అపర భగీరధుడు..కాటన్ దొర గారు..! --సుజాత.పి.వి.ఎల్---కాటన్ దొర లాంటి మహనీయుడ్ని నిత్యం స్మరించుకున్నా చాలు జన్మ ధన్యం..! ఎందుకిలా నేనంటున్నానో మీకు తెలియాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళక తప్పదు. వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం. తుని దాటిందగ్గర్నుంచి పచ్చకార్పెట్ కప్పినట్టున్న పొలాల మధ్యలోంచి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట లాంటి స్టేషన్లు దాటుకుంటా 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి స్టేషనొస్తుంది.."అప్పుడే రాజమండ్రి వొచ్చేశామా " అంటారెవరో అటుపక్క సీట్లో కూర్చున్న పెద్దాయన.. "ఆ.. అవునండీ" అని సమాధానమిస్తాడు పూతరేకులు అమ్ముకోడానికి వచ్చిన బక్కపలచని కుర్రాడు. .అప్పుడు మొదలవ్వుద్ది అందరిలో ఒకలాంటి హడావిడి..అయిదు నిముషాలాగి తిరిగి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే..రిజర్వేషన్ దొరక్క గుమ్మం దగ్గర మెట్ల దగ్గర కూర్చునోళ్లు ఎందుకైనా మంచిదని లోపలికొచ్చేస్తారు..కుర్రాళ్లు వాళ్ళు చేసుకుంటున్న చాటింగులాపేసి మెల్లగా గుమ్మం దగ్గర జేరతారు.. పెద్దోళ్లు వాళ్ళ వెనకాల నిలబడతారు.. అప్పటిదాకా ఒక సౌండుతో ఊగుతూ వచ్చిన రైలు అప్పట్నుంచి మరో సౌండుతో దడదడలాడుతూ లోపల కూర్చునోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.. ట్రైనంతా నిశ్శబ్దమైపోద్ది.. అన్ని తలలు కిటికీల వైపు తిరుగుతాయి... సీట్లో కూర్చున్న లేడీస్ నిద్రపోతున్న పిల్లల్ని లేపి మరీ కిటికీలోంచి చూపిస్తారు. అదే.. .. "అదిగో చూడు.. గోదావరి.. గోదావరి.. బ్రిడ్జదిగో.. ఎంత పెద్దదో చూడు.. ఇదిగో, విండోలోంచి డబ్బులెయ్యి.." అని కనుచూపు మేరంతా నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని కంపార్ట్మెంట్ కిటికీలోంచి చూపిస్తూ తనివితీరా మురిసిపోతారు... ట్రైను బ్రిడ్జి మీద నడిచిన ఆ అయిదు నిముషాలు గుమ్మం దగ్గర నిల్చునోళ్లల్లో రకరకాల ఆలోచనలు.. కోట్లాదిమంది కడుపు నింపుతున్న గోదావరి మాతని కళ్లారా ఆస్వాదించి, కడుపు నిండా గోదారి గాలి పీల్చి, వీలైనన్ని సెల్ఫీలు తీస్కుని, ఘనంగా వెనక్కొచ్చి సీట్లలో కూర్చుని, కుర్రోళ్ళు డీపీలు మార్చుకున్నాక తృప్తిగా డిన్నర్ పార్సెల్ విప్పుతారు..గోదావరి రివర్ అని... ఆల్మోస్ట్ రాజమండ్రికి ట్రైన్లో వచ్చే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది.. ఫ్లయిట్లో వచ్చినా, ట్రైనెక్కి వచ్చినా, బస్సెక్కి వచ్చినా గోదావరినదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండటం కష్టం.. ఆ పచ్చదనం చూసినోళ్లు "గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా" అని కుళ్ళుకుంటారు.. చరిత్ర తెల్సినోళ్లు మాత్రం మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు.. ఇవేమి తెలీని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారు.. అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడు.. ఆయనే సర్ధార్ కాటన్ దొర గారు.. ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొస్తే ఆకలిచావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణనష్టం మిగులుస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట.. ఎందుకంటే, ఎక్కడో నాసిక్లో పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1600 కిమీ పాటు ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్రగోదావరిగా రూపాంతరం చెంది, అదే స్పీడ్తో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ జలాలు ఉపయోగపడేవి కావంట. అలాంటి ప్రాంతానికి, విధినిర్వహణలో భాగంగా ఇంగ్లాండునించి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారుచేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు.. "ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం" అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు.. ఎన్నోసార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడుజేసుకుని మరీ నిర్మించి "నా పేరు జెప్పుకోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్" అని అక్షయపాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు.. ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాం.. ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా మా గోదారి సైడొస్తే ఈయన గురించి చెప్తూ "కాటన్ దొరగారు" అంటాం తప్పించి "కాటన్" అని ఏకవచనం కూడా వాడమండీ.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనపై ఉన్న అభిమానం.కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం.. ఆయన పేరుకు ముందు ఉన్న "అపరభగీరధుడు" అన్న బిరుదు.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
ఉపాధ్యాయుడు!!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
గణనాథా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY
ఆంధ్ర నామ సంగ్రహం ;-సేకరణ : రామానుజం.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి