మద్రాసులోనే తొలి విద్యుత్ ట్రామ్!--మన భారతదేశంలో ట్రామ్ వాహన సేవలు 19 వ శతాబ్దంలో మొదలయ్యాయి. 1873 లో గుర్రాలతో నడిపించిన ట్రాములను కలకత్తాలో ప్రవేశపెట్టారు.అయితే ఎలక్ట్రిక్ ట్రాముల ప్రవేశం తొలిసారిగా 1895లో మద్రాసులో జరిగింది. ముంబై, బరోడా, నాసిక్, కాన్పూరు, కేరళ, భావనగర్లలోనూ ట్రాములు నడిచాయి. కానీ కలకత్తా మినహా మిగిలిన నగరాలలో 1930 - 70 సంవత్సరాల మధ్య ట్రామ్ సేవలను ఆపేశారు.నేనిక్కడ మద్రాసుకు సంబంధించి కొన్ని విషయాలను మాత్రమే ఇస్తున్నాను. మా నాన్నగారు విజయ నగరం నుంచి 1948లో మద్రాసుకొచ్చారు. మా అమ్మానాన్నలు అప్పుడప్పుడూ ట్రాముల గురించి చెప్తుండేవారు. మద్రాసులో 1895 మే 7వ తేదీన ట్రామ్ సేవలు ప్రవేశపెట్టారు. ప్రజల కోసమూ, సరకులను తరలించడానికీ ఇవి నడిచాయి.ఇదే దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ వాహనం. రోజూ వేల మంది ట్రాములలో ప్రయాణించేవారు.మౌంట్ రోడ్డు, ప్యారీస్ కార్నర్, పూనమల్లి హైరోడ్డు, రిప్పన్ బిల్డింగ్ (సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోది)ల మధ్య ట్రాములు నడిపారు. అయితే ట్రామ్ కంపెనీ 1950 ప్రాంతంలో దివాళా తీయడంతో 1953 ఏప్రిల్ 12 వ తేదీన ఈ సేవలను ఆపేశారు.ప్రారంభంలో గ్రామాలనుంచి జనం ఈ ట్రాములను చూడటంకోసం మద్రాసుకొచ్చేవారు. ఎందుకంటే మద్రాసులో మాత్రమే ఈ ట్రాములు నడిపేవారు.పల్లెవాసులేకాకుండా నగరవాసులనూ ట్రాములు ఆకర్షించాయి. పలువురు వీటి గురించి మాట్లాడుకునేవారట. కొందరు తమ కవితలలో వ్యాసాలలో కథలలో వీటిని ప్రస్తావించారట. ప్రసిద్ధ తమిళ రచయిత పుదుమైపిత్తన్ అనే ఆయన తాను రాసిన ఎన్నో కథలలో ట్రాములను వర్ణిస్తూ రాశారు. ట్రాములకు సంబంధించి మరొక విశేషమూ ఉంది. లండన్ లో ట్రామ్ సర్వీస్ ప్రవేశపెట్టకముందే మన దేశంలో ఇవి మొదలవడమే ఆ విశేషం. ఎలక్ట్రిక్ ట్రాములు మొదట మద్రాసులో ప్రారంభమయ్యాయి.ఆ తర్వాతే ఈ ఎలక్ట్రిక్ వాహన సేవలను కలకత్తా, ముంబై తదితర నగరాలలో నడిపారు. మద్రాసులో పూనమల్లి హైరోడ్డు నుంచి మౌంట్ రోడ్డుకు చింతాద్రిపేటలోని కొన్ని మార్గాల మధ్య ట్రాములు నడిచేవి. ట్రాములు వచ్చిన కొత్తలో బోగీలకు వాకిలి తలుపులుకానీ, కిటికీ తలుపులు కానీ లేవు. 1921 తర్వాత ఆధంనీకరించి ట్రాములను నడిపారు. అప్పట్లో తొంబైకిపైగా ట్రాములుండేవి. మద్రాసు నగరంలోనే ఇరవై నాలుగు కిలోమీటర్ల మేరకు ట్రామ్ రూట్లు ఉండేవి. రైల్వే చట్టంలా ట్రామ్ రూట్ల చట్టం 1886 లో శ్రీకారం చుట్టుకుంది. ట్రామీలను ఈ చట్టం మేరకు పర్యవేక్షించారు. ట్రాములు ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు వీటిని ఆశ్చర్యంగా చూసేవారు తప్ప ఎక్కేవారు కాదు. దాంతో ప్రజలు వీటీలో ప్రయాణించేలా చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం కొంతకొలం ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించింది. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరగడంతో ట్రాములలో టిక్కెట్లిచ్చేవారు. ప్రారంభంలో సరుకుల రవాణా లేకపోవడంతో వీటిపై ఆశించిన ఆదాయం లభించలేదు. దీంతో ట్రాములు నడిపే ఎలక్ట్రిక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ మద్రాస్ ఎలక్ట్రిక్ ట్రామ్ వేస్ లిమిటెడ్ సంస్థకు అమ్మేసింది.అయితే ఈ సంస్థకూడా లాభకరంగా నడపలేకపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతకూడా కొన్ని సంవత్సరాలు నడిచిన ఈ ట్రామ్ రవాణాను చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) హయాంలో పూర్తిగా ఆపేసారు.కొందరు రాజులు కొన్ని ట్రామ్ రూట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఈ విషయంలో ప్రత్యేకించి రాణి మంగమ్మాళ్ తదితరులు ఆసక్తి చూపారు. కన్యాకుమారి - మదురైకి మధ్య రాణి మంగమ్మాళ్ ఓ హైవేను ఏర్పాటు చేశారు. పాండ్య - చేర రాజ్యాలను కలిపే వంతెనగా ఉండేది. కానీ మన భారత పాలకుల హయాంలోకన్నా ఆంగ్లేయుల పాలనలోనే దేశవ్యాప్తంగా బోలెడన్ని దారులుండేవి. ఈ మార్గాలన్నీ దేశంలోని ప్రధాన నగరాలను కలిపే విధంగా ఉండేవి. కానీ ట్రాముల వల్ల ఖర్చు తప్ప లాభాలు లేకపోవడంతో కలకత్తా మినహా ఎక్కడికక్కడ వీటి సేవలను నిలిపివేశారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు