించాడు. ఇప్పుడు భార్యా భర్త లిద్దరూ వున్న ఎకరా పొలంలో సేద్యం సేయసాగారు. మొదట సారి వరి పండించారు. పెట్టుబడి పోను నయాపైసా కూడా ఆదాయం రాలేదు. ఓ పక్క పిల్లల చదువుల ఫీజుల చెల్లింపులు , ఇటు ఇంటి ఖర్చులు భారంగా మారాయి. వున్న ఎకరా పొలాన్ని సైతం అమ్మేశారు. వచ్చిన డబ్బులు అబ్బాయి మెడిసిన్ చివరి సంవత్సరం ఫీజులచేల్లింపులకే సరిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇద్దరూ కూలి పని కెళ్లారు. కష్టించారు. పిల్లలకు మంచి చదువులు అందించారు. నాలుగేళ్లు గడిచింది. వయస్సు మీద పడుతున్న వారికి ఇక పనికెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక తాను పనికెళ్ళే ఓపిక లేదని రైతు భార్య మంచం పట్టింది. తీవ్ర అనారోగ్యంతో పైకి లేవలేక పోయింది. అది చూసిన రైతు కుమారుడు తల్లిని పరిక్షించాడు . శక్తికి మంచి మందులు రాసిఇచ్చాడు. అదే రోజు ఆ వ్యక్తి ఆ ఊరిలో కొత్తగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇప్పుడు రైతు భార్య ఆరోగ్యం మెరుగయింది. ఎంతో కష్టం చేసిన తనకు మంచి ఫలితం దక్కిందని ఆనందించింది. అనారోగ్యానికి గురైతే ఇక తన వద్ద డబ్బులు లేవన్న ఆందోళన కూడా మటుమాయమయింది. కళ్ళ ఎదుటే తనకు వైద్యం అందించే వ్యక్తిని తయారుచేసే నందుకు మనస్సు ఎంతో గర్వ పడింది. ఇన్నాళ్లు రైతు , అతని భార్య పడ్డ కష్టాలు, కన్నీళ్లకు తగిన ఫలితం దక్కిందని ఊరి వాళ్ళంతా పొగడ్తలతో ముంచెత్తుతుంటే రైతు దంపతులిద్దరూ తమ కష్టాలు మరిచి అనందంతో మురిసిపోయారు.


కామెంట్‌లు